Anand Mahindra: భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర పోస్టు

Eenadu icon
By Business News Team Published : 15 Jul 2025 18:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత మార్కెట్‌లోకి అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు. టెస్లాకు స్వాగతం పలికారు. గతంలో ఆ సంస్థ సీఈఓతో జరిగిన సంభాషణను షేర్ చేశారు.

‘‘భారత్‌కు స్వాగతం. అవకాశాల గని అయిన భారత్‌లో ఈ రాక కొత్త ఉత్సాహాన్ని నింపింది. పోటీతత్వంతో మరిన్ని ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. ఇంకా మనం చేయాల్సిన ప్రయాణం ఎంతోఉంది. ఛార్జింగ్ స్టేషన్లలో మనం కలుసుకుందాం’’ అని ఆనంద్ మహీంద్రా తన పోస్టులో రాసుకొచ్చారు. దీంతోపాటు 2017 నాటి పోస్టును రీషేర్ చేశారు. 2030 నాటికి ఎలక్ట్రిక్‌ వాహనాల్లోకి మారతామని భారత ప్రభుత్వం చేసిన ప్రతిజ్ఞ నేపథ్యంలో టెస్లాను భారత్‌కు తీసుకురావాలని అప్పుడు మస్క్‌ను మహీంద్రా ఆహ్వానించారు. మార్కెట్‌లో ప్రత్యామ్నాయం ఉండాలనే అర్థం వచ్చేలా ఎక్స్‌లో రాసుకొచ్చారు. గుడ్ పాయింట్ అని అప్పుడు దానికి మస్క్‌ బదులిచ్చారు.

కాగా.. మరో సందర్భంలో టెస్లా మార్కెట్‌లోకి వస్తే ఎదురయ్యే పోటీని ఎలా ఎదుర్కొంటారని మహీంద్రాకు ప్రశ్న ఎదురుకాగా.. దానికి ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. 1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాత కూడా తమకు ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయని పేర్కొన్నారు. అప్పుడు మార్కెట్‌లోకి వచ్చిన దేశీయ, విదేశీ కంపెనీలైన టాటా, సుజుకీ వంటి ఎన్నో కంపెనీలతో పోటీని తట్టుకొని నిలబడ్డామన్నారు. తమ ఉత్పత్తులపై ఉన్న నమ్మకమే దీనికి కారణమని.. టెస్లా మార్కెట్‌లోకి వచ్చినా తమ సంస్థ ఇదే విధంగా ముందుకు వెళ్తుందని అన్నారు. దేశ ప్రజలు, వినియోగదారులు ఇస్తున్న ప్రోత్సాహంతో పోటీకి తగ్గట్టు తమను తాము మార్చుకుంటామన్నారు.

ఇదిలాఉంటే.. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో టెస్లా తొలి షోరూంను మంగళవారం ప్రారంభించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మార్కర్‌ మ్యాక్సిటీ మాల్‌లో దానిని తెరిచింది. తొలుత ‘మోడల్‌ Y’ ఈవీలను టెస్లా భారత్‌ మార్కెట్లో విక్రయించనుంది. ఇక్కడ ఆర్‌డబ్ల్యూడీ వెర్షన్‌ (బేస్‌) ‘మోడల్‌ వై’ ధర రూ.61.07 లక్షలుగా (ఆన్‌రోడ్‌) నిర్ణయించింది. లాంగ్‌-రేంజ్‌ వెర్షన్‌ ధర రూ.69.15లక్షలుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు