Bhogapuram: భోగాపురానికి రెక్కలు

కేంద్ర ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల మంత్రులకు దక్కిన శాఖలతో రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల్లో ముందడుగు పడనుందని ఆశలు కలుగుతున్నాయి.

Updated : 11 Jun 2024 10:06 IST

విజయవాడ ఎయిర్‌పోర్టులో సమీకృత టెర్మినల్‌ పూర్తికి అవకాశం
రామ్మోహన్‌నాయుడికి పౌరవిమానయాన శాఖతో ఆశలు
తెలుగు మంత్రుల చేతుల్లో విశాఖ, బయ్యారం, కడప ఉక్కు పరిశ్రమల భవిష్యత్తు

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల మంత్రులకు దక్కిన శాఖలతో రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల్లో ముందడుగు పడనుందని ఆశలు కలుగుతున్నాయి. కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా నియమితులు కావడంతో రాష్ట్రంలో విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టుల దశ మారుతుందని అంచనా వేస్తున్నారు. విజయవాడ విమానాశ్రయ సమీకృత టెర్మినల్‌ భవన నిర్మాణం వేగం పుంజుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా రూ.611.80 కోట్లతో చేపట్టిన ఈ టెర్మినల్‌ భవన నిర్మాణం 40% మాత్రమే పూర్తయింది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం నుంచి చొరవ కొరవడటమే ఇందుకు ప్రధాన కారణం. 2024 జూన్‌ కల్లా దీన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా పెద్ద పురోగతి కనిపించలేదు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఇప్పటి వరకు రూ.225 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు ఏర్పడటం, పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌నాయుడు బాధ్యతలు చేపడుతున్నందున విజయవాడ ఎయిర్‌పోర్టుకు మహర్దశ పట్టే అవకాశాలున్నాయి. 

నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయం నిర్మించాలని గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం 2016 అక్టోబర్‌ 7న సూత్రప్రాయ అనుమతులు మంజూరు చేసింది. విమానాశ్రయ అభివృద్ధి పనులను ఎస్‌సీఎల్‌ టర్బో కన్సార్షియానికి అప్పగించారు. నెల్లూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ (ఎన్‌ఐఏఎల్‌)పేరుతో ఎస్‌పీవీ కూడా ఏర్పాటు చేశారు. 2018 జూన్‌లో ఎన్‌ఐఏఎల్‌తో రాయితీ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టును పక్కనపెట్టేసింది. విమానాశ్రయానికి కేటాయించిన భూములనూ రద్దు చేసింది. పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌నాయుడు నియమితులైన నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి మార్గం ఏర్పడనుంది. పుట్టపర్తిలో ప్రస్తుతం సత్యసాయి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉన్న విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకొని రాయలసీమ ప్రాంతానికి విమాన సేవలను విస్తరించాలని, అక్కడ పైలెట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం అమలుకూ మార్గం సుగమం కానుంది. 

భోగాపురం ఎయిర్‌పోర్టుకూ రెక్కలు 

హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించిన అనుభవంతో చంద్రబాబు విశాఖపట్నం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ- విజయనగరం మధ్య భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదిపారు. అప్పట్లో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా తెదేపా ఎంపీ అశోక్‌గజపతిరాజు ఉండటంతో 2016 జనవరిలో స్థల అనుమతులు, అక్టోబర్‌లో సూత్రప్రాయ అనుమతులు లభించాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో  నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు బాధ్యతలను జీఎంఆర్‌ సంస్థకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం, జీఎంఆర్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు తొలి దశను ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలకు వీలుగా నిర్మించనున్నారు. ఇందుకు అవసరమైన 2,203 ఎకరాల భూమిని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ప్రాజెక్టు ప్రాథమిక వ్యయం రూ.2,500 కోట్లు. అయితే తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో విపరీతమైన జాప్యం చేసింది. ఈ నేపథ్యంలో అంచనా వ్యయం ఎంత పెరిగిందో తెలియదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో సహకరించనున్నందున భోగాపురం విమానాశ్రయం త్వరితగతిన పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది పూర్తయితే విశాఖపట్నానికి అంతర్జాతీయ విమాన రాకపోకలు పెరిగి పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధికి బాటలు పడతాయి. 


‘ఉక్కు’భవిష్యత్తు మారనుందా?

విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల నుంచి గట్టెక్కించడానికి కేప్టివ్‌ బొగ్గు, ఇనుప గనులు కేటాయించాలని కార్మికులు సుదీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగువాడైన కిషన్‌రెడ్డి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా నియమితులవడంతో ఈ డిమాండ్‌ను నెరవేర్చేందుకు వీలు ఏర్పడింది. నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ ఉక్కు శాఖ సహాయమంత్రిగా నియమితులవడం వల్ల విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడంతోపాటు, విభజన చట్టంలో చెప్పినట్లుగా బయ్యారం, కడపల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడానికి వీలవుతుందన్న భావనా వ్యక్తమవుతోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని