Economic survey: కొవిడ్‌ నుంచి కోలుకున్నాం

‘కొవిడ్‌’ పరిణామాల వల్ల తలెత్తిన ముప్పు నుంచి మన ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.

Updated : 01 Feb 2023 10:36 IST

ఆర్థిక సర్వే

‘కొవిడ్‌’ పరిణామాల వల్ల తలెత్తిన ముప్పు నుంచి మన ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. వడ్డీరేట్లు తక్కువగా ఉంచడంతో పాటు సరఫరా వ్యవస్థల పరంగా తీసుకున్న చర్యలు ఇందుకు కారణమని విశ్లేషించింది. ‘అసాధారణ సవాళ్లను ఇతర దేశాలతో పోల్చితే భారతదేశం ఎంతో సమర్థంగా తట్టుకుని నిలిచింది’ అని సర్వే పేర్కొంది, ఇంకా అనేక సానుకూలాంశాలను ప్రస్తావించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి ఉండొచ్చని, ప్రైవేటు వినియోగం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎంతో ఆకర్షణీయంగా 58.5 శాతానికి పెరిగిందని, హోటళ్లు, వర్తకం, రవాణా రంగాలు కళకళలాడాయని వివరించింది. వచ్చే దశాబ్దం మనదేనని ధీమా వ్యక్తం చేసింది. ఎంఎస్‌ఎంఈ సంస్థలు ఎంతో అధికంగా రుణాలు తీసుకున్నాయని, ఇతర అన్ని రంగాల్లో ఇదే జోరు కొనసాగి 2023-24లో బ్యాంకు రుణాల్లో అధిక వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌- నవంబరు మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు 63.4% పెరిగినట్లు పేర్కొంది. కొన్ని ఇబ్బందులనూ సర్వే ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం అధిక స్థాయుల నుంచి దిగివచ్చినప్పటికీ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్దేశించుకున్న 6 శాతం కంటే అధికంగా 6.8 శాతంగా ఈ ఆర్థిక సంవత్సరంలో నమోదు కావచ్చని పేర్కొంది. దీనివల్ల రుణాలపై వడ్డీభారం మరికొంతకాలం అధికంగానే  ఉండొచ్చని తెలిపింది. కరెంటు ఖాతా లోటు వల్ల రూపాయి మారకపు విలువపై ఒత్తిడి కొనసాగుతోందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఎగుమతుల్లో వృద్ధి తగ్గిందని, ప్రపంచ వృద్ధి రేటు తక్కువగా ఉండటం దీనికి కొంత కారణమని పేర్కొంది.


రూ.9.9 లక్షల కోట్లకు ద్రవ్యలోటు

దిల్లీ: ప్రభుత్వ వ్యయాలు, ఆదాయాల అంతరమైన ద్రవ్యలోటు 2022-23 ఏప్రిల్‌-డిసెంబరులో రూ.9,92,976 కోట్లకు చేరుకుంది. 2022-23 బడ్జెట్‌ అంచనా(బీఈ) అయిన రూ.16.61 లక్షల కోట్లలో ఇది 59.8 శాతానికి సమానం. ఆదాయ వసూళ్లలో వృద్ధి స్తబ్దుగా ఉండడం ఇందుకు కారణం.   2021-22 ఇదే సమయానికి బడ్జెట్‌ అంచనాల్లో ద్రవ్యలోటు 50.4 శాతానికి చేరింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరులో నికర పన్ను ఆదాయాలు    రూ.15.55 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022-23 బడ్జెట్‌ అంచనాల్లో ఇవి 80.4 శాతానికి సమానం. 2021-22 ఇదే సమయంలో నికర పన్ను ఆదాయాలు బడ్జెట్‌ అంచనాల్లో 95.4 శాతంగా ఉన్నాయి. 2022-23 ఏప్రిల్‌-డిసెంబరు లో కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయాలు బడ్జెట్‌(2022-23) అంచనాల్లో 71.4 శాతంగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది 72.4 శాతంతో పోలిస్తే ఇవి తక్కువే.


జనవరిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.56 లక్షల కోట్లు

దిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు జనవరిలో రూ.1,55,922  కోట్లుగా నమోదైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. 2022 ఏప్రిల్‌లో వసూలైన రూ.1.68 లక్షల కోట్ల తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో నెలకు రూ.1.50 లక్షల కోట్ల మైలురాయిని దాటడం ఇది మూడోసారి.  

డిసెంబరులో కీలక రంగాల వృద్ధి 7.4%

డిసెంబరులో 8 కీలక రంగాల వృద్ధి 3 నెలల గరిష్ఠమైన 7.4 శాతానికి చేరింది. 2021 డిసెంబరులో ఇది 4.1 శాతమే. బొగ్గు, ఎరువులు, ఉక్కు, విద్యుత్‌ రంగాల్లో మంచి వృద్ధి నమోదు కావడంతో ఈసారి కీలక రంగాలు రాణించాయి.


2030 కల్లా 7 లక్షల కోట్ల డాలర్లకు

భారత ఆర్థిక వ్యవస్థ 6.5-7 శాతం వృద్దితో సాగి, 2025-26 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరొచ్చు. గత 30 ఏళ్లుగా భారత జీడీపీ, డాలర్ల రూపేణ సగటున 9 శాతం వార్షిక వృద్ధిని కనబరచింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించిన సమయంలోనూ దీనిని సాధించడం విశేషం. ఒక వేళ రూపాయి బలోపేతం అయితే డాలర్ల రూపేణ 9 శాతం కంటే అధిక వృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది. అపుడు 2030 కల్లా 7 లక్షల కోట్ల డాలర్లకు ఆర్థిక వ్యవస్థ చేరడమూ సాధ్యమే.

ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌


రూపాయిపై.. ఒత్తిడి కొనసాగొచ్చు

కరెంట్‌ ఖాతా లోటు(సీఏడీ) పెరుగుతూ ఉన్నందున భారత రూపాయిపై ఒత్తిడి కొనసాగొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ‘ఏప్రిల్‌-జూన్‌లో   2.2 శాతంగా ఉన్న సీఏడీ.. అధిక వాణిజ్య లోటు కారణంగా సెప్టెంబరు త్రైమాసికానికి 4.4 శాతానికి చేరింది. అంతర్జాతీయ అనిశ్చితల మధ్య అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు పెంచడంతో, పెట్టుబడులు తరలిపోయి భారత రూపాయి ఒత్తిడిలో కొనసాగింది. ఒక దశలో అమెరికా డాలర్‌ రూ.83 స్థాయినీ చేరింది. కమొడిటీ ధరలు రికార్డు స్థాయిల నుంచి దిగివచ్చినా.. ఇంకా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు స్థాయిల కంటే అధికంగానే ఉన్నాయి. బలమైన దేశీయ గిరాకీ, అధిక కమొడిటీ ధరల వల్ల దేశ దిగుమతుల బిల్లు పెరుగుతోంద’ని వివరించింది.


ఇళ్ల ధరలు స్థిరపడుతున్నాయ్‌

రెండేళ్ల పాటు కొవిడ్‌-19 పరిణామాలతో ఇబ్బంది పడిన గృహ నిర్మాణరంగం కుదుట పడుతోంది.  ఇళ్ల విపణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికవరీ బాటలో ఉంది. ఇళ్ల ధరలు స్థిరపడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాల వల్ల నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి, ఇళ్ల ధరలూ అధికమయ్యాయి. గిరాకీ పుంజుకుంటున్నందున, అమ్ముడవ్వాల్సిన గృహాల సంఖ్య తగ్గుతోంది. ఉక్కు, ఇనుప ఖనిజం వంటి నిర్మాణ సామగ్రిపై దిగుమతి సుంకాలను తగ్గించిన నేపథ్యంలో, ఇళ్ల నిర్మాణ వ్యయంతో పాటు ధరల్లో పెరుగుదల పరిమితం అవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం, స్థిరాస్తి ధరలు అధికమవుతున్నా, గిరాకీ పుంజుకుని గృహాల విక్రయాల్లో వృద్ధి కనిపించింది.


రుణ హామీ పథకంతో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ఊపిరి

భారత్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) ఆర్థిక ఒత్తిళ్లలో కూరుకుపోకుండా.. అత్యవసర రుణ అనుసంధానిత హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) కాపాడిందని ఆర్థిక సర్వే వివరించింది. ఈ రంగానికిచ్చిన రుణాల్లో వృద్ధి 2022 జనవరి-నవంబరులో సగటున 30.6%గా నమోదు కావడం వీటికి మద్దతుగా నిలిచింది. ‘కరోనా సమయంలో బాగా ఇబ్బందులు పడ్డ కంపెనీల్లో 83 శాతం మేర ఈసీఎల్‌జీఎస్‌ను వినియోగించుకున్నాయి. వీటిల్లో సగం కంపెనీలకు పైగా రూ.10 లక్షల్లోపు రుణాలు తీసుకున్నాయ’ని సర్వే వెల్లడించింది.  

* దేశంలోని 6 కోట్ల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల్లో 12 కోట్ల మంది పనిచేస్తున్నారు. జీడీపీలో వీటి వాటా 35%.


ఎఫ్‌డీఐలు పుంజుకుంటాయ్‌

దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) రాబోయే కొద్ది నెలల్లో పెరగనున్నాయని ఆర్థిక సర్వే అంచనా వేసింది. భారత్‌ అధిక ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తుండడంతో పాటు.. దేశీయంగా వ్యాపార వాతావరణం మెరుగుపడడం ఇందుకు దోహదం చేస్తుందని తెలిపింది. ‘రష్యా-ఉక్రెయిన్‌ సంఘర్షణ నేపథ్యంలో ఏర్పడ్డ అంతర్జాతీయ అనిశ్చితి వల్ల 2022-23 ఏప్రిల్‌-సెప్టెంబరులో తయారీ రంగంలోకి ఎఫ్‌డీఐలు 26.9 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇవి 14 శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మొత్తం ఎఫ్‌డీఐలు  39 బి. డాలర్లకు తగ్గాయి. 2021-22 తొలి 6 నెలల్లో ఇవి  42.86 బి. డాలర్లుగా ఉన్నాయి.


ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతుల్లో 55% వృద్ధి

ఎలక్ట్రానిక్స్‌ పరికరాల ఎగుమతులు 55 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి. గత ఏడేళ్లలో దేశంలో మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి అయిదింతలైందని ఆర్థిక సర్వే తెలిపింది. స్థానిక కంపెనీల ఉత్పత్తి సామర్థ్యాలు పెరిగేందుకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం దోహదపడుతోందని వెల్లడించింది. అంతర్జాతీయంగా రెండో అతిపెద్ద మొబైల్‌ ఫోన్‌ తయారీదారుగా భారత్‌ అవతరించింది.

ఉత్పత్తి రంగ కేంద్రంగా ఎదుగుతాం : ఈ దశాబ్దంలో భారత్‌ ఉత్పత్తి రంగ కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. అమెరికా-చైనా వర్తక యుద్ధం, కొవిడ్‌-19 ముప్పు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం రూపేణ అదనపు సవాళ్ల నేపథ్యంలో,  విదేశీ కంపెనీలు సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు చేస్తున్న యత్నాలను అందిపుచ్చుకుందాం.


ఎగుమతులు పెరగకపోవచ్చు

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో రికవరీ రాకపోతే, వచ్చే ఆర్థిక సంవత్సరం భారత ఎగుమతుల్లో వృద్ధి తగ్గొచ్చు. 2021-22లో భారత మర్కండైజ్‌ ఎగుమతులు జీవన కాల గరిష్ఠమైన 422 బిలియన్‌ డాలర్లకు చేరాయి. పలు సవాళ్ల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యం నెమ్మదిస్తోంది. దీంతో భారత వస్తువుల ఎగుమతుల వృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. 2022 డిసెంబరులో భారత ఎగుమతులు 12.2 శాతం తగ్గి 34.48 బి.డాలర్లకు పరిమితమయ్యాయి. వాణిజ్య లోటు 23.76 బి.డాలర్లకు చేరింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరు మధ్య దేశ మొత్తం ఎగుమతులు 9 శాతం పెరిగి 332.76 బి.డాలర్లకు చేరగా, దిగుమతులు 24.96 శాతం పెరిగి  551.7 బి.డాలర్లకు చేరాయి.


ఏటా కోటి విద్యుత్‌ వాహన విక్రయాలు

5 కోట్ల మందికి ఉపాధి

దేశీయంగా విద్యుత్‌ వాహనాల (ఈవీలు) విక్రయాలు 2030 నాటికి, ఏటా కోటికి చేరొచ్చని సర్వే అంచనా వేసింది. దీంతో ఈ రంగంలో 5 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. 2022 డిసెంబరు ఆఖరుకు చూస్తే, వాహన విక్రయాల పరంగా జపాన్‌, జర్మనీలను అధిగమించి, భారత్‌ మూడో స్థానానికి చేరింది. హరిత ఇంధనం వైపు దేశం అడుగులు వేయడంలో వాహన పరిశ్రమ కీలక పాత్ర పోషించనుంది. దేశీయ విద్యుత్‌ వాహనాల విపణి 2022 నుంచి 2030 వరకు 49 శాతం వార్షిక సంచిత వృద్ధి రేటుతో సాగనుంది.


పెట్టుబడుల ఉపసంహరణతో ఇప్పటివరకు రూ.4.07 లక్షల కోట్లు

గత 9 ఏళ్లలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం రూ.4.07 లక్షల కోట్ల నిధుల్ని సమీకరించింది. 2014 తర్వాత ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని అభివృద్ధిలో సహ భాగస్వామిగా  చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో నిర్దేశించుకున్న రూ.65,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో, 2023 జనవరి 18 నాటికి 48 శాతం (రూ.31,000 కోట్లు) సాధించింది. 2014-15 నుంచి 2022-23 వరకు (2023 జనవరి 18 నాటికి) 154 లావాదేవీల ద్వారా ప్రభుత్వం రూ.4.07 లక్షల కోట్ల నిధుల్ని ఇలా సమీకరించింది. ఆయా సంస్థల్లో మైనార్టీ వాటా విక్రయాల ద్వారా రూ.3.02 లక్షల కోట్లు, వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.69,412 కోట్లు సమీకరించింది.


దేశీయ ఔషధ విపణి 130 బి.డాలర్లకు

దేశీయ ఔషధ విపణి 2030 నాటికి 130 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10.6 లక్షల కోట్ల) స్థాయికి చేరొచ్చని ఆర్థిక సర్వే వెల్లడించింది. దేశ ఔషధ ఎగుమతులు 2020-21లో స్థిరంగా 24 శాతం వృద్ధి సాధించాయి. 150కి పైగా దేశాల్లో మన అత్యవసర ఔషధాలకు ఉన్న గిరాకీ, ఇతర సరఫరాలతో ఇది సాధ్యమైంది. అంతర్జాతీయ ఔషధ పరిశ్రమలో భారత ఔషధ పరిశ్రమకు గొప్ప స్థానం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఔషధాల ఉత్పత్తిలో పరిమాణం పరంగా మూడో స్థానం, విలువ పరంగా 14వ స్థానంలో భారత్‌ ఉంది. అంతర్జాతీయంగా జెనరిక్‌ ఔషధాలను సరఫరా చేస్తున్న అతి పెద్ద దేశం మనదే. పరిమాణ పరంగా 20 శాతం వాటా కలిగి ఉంది. టీకాల సరఫరాలో 60 శాతం వాటా కలిగి ఉంది.


రూ.5.06 లక్షల కోట్లు సమీకరించిన కంపెనీలు

దేశీయ కంపెనీలు గత ఏడాది ఏప్రిల్‌- నవంబరులో రూ.5.06 లక్షల కోట్ల ఈక్విటీ, రుణ పెట్టుబడులు సమీకరించాయి. 2021 ఇదేకాలంలో సమీకరించిన రూ.5.53 లక్షల కోట్లతో పోల్చితే ఇవి 8.5% తక్కువ. రూ.5.06 లక్షల కోట్లలో రూ.3.92 లక్షల కోట్లు రుణ పెట్టుబడులు కాగా, రూ.1.14 లక్షల కోట్లు మాత్రమే ఈక్విటీ పెట్టుబడుల రూపంలో లభించాయి. 2021లో రుణ పెట్టుబడులు రూ.3.71 లక్షల కోట్లు కాగా, ఈక్విటీ పెట్టుబడులు రూ.1.81 లక్షల కోట్లుగా ఉన్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కేంద్ర బ్యాంకుల కఠిన పరపతి నిర్ణయాలతో ఎఫ్‌పీఐలు 2022-23 ఏప్రిల్‌-డిసెంబరులో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.16,153 కోట్ల నిధుల్ని మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని