Air India: భారత విమానయాన రంగంలో పుష్కల అవకాశాలు

భారత్‌ను దిగ్గజ విమానయాన విపణిగా చెబుతూ... ఎయిరిండియా, లుఫ్తాన్సాల మధ్య బలమైన భాగస్వామ్యం ఉండటం మంచి పరిణామమని స్టార్‌ అలయన్స్‌ సీఈఓ థియో పానాజియోటౌలియాస్‌ అభిప్రాయపడ్డారు.

Updated : 10 Jun 2024 07:06 IST

ఎయిరిండియా- లుఫ్తాన్సాల మధ్య బలమైన భాగస్వామ్యంతో మేలే
స్టార్‌ అలయన్స్‌ సీఈఓ

దిల్లీ: భారత్‌ను దిగ్గజ విమానయాన విపణిగా చెబుతూ... ఎయిరిండియా, లుఫ్తాన్సాల మధ్య బలమైన భాగస్వామ్యం ఉండటం మంచి పరిణామమని స్టార్‌ అలయన్స్‌ సీఈఓ థియో పానాజియోటౌలియాస్‌ అభిప్రాయపడ్డారు. భాగస్వాములను ఒక్కచోటకు చేర్చాలనే ప్రయత్నం ద్వారా ప్రయాణికులందరికీ ఏకరీతిలో ప్రయోజనం కలిగేలా చేయాలన్నదే స్టార్‌ అలయన్స్‌ ఉద్దేశమని తెలిపారు. 26 విమానయాన సంస్థలు సభ్యత్వం కలిగిన స్టార్‌ అలయన్స్‌లో ఎయిరిండియా, లుఫ్తాన్సా సంస్థలు కూడా భాగంగా ఉన్నాయి.  ‘పుష్కల అవకాశాలు ఉన్న భారత్‌ విపణిపై సానుకూల ధృక్పథంతో ఉన్నామ’ని ఐఐటీఏ వార్షిక సాధారణ సమావేశం అనంతరం పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. భాగస్వామ్య సంస్థలను ఒక్క చోటకు తేవడం వల్ల ప్రయాణికులకు ఎంపిక విషయంలో మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయని, భారత విపణి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే అది ఎంతో మంచి విషయమని అన్నారు. ఎయిరిండియా, లుఫ్తాన్సాల మధ్య భాగస్వామ్యంపై స్పందిస్తూ.. అలయన్స్‌లోనే బలమైన భాగస్వామ్యాలు ఉండటం ప్రయోజనకరమేనని తెలిపారు. ఈ రెండు సంస్థల మధ్య బలమైన కోడ్‌షేర్‌ ఒప్పందాలు ఉండటం వల్ల ఇరు సంస్థల ప్రయాణికులకు గమ్యస్థానాల అనుసంధానత విషయంలో మరింత వెసులుబాటు లభిస్తుందని అన్నారు. మరోవైపు ఐఏటీఏ వార్షిక సాధారణ సమావేశం సమయంలో ఎయిరిండియా సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టరు క్యాంప్‌బెల్‌ విల్సన్‌తో లుఫ్తాన్సా గ్రూపు ఛైర్మన్, సీఈఓ కార్స్‌టెన్‌ స్పోర్‌ భేటీ అయ్యారు. సమావేశం సుదీర్ఘ సమయం పాటు జరిగిందని చెబుతూ, సమావేశ వివరాల వెల్లడికి స్పోర్‌ నిరాకరించారు.  

  • లాభదాయకతను సాధించే దిశగా ఆకాశ ఎయిర్‌ అడుగులు వేయగలదని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆదిత్య ఘోష్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియాలోని ప్రాంతాలకు సహా మరిన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులను విస్తరిస్తామన్నారు. 
  • సామర్థ్యానికి తగ్గట్లుగా భారత విమానయాన రంగ వృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌ డిప్యూటీ ప్రెసిడెంట్‌ ఆద్నాన్‌ కఝీమ్‌ తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం సీట్ల లభ్యత కంటే ప్రయాణికుల గిరాకీ ఎక్కువగా ఉందని అన్నారు. దుబాయ్, భారత్‌ల మధ్య ద్వైపాక్షిక విమానయాన హక్కులు పెరగాల్సి ఉందని కూడా తెలిపారు. 
  • విమానాల మరమ్మతు పనుల కోసం తమ గ్రూపు విమానయాన సంస్థల వద్ద అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్‌ నైపుణ్యాలను ఎయిరిండియా వినియోగించుకుంటుందని ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విమానాలను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తి ఉన్నప్పటికీ.. మార్కెట్‌లో విమానాల లభ్యత క్లిషంగా ఉందని అన్నారు. ముఖ్యంగా వైడ్‌ బాడీ విమానాల విషయంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని వెల్లడించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని