షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ నుంచి భారీ ఐపీఓ

షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన ఇంజినీరింగ్‌, నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఏఐఎల్‌) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు రానుంది.

Published : 30 Mar 2024 03:08 IST

రూ.7000 కోట్ల సమీకరణకు ఆఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రా దరఖాస్తు

దిల్లీ: షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన ఇంజినీరింగ్‌, నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఏఐఎల్‌) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు రానుంది. ఐపీఓ ద్వారా రూ.7000 కోట్లు సమీకరించేందుకు అనుమతి కోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ.1,250 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)లో రూ.5,750 కోట్ల విలువైన షేర్లను సంస్థ ప్రమోటర్‌ గోస్వామి ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విక్రయించనుంది. అర్హులైన కంపెనీ ఉద్యోగుల కోసం కొన్ని షేర్లను కేటాయించనున్నారు. ప్రస్తుతం ఆఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రమోటర్‌, ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలకు 99.48% వాటా ఉంది. ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌లో రూ.250 కోట్ల వరకు సమీకరించాలని కంపెనీ చూస్తోంది. ఇది పూర్తయితే తాజా ఇష్యూ పరిమాణం తగ్గుతుంది.

  • 1865లో స్థాపించిన షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ (ఎస్‌పీ గ్రూప్‌), ప్రపంచవ్యాప్తంగా ఇంజినీరింగ్‌, నిర్మాణం, మౌలికం, స్థిరాస్తి, ఇంధనం, ఆర్థిక సేవల రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. భారీ కట్టడాల నిర్మాణం, దిగ్గజ ప్రదేశాల అభివృద్ధి, నీటి నిర్వహణ, పునరుత్పాదక ఇంధన, చమురు-గ్యాస్‌, విద్యుత్‌ విభాగాల్లో కంపెనీకి మంచి పేరుంది.
  • ఆఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రాకు సముద్ర సంబంధిత, పారిశ్రామిక, ఉపరితల రవాణా, పట్టణ మౌలిక సదుపాయాలు, జల వనరులు, భూగర్భ, చమురు-గ్యాస్‌ మౌలిక వసతుల కల్పనా విభాగాలు ఉన్నాయి. గత 10 ఏళ్లలో 15 దేశాల్లో 76 ప్రాజెక్టులను కంపెనీ పూర్తిచేసింది. వీటి విలువ రూ.52,220 కోట్లు.
  • 2023 సెప్టెంబరుకు కంపెనీ చేతిలో రూ.34,888 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. 2021-22లో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ.11,018.97 కోట్లు కాగా.. 2022-23లో 14.7% పెరిగి రూ.12,637.38 కోట్లకు చేరింది. ఇదే సమయంలో లాభం రూ.357.60 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.410.86 కోట్లుగా నమోదైంది.
  • పబ్లిక్‌ ఇష్యూ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, డ్యామ్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌, జెఫ్రీస్‌ ఇండియా, నొమురా ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌, నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ వ్యవహరిస్తాయి.

ఇకాస్‌ (ఇండియా) మొబిలిటీ కూడా: మొబిలిటీ సేవల సంస్థ ఇకాస్‌ (ఇండియా) మొబిలిటీ అండ్‌ హాస్పిటాలిటీ లిమిటెడ్‌ కూడా ఐపీఓకు వచ్చేందుకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో రానుంది. ఐపీఓలో భాగంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 1.8 కోట్ల షేర్లను ప్రమోటర్లు రాజేశ్‌ లూంబా, ఆదిత్య లూంబా విక్రయించనున్నారు. ప్రస్తుతం కంపెనీలో 100% వాటా ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలకు ఉంది. ఐపీఓ పూర్తి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కావడంతో, ఐపీఓ ద్వారా వచ్చిన నిధులు కంపెనీకి రావు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని