Vikram-1 Rocket: ఏడంతస్తుల పొడవైన రాకెట్‌

అంతరిక్ష రంగంలోని అంకుర సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రాకెట్ల డిజైన్‌, తయారీ, పరీక్షలు, పరిశోధన కోసం కొత్త కేంద్రం ‘మ్యాక్స్‌-క్యూ’ను ప్రారంభించింది.

Updated : 25 Oct 2023 09:56 IST

విక్రమ్‌-1ను ఆవిష్కరించిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌
హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ప్రారంభం
ఈనాడు - హైదరాబాద్‌

అంతరిక్ష రంగంలోని అంకుర సంస్థ స్కైరూట్‌(Skyroot) ఏరోస్పేస్‌ రాకెట్ల డిజైన్‌, తయారీ, పరీక్షలు, పరిశోధన కోసం కొత్త కేంద్రం ‘మ్యాక్స్‌-క్యూ’ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ ఏరోస్పేస్‌, ఇండస్ట్రియల్‌ పార్కులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని మంగళవారం కేంద్ర శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థకు చెందిన ఏడంతస్తుల పొడవైన విక్రమ్‌-1 అనే రాకెట్‌ను(Vikram-1 rocket) ఆయన ఆవిష్కరించారు. దీన్ని వచ్చే ఏడాది ఆరంభంలో తొలిసారిగా నింగిలోకి ప్రయోగించే అవకాశం ఉంది. ఇది దాదాపు 300 కిలోల పేలోడ్‌ను దిగువ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. పూర్తిగా కార్బన్‌ ఫైబర్‌ కాంపోజిట్‌ బాడీతో రూపొందిన ఈ రాకెట్‌ ద్వారా బహుళ ఉపగ్రహాలను ప్రయోగించొచ్చు. ఇందులో త్రీడీ ముద్రిత ద్రవ ఇంజిన్‌ను ఏర్పాటు చేశారు. 

రూ.526 కోట్ల పెట్టుబడులు: స్కైరూట్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్‌ కుమార్‌ చందన మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ కంపెనీలో దాదాపు 280 మంది పనిచేస్తున్నారని, రూ.526 కోట్ల పెట్టుబడులను సమీకరించామని తెలిపారు. కొత్త ప్రాంగణానికి పెట్టిన పేరు గురించి వివరిస్తూ.. అంతరిక్షంలోకి వెళ్లే ప్రతి రాకెట్‌ ఒక దశలో గరిష్ఠ ఒత్తిడికి గురికావాల్సి ఉంటుందని, దాన్ని ‘మ్యాక్స్‌-క్యూ’ అంటారని చెప్పారు. 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ కేంద్రం... దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రైవేటు రాకెట్‌ అభివృద్ధి కేంద్రమని చెప్పారు. ఈ అధునాతన ప్రాంగణంలో రాకెట్ల డిజైన్‌, తయారీ, పరీక్షలకు అన్ని వసతులు ఉన్నాయన్నారు. స్కైరూట్‌ సహ వ్యవస్థాపకుడు నాగ భరత్‌ మాట్లాడుతూ.. తమ డిజైన్‌ నైపుణ్యానికి దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి విక్రమ్‌-1ను రూపొందించినట్లు చెప్పారు. ఈ రాకెట్‌లోని మొదటి మూడు దశలు ఘన ఇంధనంతో పనిచేస్తాయి. దీనికి తక్కువ మౌలిక వసతులు సరిపోతాయి. 72 గంటల్లోనే దీన్ని అసెంబుల్‌ చేసి, ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. విక్రమ్‌ శ్రేణి కింద మరిన్ని రాకెట్లను అభివృద్ధి చేస్తున్నట్లు స్కైరూట్‌ పేర్కొంది. వాటిలో క్రయోజెనిక్‌ ఇంజిన్‌నూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఉపగ్రహ ప్రయోగాల కోసం స్కైరూట్‌ ఇటీవల ఫ్రాన్స్‌ సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. 2018లో ఏర్పాటైన ఈ సంస్థ గత ఏడాది విజయవంతంగా విక్రమ్‌-ఎస్‌ అనే రాకెట్‌ను తొలిసారిగా ప్రయోగించింది. తద్వారా భారత్‌లో ఆ ఘనత సాధించిన తొలి ప్రైవేటు సంస్థగా రికార్డు సృష్టించింది.


150కి పైగా అంకురాలు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌

అంతరిక్ష రంగంలో భారత్‌ ఇప్పుడు అగ్రపథాన ఉందని, ఇతర దేశాలకు మార్గదర్శనం చేసే స్థితికి చేరుకుందని ఈ సందర్భంగా జితేంద్ర సింగ్‌ తెలిపారు. అంతరిక్ష రంగం అభివృద్ధికి అడ్డుగా ఉన్న సంకెళ్లను తొలగించేందుకు ప్రధాని చేసిన కృషితో నాలుగేళ్లలో ఇందులో ఎంతో అభివృద్ధి సాధ్యమయ్యిందని అన్నారు. కొన్ని ఏళ్ల క్రితం 10 లోపే ఉన్న అంతరిక్ష అంకురాల సంఖ్య నేడు 150కి చేరిందని పేర్కొన్నారు. స్కైరూట్‌ సంస్థ భారత శాస్త్ర, సాంకేతిక సామర్థ్యానికి ప్రబల ఉదాహరణ అని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెరగడం వల్ల ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇస్రోకు, అంకుర పరిశ్రమలకు మధ్య ఆరోగ్యకర సహకారానికి మార్గం సుగమమవుతుందని జితేంద్ర సింగ్‌ చెప్పారు. అంతిమంగా దీనివల్ల భారత్‌ నుంచి చేపట్టే అంతరిక్ష ప్రయోగాల సంఖ్య పెరిగి, దేశానికి మరింత ఆదాయం సమకూరుతుందని చెప్పారు. 2047లో దేశం 100వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకునే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ భాగస్వామ్యం గణనీయంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అంతరిక్ష రంగంలో భారత్‌ వాటా 8 బిలియన్‌ డాలర్లు (2 శాతం)గా ఉందని, 2040 నాటికి దాన్ని 40 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. అయితే కొన్ని ప్రపంచ సంస్థలు ఒకడుగు ముందుకేసి.. 100 బిలియన్‌ డాలర్ల స్థాయిని అందుకునే సత్తా భారత రోదసీ రంగానికి ఉన్నట్లు చెబుతున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని