E-Verification of ITR: ఇ-వెరిఫై చేయలేదా? ఆ రిటర్నులను తొలగించుకోవచ్చు

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినప్పుడు, దాన్ని 30 రోజుల్లోగా ఇ-వెరిఫై చేయాలి. కొంతమంది గడువు లోపు వెరిఫై చేయలేదు. ఇలాంటి వారు పాత రిటర్నులను పూర్తిగా తొలగించి (డిస్కార్డ్‌), కొత్త రిటర్నులు దాఖలు చేసుకునే వెసులుబాటును ఆదాయపు పన్ను విభాగం తీసుకొచ్చింది.

Updated : 29 Nov 2023 10:17 IST

ఐటీ విభాగం వెసులుబాటు

ఈనాడు - హైదరాబాద్‌ : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినప్పుడు, దాన్ని 30 రోజుల్లోగా ఇ-వెరిఫై చేయాలి. కొంతమంది గడువు లోపు వెరిఫై(E-Verification of ITR) చేయలేదు. ఇలాంటి వారు పాత రిటర్నులను పూర్తిగా తొలగించి (డిస్కార్డ్‌), కొత్త రిటర్నులు దాఖలు చేసుకునే వెసులుబాటును ఆదాయపు పన్ను విభాగం తీసుకొచ్చింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 139(1) లేదా 139(5) కింద రిటర్నులు దాఖలు చేసి, వెరిఫై చేయకుండా ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. వెరిఫై చేసిన వారికి ఈ వెసులుబాటు ఉండదు. మదింపు సంవత్సరం 2023-24 (ఆర్థిక సంవత్సరం 2022-23) నుంచి మాత్రమే ఈ అవకాశం. క్రితం ఆర్థిక సంవత్సర రిటర్నులను తొలగించడం సాధ్యం కాదు. పన్ను చెల్లింపుదారుల రిటర్నులలో పొరపాట్లు ఉన్నప్పుడు, రివైజ్‌ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఈ డిస్కార్డ్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది.

ఒకసారి రిటర్నులు తొలగిస్తే.. ఇక రిటర్నులు దాఖలు చేయనట్లే లెక్క. మళ్లీ కొత్తగా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. దీనికి సంబంధించి మరిన్ని సందేహాలను ఆదాయపు పన్ను విభాగం నివృతి చేసింది. కొన్ని పరిశీలిద్దాం..

? నేను జులై 30న ఆదాయపు పన్ను రిటర్నులను సెక్షన్‌ 139(1) కింద దాఖలు చేశాను. వెరిఫికేషన్‌ చేయలేదు. ఈ రిటర్నులను తొలగించొచ్చా

ఆదాయపు పన్ను సెక్షన్‌ 139(1)/139(4)/139(5) కింద దాఖలు చేసిన రిటర్నులను ఇప్పటికీ వెరిఫై చేయకపోతే ఆ రిటర్నులను పూర్తిగా తొలగించేయొచ్చు. ఒకసారి తొలగించాక, తాజాగా రిటర్నులు దాఖలు చేసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, సెక్షన్‌ 139(1) ప్రకారం గడువు లోపు రిటర్నులు దాఖలు చేశారా లేదా అనేది చూసుకోవాలి. గడువు తీరిన తర్వాత దాఖలు చేసిన రిటర్నులకు సెక్షన్‌ 234ఎఫ్‌ కింద నిబంధనల మేరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

? పొరపాటున రిటర్ను తొలగిస్తే, తిరిగి పొందవచ్చా

సాధ్యం కాదు. ఒకసారి తొలగించిన రిటర్నులను వెనక్కి తెప్పించలేం. కాబట్టి, డిస్కార్డ్‌ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకోండి.

? ‘డిస్కార్డ్‌’ ఆప్షన్‌ ఎక్కడ ఉంటుంది

ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లోకి లాగిన్‌ అయి, ఇ-ఫైల్‌, ఇన్‌కంట్యాక్స్‌ రిటర్న్‌, ఇ-వెరిఫై ఐటీఆర్‌కు వెళ్లి అక్కడ ‘డిస్కార్డ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

దీంతోపాటు ఇంకా కొన్ని సందేహాలకూ ఆదాయపు పన్ను విభాగం సమాధానాలు ఇచ్చింది..

  • రిటర్నులను డిస్కార్డ్‌ చేసిన తర్వాత కచ్చితంగా కొత్త రిటర్నులను దాఖలు చేయాలి.
  • ఐటీఆర్‌-5ని ఆదాయపు పన్ను విభాగం సీపీసీకి పోస్టులో పంపించిన వారు, రిటర్నులను తొలగించకూడదు.
  • ఐటీఆర్‌ను వెరిఫై చేసేంత వరకూ ఎన్నిసార్లయినా రిటర్నులను తొలగించి, కొత్తది దాఖలు చేసేందుకు అవకాశం ఉంది.
  • గడువులోపు రిటర్నులను సెక్షన్‌ 139(1) కింద దాఖలు చేసినప్పటికీ, తర్వాత దాన్ని తొలిగిస్తే.. కొత్తగా దాఖలు చేస్తున్న రిటర్నులను సెక్షన్‌ 139(4) కింద దాఖలు చేయాల్సి ఉంటుంది.
  • వెరిఫై చేసిన రిటర్నులను రివైజ్డ్‌ చేసుకునే వీలుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని