GDP: భారత జీడీపీ 8.2%.. మార్చి త్రైమాసికంలో 7.8%

GDP: 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.2 శాతంగా నమోదైంది. మార్చి త్రైమాసికంలో 7.8 శాతంగా ఉంది. 

Published : 31 May 2024 19:32 IST

GDP | దిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలకమైన జీడీపీ (GDP) గణాంకాలు వెలువడ్డాయి. 2023- 24 మార్చితో ముగిసిన మూడో త్రైమాసికంలో అంచనాలు మించి 7.8 శాతంగా జీడీపీ వృద్ధి నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి 8.2 శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం (NSO) వెల్లడించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం 8.6 శాతంతో పోలిస్తే కాస్త తక్కువ.

2022-23 ఆర్థిక సంవత్సరంలో జనవరి- మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 6.2 శాతంగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 7 శాతం వృద్ధి చెందింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెండోసారి ఎన్‌ఎస్‌ఓ వెలువరించిన అంచనాల్లో 7.7 శాతం వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొంది. అంతకుమించి జీడీపీ వృద్ధి నమోదుకావడం గమనార్హం. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో పొరుగుదేశమైన చైనా 5.3 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.

ద్రవ్యలోటు 5.63%

దేశం వార్షికాదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే దాన్ని ద్రవ్యలోటు అంటారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.63గా నమోదైంది. వాస్తవానికి బడ్జెట్‌లో 5.8 శాతంగా నమోదుకావొచ్చని అంచనా వేశారు. వాస్తవ రూపంలో చూసినప్పుడు ఆదాయం, వ్యయం మధ్య వ్యత్యాసం రూ.16.53 లక్షల కోట్లుగా ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడించాయి. స్థూలంగా పన్నుల రూపంలో రూ.23.26 లక్షల కోట్లు ప్రభుత్వానికి రాగా.. వ్యయం రూ.44.42 లక్షల కోట్లు ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని