మొబైల్‌ యాప్‌లోనే కొంటాం

మొబైల్‌ యాప్‌ల ద్వారా కొనుగోళ్లకే 60% మందికి పైగా ఆన్‌లైన్‌ వినియోగదార్లు మొగ్గు చూపుతున్నట్లు పీడబ్ల్యూసీ ఇండియా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది.

Published : 03 Mar 2024 01:41 IST

మెజార్టీ వినియోగదార్ల మొగ్గు
పీడబ్ల్యూసీ సర్వేలో వెల్లడి

దిల్లీ: మొబైల్‌ యాప్‌ల ద్వారా కొనుగోళ్లకే 60% మందికి పైగా ఆన్‌లైన్‌ వినియోగదార్లు మొగ్గు చూపుతున్నట్లు పీడబ్ల్యూసీ ఇండియా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. వస్తువుల కొనుగోలుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం, సులభంగా.. సురక్షితంగా లావాదేవీ నిర్వహించే వీలు లాంటివి ఇందుకు కారణాలుగా పేర్కొంది.

  • డిస్కౌంట్లు, సౌకర్యవంతం కారణంగా పట్టణ ప్రాంతాల్లోని వినియోగదార్లు ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది.
  • మిగతా ప్రాంతాల విషయానికొస్తే.. స్థానికంగా విక్రయ కేంద్రాల్లో ఉత్పత్తుల లభ్యత పరిమితంగా ఉండటం, కొన్ని దొరకకపోవడంతో వినియోగదారులు ఆన్‌లైన్‌ బాట పడుతున్నారని వెల్లడించింది.

12.5 కోట్ల మంది ఆన్‌లైన్‌లో..: కొన్నేళ్లుగా భారత్‌లో సుమారు 12.5 కోట్ల మంది వినియోగదార్లు ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోళ్లు జరిపారని పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి నగరాల నుంచే ఉన్నారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2,100 మంది నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అభిప్రాయాలు సేకరించి ఈ నివేదికను పీడబ్ల్యూసీ ఇండియా రూపొందించింది.

చిన్న నగరాలే కీలకం: ‘ఇ-కామర్స్‌ మలివిడత వృద్ధికి ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి నగరాల వినియోగదారులే కీలకం అవుతారు. తమ సమీపంలో విక్రయ కేంద్రాలు తక్కువగా ఉండటం, బ్రాండ్ల ఎంపికకు అవకాశం పరిమితం కావడం వల్ల.. తమ అభిరుచికి తగ్గట్లుగా ఉత్పత్తుల కొనుగోలు కోసం ఆన్‌లైన్‌ మార్గాన్ని ఆయా ప్రాంతాల ప్రజలు పరిశీలిస్తున్నార’ని పీడబ్ల్యూసీ ఇండియాలో పార్ట్‌నర్‌, బిజినెస్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ లీడర్‌గా ఉన్న సోమిక్‌ గోస్వామి తెలిపారు. ఉత్పత్తులను పరిచయం చేయడంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో చూసి, నూతన ఉత్పత్తులను ప్రయత్నిస్తున్నట్లు సర్వేలో 62 శాతం మంది వెల్లడించారు. పెద్ద పట్టణాల్లోని వాళ్లే కాకుండా మిగతా ప్రాంతాల వినియోగదార్లు కూడా యూపీఐ ద్వారా చెల్లింపులతో పోలిస్తే క్యాష్‌ ఆన్‌ డెలివరీకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదిక తెలిపింది. మోసాల బారిన పడకూడదనే ఉద్దేశమే ఇందుకు కారణంగా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని