First Tesla Car: దేశంలో తొలి టెస్లా కారు.. ఎవరు కొన్నారంటే..?

Eenadu icon
By Business News Team Updated : 05 Sep 2025 11:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ముంబయి: విద్యుత్‌ కార్ల దిగ్గజం టెస్లా ఇటీవల భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ దేశంలో తొలి కారును (First Tesla Car in India) డెలివరీ చేసింది. తెలుపు రంగు టెస్లా ‘మోడల్‌ వై’ కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌ సర్‌నాయక్‌ కొనుగోలు చేశారు. ముంబయిలోని ‘టెస్లా (Tesla) ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌’లో సంస్థ ప్రతినిధులు ఈ కారు తాళాలను మంత్రికి అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి ప్రతాప్‌ మాట్లాడుతూ.. దేశంలో తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పర్యావరణహిత వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. విద్యుత్‌ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ వాహనాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)కు చెందిన టెస్లా సంస్థ ఇటీవలే భారత్‌లో విక్రయాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జులై 15న ముంబయిలో తొలి షోరూంను ప్రారంభించింది. మధ్యశ్రేణి ఎస్‌యూవీ ‘మోడల్‌ వై’ కారు (Tesla Model Y Car) విక్రయాలు ఇక్కడ మొదలయ్యాయి. చైనా (షాంఘై)లోని తమ ప్లాంటులో పూర్తిగా తయారైన కారును (కంప్లీట్లీ బిల్ట్‌ యూనిట్‌ -సీబీయూ) దిగుమతి చేసుకుని టెస్లా విక్రయాలు చేపట్టింది. 

రెండు వేరియంట్లలో ఈ కారును తీసుకొచ్చారు. రేర్‌-వీల్‌ డ్రైవ్‌ వేరియంట్‌ ధర రూ.59.89 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఒక ఛార్జింగ్‌తో 500 కి.మీ. ప్రయాణించొచ్చు. మరింత ఎక్కువ దూరం ప్రయాణించగలిగే లాంగ్‌ రేంజ్‌ రేర్‌ వీల్‌ డ్రైవ్‌ ప్రారంభ ధర రూ.67.89 లక్షలుగా ఉంది. ఒక ఛార్జింగ్‌తో 622 కి.మీ. పయనించొచ్చు. ఈ కార్ల కోసం ఇప్పటివరకు 600 బుకింగ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది.

Tags :
Published : 05 Sep 2025 11:48 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు