Dividend: బడ్జెట్‌ అంచనాలను మించిన డివిడెండ్.. కేంద్రానికి రూ.63,000 కోట్ల ఆదాయం

Dividend: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వానికి రూ.63 వేల కోట్ల డివిడెండ్‌ లభించింది. ఇది బడ్జెట్ అంచనాల కంటే 26 శాతం అధికం.

Published : 31 Mar 2024 16:32 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (CPSE) నుంచి వచ్చే డివిడెండ్‌ (Dividend) ఆదాయం బడ్జెట్‌ అంచనాల కంటే 26 శాతం పెరిగి రూ.63,000 కోట్లకు చేరింది. కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, గెయిల్‌ వంటి సంస్థల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం గణనీయ రాబడి రావడమే అందుకు కారణం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం డివిడెండ్‌ ఆదాయ అంచనాలను సవరించి రూ.50,000 కోట్లుగా లెక్కగట్టింది.

దీపమ్‌ (DIPAM) వెబ్‌సైట్‌ ప్రకారం 2024 మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రూ.62,929.27 కోట్ల డివిడెండ్‌ ఆదాయం అందింది. మార్చి నెలలో ఓఎన్‌జీసీ నుంచి రూ.2,964 కోట్లు, కోల్‌ ఇండియా రూ.2,043 కోట్లు, పవర్‌ గ్రిడ్‌ రూ.2,143 కోట్లు, ఎన్‌ఎండీసీ రూ.1,024 కోట్లు, హెచ్‌ఏఎల్‌ రూ.1,054 కోట్లు, గెయిల్‌ నుంచి రూ.1,863 కోట్ల డివిడెండ్ అందింది. గత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి వివిధ కంపెనీల నుంచి వచ్చిన డివిడెండ్‌ రూ.59,952.84 కోట్లుగా నమోదైంది.

ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక ఫలితాలు మెరుగ్గా నమోదైన నేపథ్యంలోనే డివిడెండ్లు (Dividend) పెద్ద ఎత్తున అందినట్లు తెలుస్తోంది. రిటైల్‌, సంస్థాగత మదుపర్లు సైతం దీనివల్ల లాభపడనున్నారు. ఫలితంగా పీఎస్‌యూ కంపెనీల షేర్లపై వారిలో ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. మూడేళ్లలో సీపీఎస్‌ఈలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (Market capitalisation) రూ.15 లక్షల కోట్ల నుంచి 500 శాతం పెరిగి రూ.58 లక్షల కోట్లకు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని