Tesla entry to India: భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ధర, ఫీచర్లు ఇవే..

Eenadu icon
By Business News Team Updated : 15 Jul 2025 12:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Tesla entry to India | ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి ప్రవేశించింది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో తొలి షోరూంను మంగళవారం ప్రారంభించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మార్కర్‌ మ్యాక్సిటీ మాల్‌లో దానిని తెరిచింది. ఈ షోరూం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హాజరయ్యారు. ఈ సంస్థకు వెల్‌కమ్‌ చెప్పారు. భారత్‌లో ఈ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీకి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలపై ఆశాభావం వ్యక్తంచేశారు (Tesla Mumbai Showroom Launch). ఈసందర్భంగా ‘మోడల్‌ వై’ కారును సంస్థ ఆవిష్కరించింది.

‘మోడల్‌ వై’ ధర, ఫీచర్లివే.. 

తొలుత ‘మోడల్‌ Y’ ఈవీలను టెస్లా భారత్‌ మార్కెట్లో విక్రయించనుంది. ఇక్కడ ఆర్‌డబ్ల్యూడీ వెర్షన్‌ (బేస్‌) ‘మోడల్‌ వై’ ధర రూ.61.07 లక్షలుగా (ఆన్‌రోడ్‌) నిర్ణయించింది. లాంగ్‌-రేంజ్‌ వెర్షన్‌ ధర రూ.69.15లక్షలుగా ఉంది. బేస్‌ మోడల్‌ ధర అమెరికాలో 44,990 డాలర్లు (రూ.38.63 లక్షలు), చైనాలో 2,63,500 యువాన్లు (రూ.31.57లక్షలు) జర్మనీలో 45,970 యూరోలు (రూ.46.09లక్షలు)గా ఉంది. దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చుల కారణంగా భారత్‌లో దీని ధర ఎక్కువగా ఉంది.

కొన్నిరోజుల క్రితం భారత రోడ్లపై ‘మోడల్‌ Y’ ను పరీక్షించిన సంగతి తెలిసిందే. ముంబయి-పుణే జాతీయరహదారిపై ఈ వాహనం దర్శనమివ్వడం చూపరులను ఆకర్షించింది. ఇది పూర్తిగా అప్‌డేట్‌ అయిన మోడల్‌ Y కారుగా నిపుణులు గుర్తించారు. దీని కోడ్‌నేమ్‌ జునిపెర్‌. సాధారణ మోడల్‌ Y కంటే దీనిలో ఎక్కువ ఫీచర్లు ఉంటాయి. అమెరికా, కెనడా మార్కెట్లలో వీటిని విక్రయిస్తున్నారు. దీని సీ షేప్‌లోని ఎల్‌ఈడీ లైట్లు, ట్విన్‌ స్పోక్‌ అలాయ్‌ వీల్స్‌, టెస్లా ప్రత్యేకతను తెలిపే గ్లాస్‌ రూఫ్‌ ఉన్నాయి. ఇది భారత్‌లో ఆరు రంగుల్లో లభించవచ్చని భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మోడల్‌ Y కారు ఆల్‌వీల్‌ డ్రైవ్‌గా లభిస్తోంది. వీటిల్లో లాంగ్‌ రేంజ్‌ బ్యాటరీ ప్రత్యేకత. ఒక్కసారి ఛార్జి చేస్తే 500-600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కేవలం 4.6 సెకన్లలో గంటకు 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకొంటుంది. అత్యధికంగా గంటకు 200 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. దీనిలో భారీ 15.4 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ను అమర్చారు. వెనక సీట్లలోని ప్యాసింజర్ల కోసం 8 అంగుళాల ప్రత్యేకమైన స్క్రీన్‌ కూడా ఉంటుంది. అడాస్‌ ఫీచర్లు, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ వంటి హంగులు ఇందులో కస్టమర్లకు లభించనున్నాయి.

షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ మాట్లాడుతూ.. ‘‘టెస్లా సరైన రాష్ట్రం, నగరాన్ని ఎంచుకుంది. ఈ కంపెనీ కార్ల డిజైన్‌, ఇన్నోవేషన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. 2015లో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు తొలిసారి టెస్లా కారులో తిరిగాను’’ అని ఫడణవీస్ మాట్లాడారు. టెస్లా దీర్ఘకాలిక ప్రణాళికల గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి స్థానికంగా దీని తయారీపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.

Tags :
Published : 15 Jul 2025 10:54 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు