జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి

భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది.

Published : 28 Mar 2024 02:03 IST

70% మహిళలకే రావొచ్చు
సంరక్షణ సేవల రంగంపై ఎఫ్‌ఎల్‌ఓ నివేదిక

దిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. భారత్‌లో సంరక్షణ సేవల రంగంలో మార్పునకు ప్రధానంగా 5 అంశాలు- సెలవుల విధానాలు, సంరక్షణ సేవలకు రాయితీలు, సంరక్షణ మౌలిక వసతులపై పెట్టుబడులు, సంరక్షణ సేవల సిబ్బందికి నైపుణ్యాల శిక్షణ, నాణ్యతా విధానాలపై దృష్టి సారించాలని నివేదిక సూచించింది. ‘ప్రసూతి సెలవులు, మాతృత్వ- పితృత్వ సెలవు విధానాల్లో సవరణ, సంరక్షణ పని ప్రోత్సాహక సెలవు, సులభ పని విధాన ఎంపిక అవకాశాలు’ తదితరాల కోసం ఎంఎస్‌ఎమ్‌ఈలు, అంకుర సంస్థలకు ఆర్థిక సహకారం అందించే అంశాన్ని కార్మిక, ఉద్యోగకల్పన మంత్రిత్వ శాఖ పరిశీలించాలి. దీని వల్ల ఉద్యోగ యాజమాన్య సంస్థలు లింగ వ్యత్యాసాలు లేని సంరక్షణ పని సెలవు విధానాన్ని పాటించేలా, సులభ పని విధాన అవకాశాలను కల్పించేలా ప్రోత్సహించినట్లు అవుతుందని ఎఫ్‌ఎల్‌ఓ వివరించింది. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ సంఘాల మధ్య సమన్వయం అవసరమని తెలిపింది. ‘2030 కల్లా సంరక్షణ సేవల రంగం 47.5  కోట్ల ఉద్యోగాలను సృష్టించగలదని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతోంది. ముఖ్యంగా భారత్‌ విషయానికొస్తే.. జీడీపీలో 2 శాతాన్ని ఈ రంగంపై వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇందులో సుమారు 70 శాతం వరకు మహిళలకే లభిస్తాయ’ని నివేదిక తెలిపింది. భారత్‌లో సంరక్షణ సేవల రాయితీలు, ప్రోత్సాహకాలు మిషన్‌ శక్తి లాంటి ప్రభుత్వ పథకాల ద్వారా అందిస్తున్నారు. మహిళల భద్రత, సాధికారికతే లక్ష్యంగా మిషన్‌ శక్తి పథకం పనిచేస్తోంది. ఈ పథకాలను విస్తరించడం వల్ల శిశు సంరక్షణ, వృద్ధుల సంరక్షణ, దీర్ఘకాల సంరక్షణ సేవలకు విస్తృత ఆర్థిక సహకారం లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని వారికి ప్రయోజనం ఉంటుంది. చెల్లింపుల సంరక్షణ సేవల ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. ఈ రంగాన్ని క్రమబద్దీకరించాలని, వ్యవస్థీకరించాలని నివేదిక సూచించింది. ఈ రంగంలో మరింత మంది నైపణ్య సిబ్బంది అవసరమని, మరిన్ని విధానాలు, సహేతుక నిబంధనలు అవసరమని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని