పెను ముప్పుగా మధుమేహ వ్యాధి

అల్జీమర్స్‌, మధుమేహం, ఊబకాయం వ్యాధులకు చికిత్సలో వినియోగించే కొన్ని నూతన ఔషధాలను బహుళ జాతి ఫార్మా కంపెనీ  ఎలీ లిల్లీ త్వరలో మనదేశంలోకి తీసుకురానుంది.

Published : 29 Feb 2024 02:07 IST

కొత్త ఔషధాలు తెస్తున్నాం
ఎలీ లిల్లీ అండ్‌ కంపెనీ సీఈఓ డేవిడ్‌ రిక్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: అల్జీమర్స్‌, మధుమేహం, ఊబకాయం వ్యాధులకు చికిత్సలో వినియోగించే కొన్ని నూతన ఔషధాలను బహుళ జాతి ఫార్మా కంపెనీ  ఎలీ లిల్లీ త్వరలో మనదేశంలోకి తీసుకురానుంది. బయో ఏషియా 2024 సదస్సుకు బుధవారం హాజరైన ఎలీ లిల్లీ అండ్‌ కంపెనీ సీఈఓ డేవిడ్‌ రిక్స్‌ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. భారతదేశంలో ఊబకాయం, మధు మేహ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చైనా తర్వాత ఈ జబ్బులున్న వారి సంఖ్య భారతదేశంలో అధికంగా ఉండగా.. ఈ విషయంలో త్వరలో చైనాను భారత్‌ మించిపోయే అవకాశం ఉందనీ హెచ్చరించారు. మధు మేహ వ్యాధికి తగిన పరిష్కారాలు కనుగొనేందుకు ఎన్నో ఏళ్లుగా ఎలీ లిల్లీ కృషి చేస్తూ, ఎన్నో కొత్త ఔషధాలు తీసుకువచ్చినట్లు వివరించారు. ఎక్కువ మంది బాధితులకు ఈ మందులు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అల్జీమర్స్‌ వ్యాధికి విప్లవాత్మక పరిష్కారాన్ని కనుగొన్నామని, దీనికి త్వరలో అనుమతులు వస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఊబకాయ చికిత్సలో తాము అందించే మందులకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉందని గుర్తు చేశారు. భారతదేశంలో 3 దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తున్నామని, బెంగుళూరులో తమ కంపెనీకి అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఉందని వెల్లడించారు. భారతదేశ వృద్ధి అవకాశాల వల్ల, ప్రజల తలసరి ఆదాయం - జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. జీవశాస్త్రాలు, ఔషధ పరిశ్రమకు హైదరాబాద్‌ కేంద్రస్థానంగా మారిందని ప్రశంసించారు.

ఏఐ, డేటాతో పరిశోధనలు వేగవంతం

ఏఐ (కృత్రిమ మేధ), డేటా టెక్నాలజీలతో మందుల పరిశోధన వేగవంతం అవుతున్నట్లు మెడ్‌ట్రానిక్‌ ఛైర్మన్‌ - సీఈఓ జెఫ్‌ మార్తా అభిప్రాయపడ్డారు. శాస్త్ర పరిశోధనలు హైదరాబాద్‌లో అధికంగా జరుగుతున్నాయని, ఇందులో మెడ్‌ట్రానిక్‌ భాగస్వామి అవుతోందని వివరించారు. ప్రతి సెకనుకు ఇద్దరు రోగులకు తాము సేవలు అందిస్తున్నామని, వైద్యులు, టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే తొలి మెడ్‌టెక్‌ కంపెనీ తమదేనని తెలిపారు. పార్కిన్సన్‌ వ్యాధికి 30 ఏళ్లుగా నెర్వ్‌ సిమ్యులేటర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నామని, మెదడుకు వెళ్లే సంకేతాలను గుర్తించే సెన్సర్లను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. మెషీన్‌ లెర్నింగ్‌, డీప్‌ లెర్నింగ్‌.. వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం వైద్యశాస్త్రం, ఔషధ పరిశ్రమ, ఔషధ ఉపకరణాల మీద విశేష ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు.

జీవశాస్త్రాలు.. ఐటీ కలిసి ఉంది ఇక్కడే

విద్య, వైద్య రంగాల్లో ఏఐ, ఇతర నూతన సాంకేతిక పరిజ్ఞానం క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటి ఆధారంగా వస్తు, సేవలు ఆవిష్కరించడానికి అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఎండీ జెరెమీ జెర్జెన్స్‌ అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా ఉన్నందునే, 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. జీవ శాస్త్రాలు, ఐటీ పరిజ్ఞానం అందుబాటులో ఉన్న మెరుగైన ప్రదేశం ఇంతకంటే మరొకటి కనిపించ లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా ఆరోగ్య సవాళ్లకు తగిన పరిష్కారాలు ఆవిష్కరించడానికి కృషి చేస్తున్నామని వివరించారు.


వైద్య రంగంలో నిపుణుల కొరత

వైద్య రంగంలో ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల కొరత ప్రధాన సమస్యగా మారిందని అపోలో హాస్పిటల్స్‌ సంయుక్త ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. బయో ఏషియా సదస్సులో భాగంగా నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యులు, నర్సులు తగినంత సంఖ్యలో లేరు. వృద్ధాప్య జనాభా పెరుగుదల, కొత్త సాంకేతికతలు, వైద్య విధానాలు, జీవన శైలి వ్యాధులు పెరగడం లాంటివి ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. వైద్య సేవలను ఎక్కడినుంచైనా అందించే సాంకేతికత అందుబాటులోకి రావాలి. ఇప్పటికే టెలిమెడిసిన్‌ లాంటి సేవలను అందిస్తున్నాం. కృత్రిమ మేధ (ఏఐ) క్లినికల్‌ ఇంటెలిజెన్స్‌ రానున్న రోజుల్లో ఎంతో కీలకం కానుంది. ప్రతి సమాచారాన్ని ఏఐ మీద విశ్లేషిస్తే, కచ్చితమైన చికిత్స అందించేందుకు వీలవుతుంద’ని సంగీత పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని