మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు

గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో   రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది.

Updated : 28 Mar 2024 03:15 IST

గత 10 ఏళ్లలో 4,62,733 కేసులు
ఆర్‌టీఐ దరఖాస్తుకు స్పందనగా ఆర్‌బీఐ వెల్లడి

దిల్లీ: గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో   రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. ‘2013-14 నుంచి 2022-23 మధ్య ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మొత్తం మీద 4,62,733 మోసాలు జరిగాయి. అత్యధికంగా మహారాష్ట్రలో జరగ్గా.. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ, హరియాణ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌ ఉన్నాయి. కర్ణాటక, గుజరాత్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌లలోనూ మొత్తం బ్యాంకు మోసాలు 8,000-12,000 వరకు జరిగాయ’ని సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద ఆంగ్ల వార్తా సంస్థ ‘మనీకంట్రోల్‌’ దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందనగా ఆర్‌బీఐ తెలిపింది. ఓ వైపు బ్యాంకుల్లో మోసాలు పెరుగుతున్నా.. అవి మాత్రం రుణ నష్టభయ నిర్వహణపైనే దృష్టి సారించాయని కేర్‌రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ సంజయ్‌ అగర్వాల్‌ అంటున్నారు.

కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారానే

ఆర్‌బీఐ ఇటీవలి వార్షిక నివేదికలను విశ్లేషిస్తే చాలా వరకు మోసాలు రుణాలు, కార్డులు, డిజిటల్‌/ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ పద్ధతుల్లోనే జరిగాయి. ఉదాహరణకు 2022-23లో నమోదైన 13,530 కేసుల్లో సగం వరకు (6,659) కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌ల్లోనే చోటుచేసుకున్నాయి. రుణాల్లో 4109 మోసాలు జరిగాయి. 2021-22లో 9,097 మోసాలు కనిపించగా.. అందులో రుణాలకు సంబంధించే 3,833 ఉన్నాయి. 3591 కేసులు కార్డులు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరిగాయి. 2020-21లో మొత్తం 7338 మోసాలు జరగ్గా..అందులో 3476 మోసాలు రుణాల్లో కనిపించాయి. ఇక 2545 మోసాలు నెట్‌బ్యాంకింగ్‌, కార్డు ద్వారా చోటు చేసుకున్నాయి.

ప్రజలు ఏం చేయాలంటే..

మోసాల బారినపడకుండా ప్రజలు తమ కేవైసీ (వినియోగదారు సమాచారం) నిబంధనలను తెలుసుకుని, ఎప్పటికప్పుడు తమ వివరాలను అప్‌డేట్‌ చేస్తుండాలని ఆర్‌బీఐ తెలిపింది. ఫోన్‌ కాల్స్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌, ఇమెయిల్‌ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని, ఓటీపీలను బ్యాంకులు ఎప్పుడూ అడగవని.. అటువంటి సందేశాలు బ్యాంకు పేరిట వచ్చినా స్పందించొద్దని ఆర్‌బీఐ హెచ్చరించింది. బ్యాంకులూ కృత్రిమ మేధ(ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌(ఎమ్‌ఎల్‌) వంటి కొత్త సాంకేతికతపై పెట్టుబడులు పెట్టడం ద్వారా డిజిటల్‌ సేవలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.


అంతర్జాతీయ బ్యాంకు మోసాల్లో రివకరీ 2-3 శాతమే: ఇంటర్‌పోల్‌

సింగపూర్‌: అంతర్జాతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా జరిగిన మోసపూరిత నగదు లావాదేవీల్లో 96 శాతానికి పైగా కనిపెట్టలేకపోయారని ఇంటర్‌పోల్‌ అంటోంది. చట్టవ్యతిరేకంగా జరిగిన 2-3 లక్షల కోట్ల డాలర్ల లావాదేవీల్లో 2-3% మేరే రికవరీ చేసి.. బాధితులకు అప్పజెప్పినట్లు ఇంటర్‌పోల్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చట్టవ్యతిరేక లావాదేవీలను అరికట్టడానికి 196 సభ్య దేశాల్లోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు, ప్రైవేటు ఆర్థిక సంస్థలతో కలిసి ఇంటర్‌పోల్‌ పనిచేస్తోంది. ఈ లావాదేవీలన్నీ డ్రగ్స్‌, మానవ అక్రమ రవాణా, ఆయుధాలు, ఆర్థిక అవకతవకలకు సంబంధించినవేనని ఇంటర్‌పోల్‌ సెక్రటరీ జనరల్‌ జుర్గన్‌ స్టాక్‌ పేర్కొన్నారు. ఏటా 2-3 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.164-246 లక్షల కోట్ల) మేర చట్టవ్యతిరేక లావాదేవీలు జరుగుతున్నాయన్న అంచనాలున్నాయని అన్నారు. లావాదేవీల పరిశీలనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడంపై ప్రపంచవ్యాప్త బ్యాంకింగ్‌ సంఘాలతో చర్చిస్తున్నట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని