ఏప్రిల్‌-డిసెంబరులో తగ్గిన ఎఫ్‌డీఐ

మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  ఏప్రిల్‌-డిసెంబరు మధ్య 13% తగ్గి 32 బి.డాలర్ల (సుమారు రూ.2,65,000 కోట్ల)కు పరిమితమైనట్లు ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడించాయి.

Published : 01 Mar 2024 01:49 IST

13% క్షీణతతో 32 బి.డాలర్లకు పరిమితం

దిల్లీ: మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  ఏప్రిల్‌-డిసెంబరు మధ్య 13% తగ్గి 32 బి.డాలర్ల (సుమారు రూ.2,65,000 కోట్ల)కు పరిమితమైనట్లు ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడించాయి. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, టెలికాం, వాహన, ఔషధ రంగాల్లోకి పెట్టుబడులు నెమ్మదించడం వల్లే, మొత్తమ్మీద ఎఫ్‌డీఐ తగ్గింది. 2022 ఏప్రిల్‌-డిసెంబరులో 36.74 బి.డాలర్ల ఎఫ్‌డీఐ భారత్‌లోకి వచ్చింది.

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) అక్టోబరు-డిసెంబరులో ఎఫ్‌డీఐ 11.6 బి.డాలర్లకు పెరిగింది.  ఏడాది క్రితం ఇదే సమయంలో ఈ మొత్తం  9.83 బి.డాలర్లే.
  • ఈక్విటీ పెట్టుబడులు, తిరిగి పెట్టుబడి పెట్టిన ఆదాయాలు (రీఇన్వెస్టెడ్‌ ఎర్నింగ్స్‌), ఇతర మూలధనం కలిపి మొత్తం ఎఫ్‌డీఐ 55.27 బి.డాలర్ల నుంచి 7% తగ్గి 51.5 బి.డాలర్లకు పరిమితమైంది.
  • సింగపూర్‌, యూఎస్‌, యూకే, సైప్రస్‌, యూఏఈ వంటి ప్రధాన దేశాల నుంచి మన దేశానికి ఏప్రిల్‌-డిసెంబరు మధ్య 9 నెలల కాలంలో ఎఫ్‌డీఐ ఈక్విటీ రాక తగ్గింది.
  • కేమ్యాన్‌ ఐలాండ్స్‌, సైప్రస్‌ల నుంచి పెట్టుబడులు గణనీయంగా తగ్గాయి. ఈ ప్రాంతాల నుంచి 2023 ఏప్రిల్‌-డిసెంబరు మధ్య వరుసగా 215 మిలియన్‌ డాలర్లు, 796 మి.డాలర్లు మన దేశానికి తరలివచ్చాయి. 2022 ఇదే సమయంలో ఇవి వరుసగా 624 మి.డాలర్లు, 1.15 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.
  • మారిషస్‌, నెదర్లాండ్స్‌, జపాన్‌, జర్మనీల నుంచి పెట్టుబడులు పెరిగాయి.
  • రంగాల వారీగా చూస్తే కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ట్రేడింగ్‌, సేవలు, టెలికాం, వాహన, ఔషధ, రసాయనాల్లోకి పెట్టుబడులు తగ్గాయి. నిర్మాణ (మౌలిక సదుపాయాలు) కార్యకలాపాలు, అభివృద్ధి, విద్యుత్‌ రంగాల్లోకి పెట్టుబడులు పెరిగాయి.
  • రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర అత్యధికంగా 12.1 బి.డాలర్ల ఎఫ్‌డీఐ రాబట్టింది. ఏడాది క్రితం ఇదే సమయంలో 10.76 బి.డాలర్ల ఎఫ్‌డీఐ వచ్చింది.
  • కర్ణాటకకు 8.77 బి.డాలర్ల నుంచి 3.6 బి.డాలర్లకు క్షీణించింది. దిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, హరియాణా తదితర రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఎఫ్‌డీఐ తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం, భౌగోళిక-రాజకీయ పరిస్థితులు అనిశ్చితిలో ఉండటం వంటివి ఎఫ్‌డీఐపై ప్రభావం చూపాయని ఒక అధికారి వెల్లడించారు. గుజరాత్‌, తెలంగాణ, ఝార్ఖండ్‌లకు ఎఫ్‌డీఐ పెరిగింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు