సంక్షిప్తవార్తలు (5)

సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) సొనాటా ఫైనాన్స్‌ లిమిటెడ్‌ను కోటక్‌ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది.

Published : 29 Mar 2024 01:09 IST

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ చేతికి సొనాటా ఫైనాన్స్‌

దిల్లీ: సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) సొనాటా ఫైనాన్స్‌ లిమిటెడ్‌ను కోటక్‌ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. సొనాటా 10 రాష్ట్రాల్లో 549 శాఖల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2023 డిసెంబరు 31 నాటికి ఈ సంస్థ నిర్వహణలోని ఆస్తుల విలువ సుమారు రూ.2,620 కోట్ల వరకు ఉంటుంది. ‘ఆర్‌బీఐ వద్ద సూక్ష్మ రుణ సంస్థ, ఎన్‌బీఎఫ్‌సీగా నమోదైన సొనాటా ఫైనాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 100 శాతం చెల్లింపు మూలధనం విలువున్న వాటాను సుమారు  రూ.537 కోట్లకు కొనుగోలు చేసినట్లు’ ఎక్స్ఛేంజీలకు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది. ఈ కొనుగోలు అనంతరం కోటక్‌ బ్యాంక్‌కు సొనాటా పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా మారింది.


కార్వీ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు

ఈనాడు, హైదరాబాద్‌: కార్వీ గ్రూపునకు చెందిన కార్వీ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (కేఐఎస్‌ఎల్‌) రిజిస్ట్రేషన్‌ను సెబీ రద్దు చేసింది. మర్చంట్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలను కేఐఎస్‌ఎల్‌ నిర్వహిస్తోంది. గతేడాది మార్చిలో సెబీ ఈ సంస్థలో తనిఖీలు నిర్వహించింది. కానీ ఎటువంటి కార్యకలాపాలు కొనసాగడం లేదని గుర్తించింది. వ్యాపార బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన సాధనా సంపత్తి లేదని కూడా నిర్థారించింది. సంస్థ డైరెక్టర్‌ ఒకరు సెక్యూరిటీస్‌ మార్కెట్‌ వివాదంలో చిక్కుకున్నారు. దీంతో పాటు మర్చంట్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన ఇతర నియమ నిబంధనలు సైతం పాటించడం లేదని, పైగా రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్‌ చేయడానికి ఫీజు చెల్లించలేదని తేలింది. తత్ఫలితంగా ఈ సంస్థకు ఉన్న సర్టిఫికేట్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ‘సెబీ’ వెల్లడించింది.  


పసిడి, వెండి దిగుమతికి అధీకృత బ్యాంకులివే

జాబితాను నవీకరించిన కేంద్రం

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో బంగారం, వెండి దిగుమతి చేసుకోవడానికి అనుమతించిన బ్యాంకుల జాబితాను కేంద్రం ప్రకటించింది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌లు మనదేశంలోకి పసిడి, వెండి దిగుమతి చేసుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఈ అనుమతులు వర్తిస్తాయి. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌లు బాంగారాన్ని మాత్రం దిగుమతి చేసుకోవచ్చు.  


టయోటా వాహన ధరలు 1 నుంచి పెంపు

దిల్లీ: ఎంపిక చేసిన వాహన ధరలను ఏప్రిల్‌ 1 నుంచి 1% వరకు పెంచనున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ గురువారం వెల్లడించింది. తయారీ-నిర్వహణ వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. హ్యాచ్‌బ్యాక్‌ గ్లాంజా నుంచి ఖరీదైన ఎస్‌యూవీ ఫార్చూనర్‌ వరకు రూ.6.86-51.44 లక్షల ధరల శ్రేణిలో వాహనాలను సంస్థ విక్రయిస్తోంది.


రూ.2000 నోట్లను 1న డిపాజిట్‌ చేయలేరు

ముంబయి: రూ.2000 నోట్ల డిపాజిట్‌/మార్పిడి అవకాశం ఏప్రిల్‌ 1న ఉండదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. వార్షిక ఖాతాల ముగింపు లావాదేవీల కారణంగా వచ్చే సోమవారం మాత్రమే ఈ అవకాశం ఉండదని, ఏప్రిల్‌ 2 నుంచి మళ్లీ తమ 19 కార్యాలయాల్లోనూ రూ.2000 నోట్లను మార్చుకోవడం, లేదా డిపాజిట్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని