NIN: రోజుకు రెండు చెంచాల నెయ్యి చాలు

‘ఒకసారి మరిగించిన వంట నూనెను మరోసారి వాడకూడదు. ఇళ్లలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. మరిగించిన నూనెను తాలింపునకు వాడొచ్చు.

Updated : 29 May 2024 08:02 IST

వనస్పతి వాడొద్దు.. మరిగించిన నూనెలొద్దు
పండ్లు తినేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి
మద్యంతో అన్నీ అనర్థాలే..
ఎన్‌ఐఎన్‌ కొత్త మార్గదర్శకాలు

‘ఒకసారి మరిగించిన వంట నూనెను మరోసారి వాడకూడదు. ఇళ్లలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. మరిగించిన నూనెను తాలింపునకు వాడొచ్చు. అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. డ్రై ఫ్రూట్స్, నూనెగింజలు వంటివి, సముద్రపు చేపలు, కోడిగుడ్లు తీసుకోవడం మంచిది’ అని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) వెల్లడించింది. ‘వారానికి 200 గ్రాముల వరకు చేపలు తీసుకోవచ్చు. రెడీ-టూ-ఈట్‌- ఫాస్ట్‌ఫుడ్‌ ఐటమ్స్‌కు దూరంగా ఉండాలి. వనస్పతిని అసలు వాడకూడదు (బేకరీ ఉత్పత్తుల్లో ఎక్కువగా దీన్ని వాడుతున్నారు). రోజుకు ఒకటి లేదా రెండు చెంచాల వరకు మాత్రమే నెయ్యి/ బటర్‌ తీసుకోవచ్చు. గడ్డ కట్టి ఉండే నూనెలను తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం. పనిచేసే పురుషులు రోజుకు 40 నుంచి 50 గ్రాముల వరకు, మహిళలు 30 నుంచి 40 గ్రాముల వరకు కొవ్వు పదార్థాలు తీసుకోవచ్చు. పనులకు దూరంగా ఉండే పురుషులు, మహిళలు.. 20 గ్రాముల నుంచి 30 గ్రాముల వరకు కొవ్వు పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. శరీరానికి అందించే మొత్తం కేలరీల్లో కొవ్వు సంబంధిత ఆహార పదార్థాలు, ఉత్పత్తులు 30 శాతం లోపే ఉండాలి’ అంటూ ఎన్‌ఐఎన్‌ ఇటీవల కొత్త ఆహార మార్గదర్శకాలు జారీచేసింది. ముఖ్యాంశాలివీ..


10-15 నిమిషాలు మరిగించిన నీరు మేలు

అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మరిగించిన నీటిని తాగడం అన్ని విధాలా శ్రేయస్కరం. 10 నుంచి 15 నిమిషాలపాటు మరిగించిన నీటిని తాగడం మంచిది. దీనివల్ల సూక్ష్మజీవులు నీటిలో ఉండవు. 20 లీటర్ల నీటిలో 0.5 ఎంజీ క్లోరిన్‌ మాత్రను వేస్తే మరీ మంచిది. దీనివల్ల రసాయనాల ప్రభావ ముప్పు తప్పుతుంది. లీటర్‌ నీటిలో 1.5 ఎం.జి.కి మించి ఫోర్లైడ్‌ ఉండకూడదు. అంతకంటే ఎక్కువైతే.. ఫ్లోరైడ్‌ ప్రభావం ఉన్నట్లుగా పరిగణించి, జాగ్రత్తపడాలి.


పండ్ల రసాలతో దంతాలకు ప్రమాదం

పండ్లు తినాలి. వీటిని తినడంతో శరీరానికి వచ్చేంత ప్రయోజనం..  పండ్ల రసాల వల్ల రాదు. జ్యూస్‌ రోజుకు 100- 150 మి.లీ. మాత్రమే తీసుకోవాలి. వంద మి.లీ. చెరకు రసంలో 13 నుంచి 15 గ్రాముల వరకు చక్కెర ఉంటుంది. ప్యాకేజ్డ్‌ పదార్థాల (ఆహార ఉత్పత్తుల)పై ఉండే ఫుడ్‌ లేబుళ్లు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఫ్రూట్‌ జ్యూస్‌ల్లో కేవలం 10% మాత్రమే పండ్ల గుజ్జు ఉంటుంది. ఇవి దంతాలకు కూడా మంచిది కాదు. పండ్ల రసాలు తీసుకోవాలనుకుంటే మాత్రం చక్కెర కలపకుండా చూసుకోవాలి.


రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి

శరీరంలోని అవయవాలకు నీరు చాలా అవసరం. శరీరంలోని జీవక్రియల్లో ఉత్పత్తి అయ్యే మలినాలను కిడ్నీల ద్వారా బయటకు పంపించడంలో నీరు కీలకపాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. మూత్రం, చెమట, మలం ద్వారా మలినాలు బయటకు పోయేందుకు.. శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థాయిలో ఉంచేందుకు.. సున్నితమైన కణజలాలు దెబ్బతినకుండా ఉండేందుకు.. కీళ్లు తేలికగా కదలడానికి కూడా నీరు తోడ్పడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లబరుస్తుంది. చల్లటి వాతావరణానికి తగినట్లు శరీరాన్ని మారుస్తుంది. ఒంట్లో నీటి శాతం తగ్గితే ఉత్సాహం సన్నగిల్లుతుంది. ఆలసట ముంచుకొస్తుంది. సాధారణ వ్యక్తులు రోజుకు 8 గ్లాసుల (కనీసం రెండు లీటర్ల) నీటిని తాగాలి. మూడు లీటర్ల వరకు తీసుకోవచ్చు. 100 మి.లీ. కొబ్బరి నీళ్లు తీసుకుంటే 15 కేలరీలు లభిస్తాయి. అన్ని వయసుల వారు పాలు తీసుకోవచ్చు. మనిషి ఎదుగుదలకు పాలు కాల్షియం రూపంలో అన్ని విధాలా తోడ్పడుతుంది. శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. 


మద్యంతో అన్నీ సమస్యలే!

రోజుకి 60 మి.లీ. కన్నా ఎక్కువగా మద్యం తీసుకునే వారికి రక్తపోటు ప్రమాదం ఎక్కువ. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అధిక మద్యపానం నోటి క్యాన్సర్‌కు కూడా కారణం కావచ్చు. ఇతర అనారోగ్య సమస్యలు తీవ్రస్థాయిలో తలెత్తుతాయి. ఇథైల్‌ ఆల్కహాల్‌ బీరులో 2-5% ,వైన్‌లో 8-10%, బ్రాందీ, రమ్, విస్కీలో 30 నుంచి 40% వరకు ఉంటుంది.


అధిక బరువుతో జాగ్రత్త!

నేటి యువత 20 ఏళ్ల వయసు నుంచే బరువు పెరుగుతున్నారు. మహిళల్లో తొలి కాన్పు అనంతరం బరువు పెరుగుదల కనిపిస్తోంది. బరువు తగ్గించే ప్రక్రియ నిదానంగా జరగాలి. హడావుడిగా వ్యవహరిస్తే ముప్పు ఏర్పడవచ్చు. చక్కెర వినియోగ శాతం తగ్గించాలి. రిఫైన్డ్‌ ఆయిల్‌ వాడకూడదు. ఫ్రై ఫుడ్స్, రిఫైన్డ్‌ ఫుడ్స్, సాఫ్ట్‌ డ్రింక్, మద్యం సేవించడం శ్రేయస్కరం కాదు. రోజుకు 7-8 గంటల వరకు నిద్రపోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే..పొటాషియం పెరుగుతుంది. రక్త ప్రసరణ బాగుంటుంది. ఫ్రిజ్‌లో ఉంచిన ఆహార పదార్థాలను వేడి చేసిన తర్వాతే తినాలి. అయితే పదేపదే ఇలా చేయకూడదు. వండిన ఆహార పదార్థాలను ఆరు గంటల్లోగా తీసుకోవడం మంచిది.


ఈనాడు, అమరావతి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని