Telangana EAPCET: తెలంగాణ ఎప్‌సెట్‌లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి

తెలంగాణ ఎప్‌సెట్‌-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తదితరులు విడుదల చేశారు.

Published : 19 May 2024 05:14 IST

ఇంజినీరింగ్‌లో జ్యోతిరాదిత్యకు, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగంలో ప్రణీతకు ప్రథమ ర్యాంకులు
ఇంజినీరింగ్‌లో 74.98%, అగ్రికల్చర్‌లో 89.66% మంది ఉత్తీర్ణత

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎప్‌సెట్‌-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్‌ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ మొదటి పది ర్యాంకుల్లో తొమ్మిది, అగ్రికల్చర్‌ విభాగంలో మొదటి పదిలో ఏడు ర్యాంకులను బాలురు సొంతం చేసుకున్నారు. రెండు విభాగాల్లోనూ తొలి ర్యాంకులను ఏపీ విద్యార్థులే దక్కించుకున్నారు. ఇంజినీరింగ్‌లో శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య 160కి 155.63 మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అగ్రికల్చర్‌ విభాగంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకి చెందిన అలూరు ప్రణీత 146.44 మార్కులు పొంది అగ్రస్థానంలో నిలిచింది. ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను వారం రోజుల్లో విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

అమ్మాయిలదే పైచేయి: టాపర్లలో అబ్బాయిలు సత్తా చాటుతున్నా ఉత్తీర్ణత శాతంలో మాత్రం అమ్మాయిలు పైచేయి సాధిస్తున్నారు. ఇంజినీరింగ్‌లో అబ్బాయిలు, అమ్మాయిలు వరుసగా 74.38, 75.85% మంది పాసయ్యారు. అగ్రికల్చర్‌లో అబ్బాయిలు, అమ్మాయిలు వరుసగా 88.25, 90.18% మంది ఉత్తీర్ణులయ్యారు.

ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం

తెలంగాణ ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య తొలి ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ఐఐటీలో సీటు సాధించడమే తన లక్ష్యమని ‘న్యూస్‌టుడే’కు తెలిపాడు. తల్లిదండ్రులు హైమావతి, మోహనరావు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులని, వారి ప్రోత్సాహంతో ఈ విజయం సాధించినట్లు చెప్పాడు. 

  • బొంబే ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేయాలనేది తన లక్ష్యమని 2వ ర్యాంకు సాధించిన కర్నూలు విద్యార్థి జి.ఎల్‌.హర్ష తెలిపాడు. నాన్న సూర్యకుమార్‌ విశాఖ పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్‌ విభాగం ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారని, తల్లి సుహాసిని గృహిణి అని, ప్రణాళికాబద్ధంగా చదివించారని వెల్లడించాడు.  
  • కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మూడో ర్యాంక్‌ సాధించిన హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన రుషిశేఖర్‌ శుక్లా తెలిపాడు. తల్లిదండ్రులు ఇస్రో శాస్త్రవేత్తలు కావడంతో స్ఫూర్తినిచ్చారని వెల్లడించాడు.

వైద్యులు కావడమే లక్ష్యం

టీఎస్‌ఎప్‌సెట్‌లో మొదటి ర్యాంకు రావడం సంతోషంగా ఉందని అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన అలూర్‌ ప్రణీత చెప్పారు. దిల్లీ ఎయిమ్స్‌లో వైద్య విద్య చదివి గుండె వైద్యురాలిగా సేవలందించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. నాన్న శ్రీకర్‌ హోమియో వైద్యులు, అమ్మ కల్యాణి ప్రైవేటు పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయురాలని వారి స్ఫూర్తితో ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. 

  • నీట్‌ రాసి మంచి ర్యాంకు సాధించి కార్డియాలజిస్టు కావాలన్నదే నా అభిమతమని 2వ ర్యాంకర్, పార్వతీపురం మన్యంజిల్లా బలిజిపేటకు చెందిన నాగు దాసరి రాధాకృష్ణ తెలిపాడు. తల్లిదండ్రులు నారాయణరావు, కృష్ణవేణి, తాతయ్య జగన్నాథరావు ప్రోత్సాహంతో ఈ విజయం సాధించినట్లు వెల్లడించాడు.
  • హనుమకొండ రెడ్డికాలనీకి చెందిన గడ్డం కన్నయ్య, లావణ్య దంపతుల కుమార్తె గడ్డం శ్రీవర్షిణి రాష్ట్రస్థాయి మూడో ర్యాంకు సాధించింది. డాక్టర్‌ కావడమే తన లక్ష్యమని, ఇటీవల నీట్‌ కూడా బాగా రాశానని, మంచి ర్యాంకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని