Electric Vehicles: ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై డిస్కౌంట్లు.. ఏయే కంపెనీ ఎంతెంత?

Electric Vehicles: ఫిబ్రవరిలో 65,700 యూనిట్ల విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. డిసెంబరు, జనవరిలోనూ దాదాపు ఇవే నంబర్లు నమోదయ్యాయి. దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు ప్రత్యేక రాయితీలు, ప్రయోజనాలను అందిస్తున్నాయి.

Updated : 10 Mar 2023 17:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్‌ ద్విచక్ర వాహనాల (Electric two wheelers) గిరాకీ స్తంభించిపోయింది. కొత్త మోడళ్ల విడుదల నెమ్మదించింది. ఫలితంగా కస్టమర్లను ఆకర్షించేందుకు తయారీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఓలా, ఏథర్‌ సహా ఇతర ప్రముఖ కంపెనీలన్నీ ప్రత్యేక రాయితీలను ఇస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన కొత్త మోడళ్లకూ ఈ ఆఫర్లను వర్తింపజేస్తున్నాయి.

వాహన డీలర్ల సమాఖ్య ఫాడా గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో 65,700 యూనిట్ల విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు (Electric two wheelers) అమ్ముడయ్యాయి. డిసెంబరు, జనవరిలోనూ దాదాపు ఇవే నంబర్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు అప్రమత్తమయ్యాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు రాయితీలు, ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తున్నాయి.

ఓలా ఎలక్ట్రిక్‌ తమ ఎస్‌1 ప్రో మోడల్‌ ధరను రూ.16,000 వరకు తగ్గించింది. లోన్‌పై తీసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేయడం లేదు. పైగా సున్నా డౌన్‌పేమెంట్‌తో వాహనాన్ని చేతికందిస్తోంది.

మోటోకార్ప్‌ మద్దతు ఉన్న ఏథర్‌ ఎనర్జీ తమ విద్యుత్‌ వాహనాలపై వినియోగదారులకు రూ.17,000 వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. లోన్‌పై తీసుకునేవారికి జీరో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా ఇస్తోంది.

ఒకినావా ఆటోటెక్‌పై ప్రభుత్వం తరఫున వచ్చే రాయితీలు నిలిచిపోయాయి. దీంతో ఒక్కసారిగా వాహనాల ధరలు పెరిగాయి. ఫలితంగా విక్రయాలు నెమ్మదించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న స్టాక్‌ను పూర్తి చేయడం కోసం కంపెనీ రూ.8,750 వరకు ప్రయోజనాలను కల్పిస్తోంది. కొత్త స్టాక్‌పై మాత్రం ఈ ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేసింది.

గ్రీవ్స్‌కాటన్‌కు చెందిన యాంపియర్‌ ఇటీవల విడుదల చేసిన ప్రైమస్‌ మోడల్‌పై రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తోంది.

జితేంద్ర ఈవీటెక్‌ తమ మోడళ్లపై రూ.6,000 వరకు రాయితీనిస్తోంది.

గిరాకీ పడిపోవడంతో కంపెనీలు తయారీని క్రమంగా తగ్గించుకునే అవకాశం ఉంది. భారత్‌లో రెండో అతిపెద్ద విద్యుత్‌ ద్విచక్రవాహన తయారీ కంపెనీ అయిన టీవీఎస్‌ మోటార్‌ మార్చి నాటికి 25,000 యూనిట్ల నెలవారీ విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ఫిబ్రవరిలో దాంట్లో సగం మాత్రమే విక్రయించగలిగింది. అదే తరహాలో ఏథర్‌ ఎనర్జీ సైతం 20,000 యూనిట్లను లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, 9,000 యూనిట్లను మాత్రమే విక్రయించింది. నవంబరు నాటికి 10 లక్షల వాహనాల తయారీని అందుకోవాలని ఓలా ఎలక్ట్రిక్‌ నిర్దేశించుకుంది. ఫిబ్రవరిలో 17,700 యూనిట్లను మాత్రమే విక్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని