Gautam Adani: మున్నాభాయ్‌ ఎప్పటికీ నా ఫేవరెట్‌: గౌతమ్‌ అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు

Eenadu icon
By Business News Team Updated : 11 Jul 2025 15:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ముంబయి: మానసిక బాధ నుంచి కోలుకునేలా చేయడం.. శస్త్రచికిత్సలకు అతీతమైన మార్గమని అన్నారు ప్రముఖ పారిశ్రామిక వేత్త, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani). అందుకే బాలీవుడ్‌లో వచ్చిన ‘మున్నా భాయ్‌ ఎంబీబీఎస్‌ (Munna Bhai M.B.B.S)’ సినిమా తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ముంబయిలో జరిగిన ‘సొసైటీ ఫర్ మినిమల్లీ ఇన్వేసివ్‌ స్పైన్‌ సర్జరీ- ఆసియా పసిఫిక్‌’ 5వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘మున్నా భాయ్‌ ఎంబీబీఎస్‌.. నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ సినిమాల్లో ఒకటి. అది కేవలం వినోదభరిత చిత్రమే కాదు.. మంచి సందేశాన్నిచ్చింది. అందులో మున్నాభాయ్‌ కేవలం మందులతోనే రోగాన్ని నయం చేయకుండా.. మానవత్వం, ప్రేమతో వారికి చికిత్స చేస్తాడు. అలా బాధ నుంచి ఉపశమనం కలిగించడం అనేది శస్త్రచికిత్సల కంటే అతీతమైనది. అందులో మున్నాభాయ్‌ చెప్పినట్లుగా.. మ్యాజిక్‌ ట్రిక్కులైనా, సర్జరీలైనా.. రెండింట్లో మానవత్వమే కన్పించాలి’’ అని గౌతమ్‌ అదానీ గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా కెరీర్‌ తొలినాళ్లలో తాను తీసుకున్న నిర్ణయాలను అదానీ గుర్తుచేసుకున్నారు. ‘‘16 ఏళ్ల వయసులో సెకండ్‌ క్లాస్‌ రైలు టికెట్‌ కొనుక్కుని ముంబయి వచ్చేశా. అప్పుడు నాకు ఎలాంటి డిగ్రీ లేదు. చేతిలో ఉద్యోగం లేదు. జీవితంలో ఎదగడానికి నా సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న తపన మాత్రం ఉంది. మీరు ఏదైనా బలంగా కోరుకుంటే.. ఈ విశ్వం మొత్తం ఆసక్తికరంగా కన్పిస్తుంది. నా జీవితంలో అదే జరిగింది. ముంబయి వచ్చాక వజ్రాలను పాలిష్‌ చేయడం నేర్చుకున్నా. ఒక్కో రాయిని పాలిష్‌ చేస్తుంటే.. ఓపిక, విలువ ఎంత గొప్పవనే పాఠం నేర్చుకున్నా. నా తొలి డీల్‌ ఒక జపనీస్‌ కొనుగోలుదారుతో చేశా. అప్పుడు రూ.10వేలు సంపాదించా. డబ్బు ముఖ్యం కాదు.. కానీ, నేను గెలవగలనన్న నమ్మకం కలిగింది అప్పుడే’’ అని అదానీ తెలిపారు.

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ తెరకెక్కించిన ‘మున్నా భాయ్‌ ఎంబీబీఎస్‌’  సినిమాలో నటుడు సంజయ్‌దత్‌ మున్నాభాయ్‌గా కనిపించారు. ఇదే సినిమా తెలుగులో ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ పేరుతో వచ్చింది. అగ్ర కథానాయకుడు చిరంజీవి నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకుంది.

Tags :
Published : 11 Jul 2025 14:21 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు