టాటా చిప్‌ తయారీ ప్లాంట్లు వస్తున్నాయ్‌

కొవిడ్‌ సమయంలో సెమీకండక్టర్‌ చిప్‌ల కొరత వల్ల ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగం ఎంతో ఇబ్బంది పడింది. చిప్‌ల వాడకం తప్పనిసరి కావడంతో, అవి లభించక వాహనాల తయారీ కూడా నెమ్మదించింది.

Updated : 01 Mar 2024 03:25 IST

ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
సీజీ పవర్‌కూ అనుమతులు
మొత్తం రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు

దిల్లీ: కొవిడ్‌ సమయంలో సెమీకండక్టర్‌ చిప్‌ల కొరత వల్ల ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగం ఎంతో ఇబ్బంది పడింది. చిప్‌ల వాడకం తప్పనిసరి కావడంతో, అవి లభించక వాహనాల తయారీ కూడా నెమ్మదించింది. ఈ పరిస్థితి మళ్లీ ఎదురవ్వకుండా, దేశీయ కంపెనీలతో పాటు అంతర్జాతీయ విపణులకూ అందించేందుకు మనదేశంలో 3 సెమీకండక్టర్‌ తయారీ యూనిట్ల ఏర్పాటుకు గురువారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందులో టాటా గ్రూప్‌ 2 ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా.. జపాన్‌కు చెందిన రెనెసాస్‌ భాగస్వామ్యంతో సీజీ పవర్‌ ఒక ప్లాంటు నిర్మించనుంది. వీటి వల్ల మొత్తం రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

రూ.76,000 కోట్ల ప్రభుత్వ మద్దతు: రక్షణ, వాహన, టెలికమ్యూనికేషన్‌ రంగాల కోసం చిప్‌ సెట్లను తయారు చేసే ఈ మూడు ప్లాంట్ల నిర్మాణం వచ్చే 100 రోజుల్లో ప్రారంభమవుతుందని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ‘డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ సెమీకండక్టర్స్‌ అండ్‌ డిస్‌ప్లే మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ ఎకోసిస్టమ్‌’ పథకం కింద ఏర్పాటయ్యే ఈ ప్లాంట్లకు ప్రభుత్వం నుంచి రూ.76,000 కోట్ల మద్దతు లభిస్తుంది.

టాటాలు.. 2 ప్లాంట్లు: తైవాన్‌కు చెందిన పవర్‌చిప్‌ సెమీకండక్టర్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ కార్ప్‌ భాగస్వామ్యంతో, టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్‌ ఒక సెమీకండక్టర్‌ ఫ్యాబ్‌ను గుజరాత్‌లోని ఢొలేరాలో ఏర్పాటు చేయనుంది. నెలకు 50,000 వేఫర్ల తయారీ సామర్థ్యం దీని సొంతం. ఈ ప్లాంటుపై రూ.91,000 కోట్ల పెట్టుబడులు పెడతారు. 28 ఎన్‌ఎమ్‌ టెక్నాలజీతో అత్యుత్తమ పనితీరును అందించే చిప్‌లను ఇక్కడ తయారు చేస్తారు. వీటిని విద్యుత్తు వాహనాలు, టెలికాం, రక్షణ ఆటోమోటివ్‌, వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌, డిస్‌ప్లే, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌లో వినియోగిస్తారు. టాటా సెమీకండక్టర్‌ అసెంబ్లీ అండ్‌ టెస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.27,000 కోట్లతో అస్సోంలోని మారిగావ్‌లో సెమీకండక్టర్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ రోజుకు 4.8 కోట్ల చిప్‌లు తయారవుతాయి.

సనంద్‌లో సీజీ పవర్‌ చిప్‌ యూనిట్‌: జపాన్‌కు చెందిన రెనెసాస్‌ ఎలక్ట్రానిక్స్‌ కార్ప్‌, థాయ్‌లాండ్‌కు చెందిన స్టార్స్‌ మైక్రోఎలక్ట్రానిక్స్‌తో కలిసి సీజీ పవర్‌ రూ.7,600 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లోని సనంద్‌లో ఒక ప్లాంటు నిర్మించనుంది. రోజుకు 1.5 కోట్ల చిప్‌లను ఇక్కడ తయారు చేస్తారు. వీటిని వినియోగ ఉత్పత్తులు, పారిశ్రామిక, ఆటోమోటివ్‌, విద్యుత్‌ రంగాల్లో వాడతారు. ఇదే ప్రాంతంలో సెమీకండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు అమెరికాకు చెందిన మైక్రాన్‌ సంస్థకూ గతేడాది జూన్‌లోనే మంత్రివర్గం అనుమతించింది.

భారీ స్థాయిలో ఉద్యోగాలు..: అతి తక్కువ సమయంలోనే ఈ మూడు ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయని.. వీటి వల్ల నేరుగా 20,000 అత్యాధునిక టెక్‌ ఉద్యోగాలు, 60,000 పరోక్ష ఉద్యోగాలు రానున్నాయని మంత్రి వైష్ణవ్‌ తెలిపారు.


గర్వంగా ఉంది: టాటా గ్రూప్‌

ఢొలేరాలో రూ.91,000 కోట్లతో ఏర్పాటు చేసే భారత తొలి వాణిజ్య ఫ్యాబ్‌ ద్వారా అంతర్జాతీయ సెమీకండక్టర్‌ పరిశ్రమలోకి టాటా ఎలక్ట్రానిక్స్‌ అడుగుపెడుతుంది. ఈ ఏడాదే ప్లాంటును నిర్మిస్తాం. సెమీకండక్టర్‌ తయారీలోకి భారత్‌ అడుగుపెట్టడానికి మేం ఆధ్వర్యం వహించడం గర్వంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు