దేశీయంగా రిలయన్స్‌, డిస్నీ కార్యకలాపాల విలీనం

భారత్‌లో తమ మీడియా వ్యాపార కార్యకలాపాలను విలీనం చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అమెరికాకు చెందిన వాల్ట్‌ డిస్నీ కంపెనీలు బుధవారం ప్రకటించాయి.

Published : 29 Feb 2024 02:06 IST

రూ.70,000 కోట్ల విలువ.. 120 చానళ్లతో దిగ్గజ మీడియా, వినోద సంస్థ అవతరణ
నీతా అంబానీ నేతృత్వం

దిల్లీ: భారత్‌లో తమ మీడియా వ్యాపార కార్యకలాపాలను విలీనం చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అమెరికాకు చెందిన వాల్ట్‌ డిస్నీ కంపెనీలు బుధవారం ప్రకటించాయి. ఇందుకోసం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లు తెలిపాయి. ఈ రెండు సంస్థల మీడియా వ్యాపారాల విలీనంతో రూ.70,000 కోట్ల విలువైన సంస్థ అవతరించే అవకాశం ఉంది. పలు భాషల్లో 120 టీవీ చానళ్లు (కలర్స్‌, స్టార్‌ ప్లస్‌, స్టార్‌ గోల్డ్‌ లాంటి వినోద చానళ్లు; స్టార్‌ స్పోర్ట్స్‌, స్పోర్ట్‌ 18 లాంటి క్రీడా చానళ్లు), రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు (జియో సినిమా, హాట్‌స్టార్‌), దేశవ్యాప్తంగా 75 కోట్ల మంది వీక్షకుల సంఖ్యతో భారత మీడియా, వినోద రంగంలో అతిపెద్ద సంస్థగా ఇది నిలుస్తుంది. ‘ఒప్పందంలో భాగంగా స్టార్‌ ఇండియాలో వయాకామ్‌ 18 మీడియా వ్యాపారం విలీనం అవుతుంద’ని ఇరుసంస్థలు తెలిపాయి. విలీనానంతర సంస్థ విలువ రూ.70,352 కోట్లుగా (8.5 బిలియన్‌ డాలర్లు) ఉండొచ్చని పేర్కొంది. ఈ సంస్థకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా, డిస్నీ మాజీ ఉన్నతాధికారి ఉదయ్‌ శంకర్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఆర్‌ఐఎల్‌ యాజమాన్య నియంత్రణలో ఈ సంస్థ పనిచేస్తుంది. ఇందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (16.34%), అనుబంధ సంస్థ వయాకామ్‌కు (46.82%) కలిపి మొత్తంగా 63.16%, డిస్నీకి 36.84% వాటా ఉంటాయి.

మరో రూ.11,500 కోట్ల పెట్టుబడి: సోనీ, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి సంస్థలతో పోటీపడేందుకు విలీనానంతర సంస్థలో రూ.11,500 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు రిలయన్స్‌ అంగీకరించింది. ఈ విలీన ప్రతిపాదనకు నియంత్రణ సంస్థలు, వాటాదార్లతో పాటు ఇతరత్రా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవ్వన్నీ లభిస్తే.. 2024 చివరి త్రైమాసికంలో లేదా 2025 మొదటి త్రైమాసికంలో ఈ లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉంది.

భారత్‌లో ఎలిఫెంట్‌ హౌస్‌ బ్రాండుపై పానీయాల తయారీ, మార్కెటింగ్‌, పంపిణీ, విక్రయాల నిమిత్తం శ్రీలంక సంస్థ ఎలిఫెంట్‌ హౌస్‌తో రిలయన్స్‌ కన్జూమర్‌   ప్రోడక్ట్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని