ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి

ఆఖరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా రెండో రోజూ సూచీలు నష్టపోయాయి. బలహీన ఆసియా సంకేతాలతో లోహ, ఇంధన, స్థిరాస్తి షేర్లు డీలాపడ్డాయి.

Published : 25 Mar 2023 03:08 IST

సమీక్ష

ఖరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా రెండో రోజూ సూచీలు నష్టపోయాయి. బలహీన ఆసియా సంకేతాలతో లోహ, ఇంధన, స్థిరాస్తి షేర్లు డీలాపడ్డాయి. రూపాయి నీరసపడటం, విదేశీ మదుపర్ల అమ్మకాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 24 పైసలు తగ్గి 82.44 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 1.73 శాతం తగ్గి 74.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టపోగా, ఐరోపా సూచీలు కుదేలయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 57,890.66 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీ.. ఆఖర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో 57,422.98 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 398.18 పాయింట్ల నష్టంతో 57,527.10 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 131.85 పాయింట్లు తగ్గి 16,945.05 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,917.35- 17,109.45 పాయింట్ల మధ్య కదలాడింది.

* డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌పై పన్నుల్లో మార్పులు చేయడంతో ఏఎంసీ షేర్లు నష్టాలు చవిచూశాయి. యూటీఐ అసెట్‌ 4.73%, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ 4.44%, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ 4.21%, శ్రీరామ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ 3.21%, నిప్పన్‌ లైఫ్‌ ఇండియా అసెట్‌ 1.29% చొప్పున తగ్గాయి.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 24 నష్టపోయాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.81%, బజాజ్‌ ఫైనాన్స్‌ 3.19%, టాటా స్టీల్‌ 2.58%, రిలయన్స్‌ 1.96%, ఎల్‌ అండ్‌ టీ 1.96%, ఎస్‌బీఐ 1.38%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.36%, ఎం అండ్‌ ఎం 1.25%, మారుతీ 1.24%, ఎన్‌టీపీసీ 1.06% చొప్పున డీలాపడ్డాయి. కోటక్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌ 0.74% రాణించాయి. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి, లోహ, కమొడిటీస్‌, ఇంధన, ఆర్థిక సేవలు, పరిశ్రమలు, సేవలు, చమురు-గ్యాస్‌ 2.28% వరకు పడ్డాయి. బీఎస్‌ఈలో 2541 షేర్లు నష్టాల్లో ముగియగా, 967 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 122 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

* ఇబ్బందికరమైన మార్కెటింగ్‌ కాల్స్‌, సందేశాల నిబంధనలు ఉల్లంఘించినందుకు 2021లో 15,382, 2022లో 32,032 కనెక్షన్‌లను టెలికాం ఆపరేటర్లు నిలిపివేసినట్లు కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఇటువంటి వాటిని నిరోధించనందుకు యాక్సెస్‌ సర్వీస్‌ ప్రొవైడర్లపై రూ.34.9 కోట్ల జరిమానాలను ట్రాయ్‌ విధించినట్లు తెలిపారు.

* నైకాకు చెందిన అయిదుగురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీకు రాజీనామా చేశారు. నైకా సూపర్‌స్టోర్‌ సీఈఓ వికాస్‌ గుప్తా, నైకా ఫ్యాషన్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ గోపాల్‌ ఆస్థానా, చీఫ్‌ కమర్షియల్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ మనోజ్‌ గాంధీ, బిజినెస్‌ హెడ్‌ శుచి పాండ్యా, ఫైనాన్స్‌ హెడ్‌ లలిత్‌ ప్రుతీలు ఇందులో ఉన్నారు. ఇందులో నలుగురు ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాలకు కారణాలు తెలియలేదు. ప్రుతీ మాత్రం ఎడ్‌టెక్‌ సంస్థ యునివోలో సీఎఫ్‌ఓగా చేరారు. ఈ రాజీనామాలు స్వచ్ఛందంగా చేసినట్లు నైకా తెలిపింది.

* జర్మనీ విద్యుత్‌ ఓఈఎం ఇరాకిట్‌లో వాటాను కొనుగోలు చేసినట్లు కోల్‌కతాకు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ మోటోవోల్ట్‌ ప్రకటించింది.

* ఎడ్‌టెక్‌ దిగ్గజం బైజూస్‌ ఏప్రిల్‌లో 250 మిలియన్‌ డాలర్ల ఈక్విటీ నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కంపెనీ విలువను 22 బిలియన్‌ డాలర్లు (రూ.1.80 లక్షల కోట్లు)గా లెక్కకట్టారు.

* అదానీ గ్రూప్‌ 10 షేర్లలో 7 కంపెనీలు శుక్రవారం నష్టపోయాయి. ఎన్‌డీటీవీ 4.87%, అదానీ పవర్‌ 4.27%, అదానీ విల్మర్‌ 3.24%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2.90%, అదానీ పోర్ట్స్‌ 2.56%, ఏసీసీ 2.08%, అంబుజా సిమెంట్స్‌ 0.01% చొప్పున పడ్డాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ 4.84%, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 3.78%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 2.49% పెరిగాయి.

* జమ్మూ కశ్మీర్‌లో కనుగొన్న లిథియం నిల్వలతో ప్రపంచంలో అగ్రగామి వాహన తయారీ దేశంగా భారత్‌ నిలుస్తుందని కేంద్ర రహదారి, రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా రవాణాను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని, భవిష్యత్‌ అంతా విద్యుత్‌ బస్సులదేనని అన్నారు.

* నెలకు ఒకసారి బరిస్తా స్టోర్‌లలో పనిచేయనున్నట్లు స్టార్‌బక్స్‌ కొత్త భారత సంతతి సీఈఓ లక్ష్మణ్‌ నరసింహన్‌ తెలిపారు. కంపెనీ సంస్కృతి, వినియోగదారులు, సవాళ్లు, అవకాశాల గురించి తెలుసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని