ఐటీ సెజ్‌ల్లో స్థలాలకు గిరాకీ

ఐటీ/ఐటీఈఎస్‌ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)ని అభివృద్ధి చేసిన ఒక డెవలపర్‌ విజ్ఞప్తి నేపథ్యంలో.. అందులో ప్రాసెసింగేతర ప్రాంతాలకు సెజ్‌ హోదాను రద్దు చేసే అధికారం అంతర్‌ మంత్రిత్వ శాఖల బోర్డుకు ఉందని ఒక అధికారిక నోటిఫికేషన్‌ స్పష్టం చేసింది.

Updated : 08 Dec 2023 03:07 IST

నాన్‌-ప్రాసెసింగ్‌ ప్రాంతాల్లో కార్యకలాపాలకు అనుమతులు
నోటిఫికేషన్‌ జారీ చేసిన వాణిజ్య శాఖ 

దిల్లీ: ఐటీ/ఐటీఈఎస్‌ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)ని అభివృద్ధి చేసిన ఒక డెవలపర్‌ విజ్ఞప్తి నేపథ్యంలో.. అందులో  ప్రాసెసింగేతర ప్రాంతాలకు సెజ్‌ హోదాను రద్దు చేసే అధికారం అంతర్‌ మంత్రిత్వ శాఖల బోర్డుకు ఉందని ఒక అధికారిక నోటిఫికేషన్‌ స్పష్టం చేసింది. సెజ్‌లపై అత్యున్నత నిర్ణయాత్మక వ్యవస్థగా అంతర్‌ మంత్రిత్వ శాఖల బోర్డు ఉంది. దీనికి వాణిజ్య కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇలా ఐటీ సెజ్‌లలోని నాన్‌-ప్రాసెసింగ్‌ ప్రాంతంలో ఐటీ లేదా ఐటీఈఎస్‌ రంగ వ్యాపారానికి చెందిన కార్యకలాపాలను ఏర్పాటు చేసుకోవచ్చని వాణిజ్య శాఖ నోటిఫికేషన్‌ తెలిపింది. ఇందు కోసం స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌(అయిదో సవరణ) రూల్స్‌, 2023కి మంత్రిత్వ శాఖ సవరణలు చేసింది.

నాన్‌-ప్రాసెసింగ్‌ ప్రాంతం అంటే..

సెజ్‌లలోని ప్రాసెసింగ్‌ ప్రాంతంలో వస్తువుల తయారీ లేదా సేవల రూపకల్పన జరుగుతుంది. వీటిని విదేశాలకు ఎగుమతి చేయాల్సి ఉంది. అదే నాన్‌ప్రాసెసింగ్‌ ప్రాంతంలో ఈ వస్తువులు లేదా సేవలకు మద్దతుగా నిలిచే మౌలిక వసతులను ఏర్పాటు చేస్తారు. మొత్తం సెజ్‌ ప్రాంతంలో ప్రాసెసింగ్‌ ప్రాంతం 50 శాతం కంటే తక్కువకు చేరితే మాత్రం నాన్‌-ప్రాసెసింగ్‌ ప్రాంతాన్ని పెంచడానికి కుదరదని ఆ నోటిఫికేషన్‌ తెలిపింది. అదే సమయంలో డెవలపర్‌ అన్ని చెల్లింపులను చేసిన అనంతరమే నాన్‌-ప్రాసెసింగ్‌ ప్రాంతాలను సెజ్‌ నుంచి మినహాయించేందుకు అనుమతి ఇస్తుందని వివరించింది. నాన్‌ ప్రాసెసింగ్‌ ప్రాంతంలో ఏర్పాటయ్యే వ్యాపారాలకు సెజ్‌లలో లభించే సదుపాయాలు/హక్కులు అందుబాటులో ఉండవనీ తెలిపింది. ఎటువంటి పన్ను ప్రయోజనాలూ దక్కవని స్పష్టం చేసింది.

ఏమిటి ప్రయోజనం

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఐటీ సెజ్‌లలో కార్యాలయాలకు గిరాకీ పెరుగుతుందని.. ఖాళీగా ఉన్న స్థలాలు నిండడానికి ఉపకరిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. డీఎల్‌ఎఫ్‌, ఎంబసీ గ్రూప్‌, ఆర్‌ఎమ్‌జడ్‌, టాటా రియాల్టీ, బ్రిగేడ్‌ తదితర కంపెనీలు కార్యాలయ స్థిరాస్తి రంగంలో ఉన్నాయి. వీటితో పాటు మూడు నమోదిత రీట్స్‌ (రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌)లూ ఉన్నాయి. తాజా సవరణ వల్ల కంపెనీలు తమ కార్యాలయాలను విస్తరించుకోవడానికి వీలుంటుందని టాటా రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రా ఎండీ, సీఈఓ సంజయ్‌దత్‌ పేర్కొన్నారు.  స్థిరాస్తి వనరులను సమర్థంగా వినియోగించుకోవచ్చనీ అన్నారు.

ప్రస్తుత స్థితి ఇదీ

‘ప్రస్తుతం దేశంలోని అగ్రగామి 6 నగరాల్లోని ఐటీ సెజ్‌లలో 170 మిలియన్‌ చదరపు అడుగుల కార్యాలయ స్థలం ఉండగా.. ఇందులో 20 శాతం ఖాళీగా ఉంది. అదనంగా 10 మిలియన్‌ చదరపు అడుగుల సెజ్‌ స్థలాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి రెండేళ్లలో పూర్తి కానున్నాయ’ని సంజయ్‌దత్‌ తెలిపారు. తాజా చర్యల వల్ల ఐటీ సెజ్‌లలో ఆక్యుపెన్సీ పెరిగి.. ఆర్థిక కార్యకలాపాలు రాణిస్తాయని.. మరిన్ని ఉద్యోగాల సృష్టి జరుగుతుందని మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌ సీఈఓ రమేశ్‌ నాయర్‌ అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని