RBI Board: కొత్త ప్రభుత్వానికి రూ.2.11 లక్షల కోట్లు

ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి సాంత్వన చేకూరే ఆర్థిక నిర్ణయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనంతగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లిస్తామని ప్రకటించింది.

Published : 23 May 2024 02:12 IST

డివిడెండ్‌ రూపంలో చెల్లించేందుకు ఆమోదం తెలిపిన ఆర్‌బీఐ బోర్డు

ముంబయి: ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వానికి సాంత్వన చేకూరే ఆర్థిక నిర్ణయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనంతగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లిస్తామని ప్రకటించింది. గత ఫిబ్రవరిలో రూపొందించిన 2024-25 తాత్కాలిక బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసిన రూ.1.02 లక్షల కోట్లకు రెట్టింపు మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లించాలని బుధవారం జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశం నిర్ణయించింది. 2022-23కు సంబంధించి, ఆర్‌బీఐ మిగులు నిధుల్లో రూ.87,416 కోట్లను డివిడెండ్‌ రూపంలో ప్రభుత్వానికి చెల్లించిన సంగతి విదితమే.

  • 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.1.76 లక్షల కోట్ల డివిడెండ్‌ను చెల్లించిన ఆర్‌బీఐ, అంతకుమించి రూ.2,10,874 కోట్లను చెల్లించేందుకు సిద్ధమైంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలో జరిగిన ఆర్‌బీఐ డైరెక్టర్ల కేంద్ర బోర్డు 608వ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపింది. 
  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును (ఆదాయం-వ్యయం మధ్య వ్యత్యాసం) రూ.17.34 లక్షల కోట్లకు (జీడీపీలో 5.1%) పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఆర్‌బీఐ భారీ డివిడెండ్‌ ప్రకటన కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి ఉపశమనం కలిగించనుంది.
  • 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ కంటింజెంట్‌ రిస్క్‌ బఫర్‌ (సీఆర్‌బీ)ను 6 శాతం వద్ద ఉంచింది. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పుంజుకోవడంతో దీన్ని 6.5 శాతం చేయాలని బోర్డు నిర్ణయించింది. 2018-19 నుంచి 2021-22 మధ్య సీఆర్‌బీ 5.5 శాతంగా ఉండేది.

ఆర్‌బీఐ వద్ద మిగులు నిధులు ఇలా: ఆర్‌బీఐ ఆదాయం, వ్యయాల మధ్య తేడానే మిగులు నిధులుగా వ్యవహరిస్తారు. 

ఆదాయం: దేశ, విదేశీ సెక్యూరిటీలపై వడ్డీ, సేవలపై రసుములు-కమీషన్లు, విదేశీ మారకపు ద్రవ్యం లావాదేవీలపై లాభం, అనుబంధ సంస్థల నుంచి ప్రతిఫలం రూపేణ ఆర్‌బీఐకు ఆదాయం లభిస్తుంది. 

వ్యయాలు: కరెన్సీ నోట్ల ముద్రణ, డిపాజిట్లు-రుణాలపై వడ్డీల చెల్లింపులు, సిబ్బంది జీతభత్యాలు-పింఛన్లు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులు, ఆకస్మిక పరిస్థితులు- తరుగుదలకు కేటాయింపులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని