Byjus: నేడు తేలనున్న బైజూస్‌ సీఈఓ రవీంద్రన్ భవితవ్యం!

Byjus: బైజూస్‌ సీఈఓ రవీంద్రన్‌ను పదవి నుంచి తప్పించాలనే లక్ష్యంతో ఇన్వెస్టర్లు పిలుపునిచ్చిన ఈజీఎం ఈరోజు జరగనుంది.

Published : 23 Feb 2024 11:56 IST

దిల్లీ: ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ సీఈఓ రవీంద్రన్ (Byju Raveendran) భవితవ్యం నేడు తేలనుంది. కంపెనీ ఇన్వెస్టర్లు పిలుపునిచ్చిన అసాధారణ వాటాదార్ల సమావేశం (EGM) శుక్రవారం జరగనుంది. ఆయన్ని పదవి నుంచి తొలగించి కొత్త బోర్డును ఎన్నుకోవాలనే లక్ష్యంతో వారు భేటీ అవుతున్నారు. అయితే, దీన్ని నిలిపివేయాలంటూ కర్ణాటక హైకోర్టును సంస్థ (Byjus) ఆశ్రయించగా.. చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈజీఎం నిలుపుదలకు నిరాకరించిన న్యాయస్థానం.. అందులో తీసుకున్న నిర్ణయాలను మాత్రం తదుపరి విచారణ వరకు అమలు చేయొద్దని ఆదేశించింది.

బైజూస్‌లో (Byjus) ఇన్వెస్టర్లుగా ఉన్న ప్రోసస్‌, పీక్‌ ఎక్స్‌వీ, సోఫినా, లైట్‌స్పీడ్‌, జనరల్‌ అట్లాంటిక్‌, ఛాన్‌ జుకర్‌బర్గ్‌ ఇనీషియేటివ్‌ వంటి సంస్థలు ఈజీఎంకు పిలుపునిచ్చినట్లు సమాచారం. అయితే, వీరంతా వాటాదారుల ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు కంపెనీ ఆరోపిస్తోంది. ఒకప్పుడు భారత్‌లో అత్యంత విలువైన అంకుర సంస్థగా వెలుగొందిన బైజూస్‌.. తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సకాలంలో వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రవీంద్రన్‌పైనా ఆరోపణలు వచ్చాయి. రూ.9,300 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలకు పాల్పడినట్లు గత నవంబరులో ఈడీ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో పాలనాపరమైన అవకతవకలను కారణంగా చూపుతూ ఆయన్ని తప్పించాలని ఇన్వెస్టర్లు యోచిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు రవీంద్రన్‌ దేశం విడిచి వెళ్లకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఏడాది క్రితమే జారీచేసిన లుకౌట్‌ సర్క్యులర్‌ (LC) స్థాయిని ఈ మేరకు పెంచింది. రవీంద్రన్‌ కదలికలపై ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కేవలం సమాచారం ఇవ్వాలని తెలిపే ఎల్‌సీ ఇప్పటి వరకు అమల్లో ఉంది. తాజా మార్పుతో  ఆయన మన దేశ భూభాగం నుంచి ఏ మార్గంలోనూ విదేశాలకు వెళ్లకుండా నిలువరించాల్సి ఉంటుంది. రవీంద్రన్‌ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని