Amazon Q: చాట్‌జీపీటీకి పోటీగా అమెజాన్‌ ‘క్యూ’

Amazon Q | కంటెంట్‌ను సృష్టించడం, బ్లాగ్‌ పోస్ట్‌లను రాయడం వంటి పనులను ‘క్యూ’ సులభంగా చేస్తుందని అమెజాన్‌ వెల్లడించింది.

Published : 29 Nov 2023 15:46 IST

న్యూయార్క్‌: చాట్‌జీపీటీ (ChatGPT)కి పోటీగా అమెజాన్ తమ ‘జనరేటివ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌’ బిజినెస్‌ చాట్‌బాట్‌ ‘క్యూ’ (Amazon Q)ను తీసుకొచ్చింది. లాస్‌వేగాస్‌లో జరిగిన ఏడబ్ల్యూఎస్‌ క్లౌడ్‌ వార్షిక సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఓపెన్‌ఏఐ ఏడాది క్రితం చాట్‌జీపీటీని తీసుకొచ్చిన తర్వాత వివిధ సంస్థలు ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

కంటెంట్‌ను సృష్టించడం, రోజువారీ సమాచార వ్యవస్థను క్రమబద్ధీకరించడం, బ్లాగ్‌ పోస్ట్‌లను రాయడం వంటి పనులను ‘క్యూ’ (Amazon Q) సులభంగా చేస్తుందని అమెజాన్‌ వెల్లడించింది. ఇతర కంపెనీలు ‘క్యూ’ను తమ అవసరాలకు అనుగుణంగా మల్చుకొని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ‘క్యూ’ ప్రివ్యూ వెర్షన్‌  అందుబాటులో ఉందని చెప్పింది.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలను అందిస్తున్న కంపెనీల జాబితాలో గూగుల్, మైక్రోసాఫ్ట్‌ కంటే కూడా అమెజాన్‌ ముందుంది. కానీ, జనరేటివ్‌ ఏఐ వంటి నూతన ఆవిష్కరణలకు దారితీసిన కృత్రిమ మేధ పరిశోధనల్లో మాత్రం కాస్త వెనకబడింది. 10 ఫౌండేషనల్‌ ఏఐ మోడల్స్‌లోని పారదర్శకతను తెలియజేస్తూ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ రూపొందించిన ఇండెక్స్‌లో అమెజాన్‌ అట్టడుగున నిలిచింది. తక్కువ పారదర్శకత ఉన్న ఏఐ మోడల్స్‌ను కస్టమర్లు అంత సులభంగా ఉపయోగించలేరని స్టాన్‌ఫోర్డ్‌ పరిశోధకులు తెలిపారు.

ఏఐ స్టార్టప్‌ ఆంత్రోపిక్‌లో 4 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు అమెజాన్‌ సెప్టెంబరులో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంకుర సంస్థను ఓపెన్‌ఏఐ మాజీ ఉద్యోగులు స్థాపించారు. అలాగే వాయిస్‌ అసిస్టెంట్‌ ‘అలెక్సా’కూ అమెజాన్‌ ఏఐ ఆధారిత ఫీచర్లను అనుసంధానిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని