వారెన్‌ బఫెట్‌ వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్‌ కన్నుమూత

అమెరికా దిగ్గజ పెట్టుబడిదారు వారెన్‌ బఫెట్‌కు కుడిభుజంగా, ఆయన సంస్థ బెర్క్‌షైర్‌ హాతవేకు వైస్‌ఛైర్మన్‌గా వ్యవహరించిన చార్లీ మంగర్‌(99) కన్నుమూశారు. దీంతో అమెరికా కార్పొరేట్‌ రంగంలో ఒక శకం ముగిసింది.

Updated : 30 Nov 2023 02:25 IST

మెరికా దిగ్గజ పెట్టుబడిదారు వారెన్‌ బఫెట్‌కు కుడిభుజంగా, ఆయన సంస్థ బెర్క్‌షైర్‌ హాతవేకు వైస్‌ఛైర్మన్‌గా వ్యవహరించిన చార్లీ మంగర్‌(99) కన్నుమూశారు. దీంతో అమెరికా కార్పొరేట్‌ రంగంలో ఒక శకం ముగిసింది. కాలిఫోర్నియాలోని ఒక ఆసుపత్రిలో మంగళవారం రాత్రి మంగర్‌ కన్నుమూశారని బెర్క్‌షైర్‌ హాతవే పేర్కొంది. బెర్క్‌షైర్‌ను శక్తిమంత పెట్టుబడి కేంద్రంగా మార్చడంలో మంగర్‌ కీలక పాత్ర పోషించారు. విలువ తక్కువగా ఉన్న అత్యున్నత కంపెనీలను గుర్తించి, పెట్టుబడి పెట్టే వ్యూహంలో బఫెట్‌కు మంగర్‌ సహాయం చేశారు. చార్లీ స్ఫూర్తి, తెలివితేటలు, భాగస్వామ్యం లేకుండా బెర్క్‌షైర్‌ హాతవే ప్రస్తుత స్థితికి చేరేది కాదని ఆ కంపెనీ ఛైర్మన్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన వారెన్‌ బఫెట్‌(93) పేర్కొన్నారు. బెర్క్‌షైర్‌లో చేరకముందే మంగర్‌ తనేంటో నిరూపించుకున్నారు. 1962లో వీలర్‌, మంగర్‌ అండ్‌ కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా మారి.. స్థిరాస్తి ప్రాజెక్టులు, షేర్లలో లాభదాయక పెట్టుబడులు పెట్టారు. 1975లో ఆ కంపెనీని మూసివేసి.. మూడేళ్ల అనంతరం బెర్క్‌షైర్‌లో వైస్‌ఛైర్మన్‌గా చేరారు. కంపెనీలో చేరకముందే బఫెట్‌తో మంగర్‌కు పరిచయం ఉంది. ఇద్దరూ ఒకే తరహా పెట్టుబడి లక్ష్యాలు కలిగి ఉండడంతో కలిసి పనిచేయడం సులువైంది. వీరిద్దరూ కలిసి 100 మిలియన్‌ డాలర్ల సంపదనైనా సృష్టించగలమా అని ప్రారంభంలో అనుకున్నారట. ప్రస్తుతం కంపెనీ విలువ 785 బిలియన్‌ డాలర్లు (రూ.65.15 లక్షల కోట్లు)గా ఉంది.

యాపిల్‌తో భారీ లాభాలు: బెర్క్‌షైర్‌ హాతవేకు అత్యంత లాభాలిచ్చిన పెట్టుబడి మార్గం యాపిల్‌ అనే చెప్పాలి. ఈ కంపెనీలో ప్రస్తుతం 5.85 శాతం(177.6 బి. డాలర్లు) వాటా బెర్క్‌షైర్‌కు ఉంది. ఇప్పటిదాకా 13 సార్లు యాపిల్‌ షేర్లను కొని, 5 సార్లు అమ్మారు. తాజా గణాంకాల ప్రకారం.. ఈ కంపెనీలో పెట్టుబడుల వల్ల 379 శాతం లాభం వచ్చింది.

మంగర్‌ నాకు చెప్పిందదే..: ‘మంగర్‌ నాకు సులువైన ఆలోచన చెప్పారు. అదేంటంటే.. మంచి కంపెనీలను అద్భుతమైన ధరల వద్ద కొనడాన్ని మరచిపో. అద్భుతమైన కంపెనీలను మంచి ధర వద్ద కొనడం నేర్చుకో అని. ఈ ఆలోచనే కంపెనీ తలరాతను మార్చింద’ని బఫెట్‌ తన వాటాదార్లకు 2015లో రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని