Adani Enterprises: బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలోకి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌?

Adani Enterprises: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు విలువ గత ఐదు నెలల్లో దాదాపు 10 శాతం పెరిగింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ సూచీలో ఇది చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published : 23 May 2024 15:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (Sensex) సూచీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (AEL) చోటు దక్కించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని ఐఐఎఫ్‌ఎల్‌ ఆల్టర్నేటివ్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. సూచీ అర్ధవార్షిక పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా విప్రో స్థానంలో అదానీ కంపెనీ వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. అదే జరిగితే సెన్సెక్స్‌ సూచీలో చేరిన తొలి అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీగా ఏఈఎల్‌ నిలుస్తుంది.

మే 24న సెన్సెక్స్‌ సూచీలోని కంపెనీలో పునర్‌వ్యవస్థీకరణపై అధికారిక నిర్ణయం వెలువడనుంది. జూన్‌ నుంచి ఈ మార్పులను అమలుచేస్తారు. వాస్తవానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2023లో సూచీలో చేరుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. కానీ, హిండెన్‌బర్గ్‌ నివేదిక దానికి గండి కొట్టింది. సెన్సెక్స్‌లో అదానీ చేరికతో ఈ ఇండెక్స్‌ను ట్రాక్‌ చేసే పాసివ్‌ ఫండ్స్‌ నుంచి దాదాపు రూ.1,000 కోట్ల వరకు వచ్చి చేరే అవకాశం ఉందని ఐఐఎఫ్‌ఎల్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. ఏఈఎల్‌ స్టాక్‌ జనవరి నుంచి 10 శాతానికి పైగా పుంజుకుంది. ఈరోజు దాదాపు ఆరు శాతానికి పైగా పెరగడం విశేషం.

(గమనిక: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి నష్టభయంతో కూడుకొన్న వ్యవహారం. స్టాక్స్‌లలో పెట్టుబడి పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం. పై వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే.)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని