VA ECMO: ఏపీలో తొలిసారి వీఏ ఎక్మోతో చికిత్స

రాష్ట్రంలో తొలిసారి వీఏ ఎక్మో సాయంతో చికిత్స అందించి యువకుడి ప్రాణాలు కాపాడినట్లు గుంటూరులోని ఆస్టర్‌ రమేష్‌ ఆసుపత్రి సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ రామారావు తెలిపారు.

Updated : 26 May 2024 06:45 IST

యువ ఇంజినీర్‌ను కాపాడిన రమేష్‌ ఆసుపత్రి

సమావేశంలో పాల్గొన్న సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ రామారావు, వైద్య సిబ్బంది, బాధితుడు

గుంటూరు (నగరంపాలెం), న్యూస్‌టుడే: రాష్ట్రంలో తొలిసారి వీఏ ఎక్మో సాయంతో చికిత్స అందించి యువకుడి ప్రాణాలు కాపాడినట్లు గుంటూరులోని ఆస్టర్‌ రమేష్‌ ఆసుపత్రి సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ రామారావు తెలిపారు. గుంటూరులోని ఆసుపత్రిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ‘మంగళగిరికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌(35)కు కొద్ది రోజుల క్రితం ఛాతీలో నొప్పిగా అనిపించింది. ఎంతసేపటికీ నొప్పి తగ్గకపోవడంతో మంగళగిరిలోని ఓ నర్సింగ్‌హోంకు వెళ్లారు. వారు ఈసీజీ తీసి.. గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు బాధితుడు ఆస్టర్‌ రమేష్‌ ఆసుపత్రికి వచ్చారు. గుండె వైద్య నిపుణుల బృందం ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించగా.. గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గిపోవడం, కార్డియోజెనిక్‌ షాక్, పల్మనరీ ఎడిమా వంటి క్లిష్టమైన పరిస్థితిలో సదరు యువకుడు ఉన్నట్లు గుర్తించాము. వెంటనే వెంటిలేటర్‌ మీద పెట్టి, ఇంట్రా అయోటిక్‌ బెలూన్‌ పంపు అమర్చి యాంజియోగ్రామ్‌ పరీక్ష నిర్వహించాం. గుండెకు రక్తాన్ని అందించే ప్రధాన రక్తనాళం వందశాతం గడ్డలతో పూడిపోయి ఉండటం గమనించి, చికిత్స ద్వారా వాటిని తొలగించాము. అయినా గుండె పనితీరు మెరుగుపడలేదు. తీవ్రమైన గుండెపోటు కారణంగా రోగి ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి, మూత్రపిండాల పనితీరు మందగించింది. దీంతో రోగి సహాయకులను సంప్రదించి వీఏ ఎక్మోను అనుసంధానించాము. కార్డియోజెనిక్‌ షాక్‌ నుంచి కోలుకున్న తర్వాత ఐదు రోజులకు ఎక్మోను తొలగించాము. లెఫ్ట్‌ వెయిన్‌ (ఎడమ సిర) వందశాతం మూసుకుపోయిన స్థితిలో వచ్చిన రోగికి ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చికిత్స అందించి, ఇంట్రా అయోటిక్‌ బెలూన్‌ పంప్, ఎక్మో సహాయంతో ప్రాణాలు కాపాడాం’ అని సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ రామారావు తెలిపారు. ఈ సందర్భంగా యువకుడికి చికిత్స అందించిన వైద్యులు రామారావు, శిల్పా చౌదరి, జయరామ్‌ పాయ్, శివప్రసాద్, బికాస్‌ సాహులతో కూడిన బృందాన్ని ఆసుపత్రి ఎండీ రమేష్‌బాబు అభినందించారు. సమావేశంలో ఆసుపత్రి డిప్యూటీ ఎండీ రాయపాటి మమత, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ కార్తీక్‌ చౌదరి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని