Election Results: ఎన్నికల ఫలితాలతో రూ.14,800 కోట్లు చైనాకు

విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) పెద్దఎత్తున పెట్టుబడులను దేశీయ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు.

Published : 10 Jun 2024 02:10 IST

భారత మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐల తరలింపు

దిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) పెద్దఎత్తున పెట్టుబడులను దేశీయ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడం.. అదే సమయంలో చైనా స్టాక్‌ మార్కెట్‌ ఆకర్షణీయంగా ఉండటంతో ఈ నెల మొదటి వారంలో ఎఫ్‌పీఐలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో దాదాపు రూ.14,800 కోట్ల విక్రయాలు చేశారు.

ఆకర్షణీయంగా చైనా మార్కెట్‌..: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. దీంతో మార్కెట్‌ బాగా రాణించింది. ఫలితాలు అందుకు భిన్నంగా రావడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సూచీలు నష్టాలను చవిచూశాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం వల్ల విదేశీ పెట్టుబడుదారులు ఆందోళన చెందుతున్నారని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో చైనా స్టాక్‌ మార్కెట్‌ ఆకర్షణీయంగా కనిపించడంతో పెట్టుబడులు అక్కడికి తరలి వెళ్లాయంటున్నారు.

డెట్‌ మార్కెట్లోకి మాత్రం..: డెట్‌ మార్కెట్‌లో మాత్రం ఎఫ్‌పీఐలు ఈ నెల మొదటి వారంలో రూ.4,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. మార్చిలో రూ.13,602 కోట్లు, ఫిబ్రవరిలో రూ.22,419 కోట్లు, జనవరిలో రూ.19,836 కోట్ల మేర కొనుగోళ్లు చేపట్టారు. జేపీ మోర్గాన్‌ సూచీలో భారత ప్రభుత్వ బాండ్లు చేరడంతో ఈ పెట్టుబడులు వచ్చాయి. ఇలా మొత్తంగా 2024లో ఎఫ్‌పీఐలు ఇప్పటివరకు ఈక్విటీల నుంచి రూ.38,158 కోట్ల నికర అమ్మకాలు చేపట్టగా.. డెట్‌ మార్కెట్లో రూ.57,677 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని