Infosys Ltd: ఆదాయ అంచనాలను మించిన ఇన్ఫీ

Eenadu icon
By Business News Desk Updated : 18 Apr 2025 04:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

జనవరి-మార్చిలో 11.7% తగ్గిన లాభం
వరుసగా మూడో త్రైమాసికమూ పెరిగిన ఉద్యోగులు

‘‘మాపై నమ్మకం ఉంచుతున్న క్లయింట్ల కోసం ఒక బలమైన సంస్థను మేం నిర్మించాం. అంచనాలను మించి రాణిస్తున్న మా ఉద్యోగుల కర్తవ్యదీక్షకు కృతజ్ఞతలు. పూర్తి ఆర్థిక సంవత్సర ఆదాయాలు పెరిగాయి. ఆపరేటింగ్‌ మార్జిన్లూ పెంచుకున్నాం. ఏఐ, క్లౌడ్, డిజిటల్‌ విభాగాల్లో క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా పనిచేశాం.’’

ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ సలీల్‌ పరేఖ్‌


దిల్లీ

దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్, 2024-25 జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.7,033 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2023-24 ఇదే కాల లాభం రూ.7,969 కోట్ల తో పోలిస్తే ఇది 11.7% తక్కువ. ఆదాయాలు మాత్రం రూ.37,923 కోట్ల నుంచి 7.9% పెరిగి రూ.40,925 కోట్లకు చేరాయి. డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే లాభం 3.3% పెరగ్గా.. ఆదాయాలు 2% తగ్గాయి. నిర్వహణ మార్జిన్‌ ఏడాది వారీగా 0.9% పెరగ్గా.. త్రైమాసికం వారీగా 0.3% తగ్గింది.  

2024-25 ఆదాయం  రూ.1,62,990 కోట్లు

గత ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయ అంచనాలను ఇన్ఫోసిస్‌ అధిగమించింది. 2023-24తో పోలిస్తే 2024-25లో ఆదాయం 4.5-5 శాతం పెరుగుతుందన్న సంస్థ సవరించిన అంచనాలను మించి, 6.06%  వృద్ధితో రూ.1,62,990 కోట్లుగా నమోదైంది. 2024-25కు తొలి ఆదాయ వృద్ధి అంచనా 3.75-4.50 శాతమే. గత ఆర్థిక సంవత్సరంలో 11.6 బిలియన్‌ డాలర్ల విలువైన పెద్ద ఒప్పందం కుదరడం ఇందుకు ఉపకరించింది. నికర లాభం 1.8% వృద్ధితో రూ.26,713 కోట్లుగా నమోదైంది. 2024-25లో నిర్వహణ కార్యకలాపాల ద్వారా వచ్చిన నికర నగదు 4.1 బి. డాలర్లుగా ఉంది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికమని సీఎఫ్‌ఓ జయేశ్‌ సంఘ్రాజ్‌కా పేర్కొన్నారు.

అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి స్థిర కరెన్సీ ప్రాతిపదికన 0-3% నమోదు కావొచ్చని ఇన్ఫోసిస్‌ అంచనా వేసింది.

పెరిగిన ఉద్యోగుల సంఖ్య

2025 మార్చి చివరకు కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,23,578గా నమోదైంది. 2024 ఇదే సమయంతో పోలిస్తే 6,388 మందిని జత చేసుకుంది. మార్చి త్రైమాసికంలో 199 మంది ఉద్యోగులను నికరంగా చేర్చుకుంది. అంతక్రితం రెండు త్రైమాసికాల్లో 5591 (క్యూ3), 2,456(క్యూ2) చొప్పున ఉద్యోగులను జత చేసుకున్న సంగతి విదితమే. వలసల రేటు డిసెంబరు త్రైమాసికంలో 13.7% కాగా, మార్చి త్రైమాసికంలో 14.1 శాతానికి పెరిగింది.

తుది డివిడెండు రూ.22: మధ్యంతర డివిడెండుతో కలిపి ఒక్కో షేరుకు రూ.22 చొప్పున తుది డివిడెండును బోర్డు ప్రతిపాదించింది. 2023-24తో పోలిస్తే ఇది 13.2% అధికం..


ఈ ఏడాదిలో 20,000 మంది తాజా ఉత్తీర్ణులను తీసుకుంటాం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది తాజా ఉత్తీర్ణులను నియమించుకునే దిశగా పయనిస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ సీఈఓ, ఎండీ సలీల్‌ పరేఖ్‌ స్పష్టం చేశారు. మా లక్ష్యానికి అనుగుణంగా 20,000 నియామకాలు చేపడతామని సీఎఫ్‌ఓ కూడా తెలిపారు. కంపెనీ ఇటీవలే తన మైసూరు క్యాంపస్‌లో 400 మంది ట్రైనీలను లేఆఫ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

సవాళ్లున్నా రాణించాం: ‘మా ఉద్యోగులకు అధిక వేరియబుల్‌ పే చెల్లించాం. కంపెనీల కొనుగోళ్ల ప్రభావమూ పడింది. ఇటువంటి సవాళ్లు ఎదురైనా మా మార్జిన్లు 50 బేసిస్‌ పాయింట్లు పెరిగాయ’ని సలీల్‌ పేర్కొన్నారు. బీఎస్‌ఈలో కంపెనీ షేరు 0.51% లాభంతో రూ.1420.20 వద్ద స్థిరపడింది. మార్కెట్‌ అనంతరం ఫలితాలు వెలువడ్డాయి.


రూ.840 కోట్లతో రెండు విదేశీ కంపెనీల కొనుగోలు!

స్ట్రేలియాకు చెందిన సైబర్‌భద్రతా సేవల సంస్థ ద మిస్సింగ్‌ లింక్‌ను 98 మి. డాలర్లు (రూ.532 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇన్ఫీ తెలిపింది. ఇన్ఫోసిస్‌ సింగపూర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా ఈ కొనుగోలు పూర్తి చేయనుంది. అమెరికాకు చెందిన టెక్నాలజీ, బిజినెస్‌ కన్సల్టింగ్‌ సంస్థ ఎమ్‌ఆర్‌ఈ కన్సల్టింగ్‌ను 36 మి. డాలర్ల(దాదాపు రూ.307.4 కోట్ల)తో తన అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్‌ నోవా హోల్డింగ్స్‌ ఎల్‌ఎల్‌సీ ద్వారా కొనుగోలు చేస్తామంది. పూర్తిగా నగదు రూపంలో జరిగే ఈ రెండు ఒప్పందాలు ప్రస్తుత త్రైమాసికంలో పూర్తికావొచ్చని అంచనా.

ఇన్ఫోసిస్‌ ఆధ్వర్యంలోని సంయుక్త సంస్థ వెంచర్‌ హైపస్‌లో మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ (ఎమ్‌హెచ్‌ఐ) 150 మిలియన్‌ జపనీస్‌ యెన్‌లు (దాదాపు రూ.8.9 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ఇన్ఫీ తెలిపింది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్‌ సింగపూర్‌లో 2% వాటాను మిత్సుబిషి పొందనుంది.

Tags :
Published : 18 Apr 2025 02:38 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని