ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ట్రేడింగ్‌ ఈనెల 28తో ముగిసింది. ఈనెలలో చివరి 3 రోజులు సెలవులు కావడమే ఇందుకు కారణం.

Published : 30 Mar 2024 03:09 IST

2023-24లో చిన్న, మధ్య షేర్లదే పైచేయి..
2024-25లో దిగ్గజ కంపెనీల జోరు!

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ట్రేడింగ్‌ ఈనెల 28తో ముగిసింది. ఈనెలలో చివరి 3 రోజులు సెలవులు కావడమే ఇందుకు కారణం. గత ఏడాది కాలంలో చూస్తే పెద్ద (లార్జ్‌క్యాప్‌) షేర్లతో పోలిస్తే, మధ్య తరహా కంపెనీలు (మిడ్‌క్యాప్‌), చిన్న కంపెనీల షేర్లదే (స్మాల్‌క్యాప్‌) పైచేయిగా నిలిచింది. పెద్ద కంపెనీల షేర్ల కంటే ఇవి అధిక ప్రతిఫలాన్ని అందించాయి. 2023-24లో నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 100 సూచీ 69%, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ 59% ప్రతిఫలాన్ని పంచాయి. ఇదే కాలంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 25%, నిఫ్టీ 29% మాత్రమే పెరగడం గమనార్హం. చిన్న, మధ్యస్థాయి కంపెనీల ఆదాయాల్లో వృద్ధికి తోడు భవిష్యత్తు అవకాశాలూ వాటికి బాగుండటం ఇందుకు కారణం. ఫలితంగా స్మాల్‌ క్యాప్‌, మిడ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లోకీ నిధులు అధికంగా ప్రవహించాయి.

  • 2023 మార్చి 31న స్మాల్‌క్యాప్‌ సూచీ 26,692.09 కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 7న జీవనకాల గరిష్ఠమైన 46,821.39కి చేరింది.
  • 2023 మార్చి 31న మిడ్‌క్యాప్‌ సూచీ 23,881.79 కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 8న జీవనకాల గరిష్ఠమైన 40,282.49కి చేరింది.

ఇంతలా దూసుకెళ్లిన చిన్న, మధ్య తరహా షేర్ల విలువలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల చేసిన వ్యాఖ్యల కారణంగా.. తదుపరి నష్టాలు సంభవించాయి. ఈ నెలలోనే స్మాల్‌క్యాప్‌ సూచీ 4.55% పతనమైతే, మిడ్‌క్యాప్‌ సూచీ కూడా స్పల్పంగా దిద్దుబాటుకు గురైంది. 2024-25లోనూ చిన్న - మధ్య తరహా కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో ముఖ్య పెట్టుబడుల వ్యూహకర్త వి.కె.విజయకుమార్‌ విశ్లేషిస్తున్నారు. సాధారణంగా చిన్న షేర్లపై దేశీయ మదుపర్లు దృష్టి సారిస్తుంటారని, విదేశీ పెట్టుబడిదారులు మాత్రం లార్జ్‌క్యాప్‌పైనే అధిక పెట్టుబడులు పెడుతుంటారని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

లార్జ్‌క్యాప్‌ షేర్లు సానుకూల ధోరణిలో చలించేందుకు అవకాశాలు ఉన్నాయని.. ఈ షేర్ల అండతో 2024-25లో నిఫ్టీ 25,500ను తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ నిఫ్టీ కిందకు వచ్చినా 19500- 20,000 స్థాయుల వద్ద గట్టి మద్దతు లభించొచ్చని అంచనా వేస్తున్నారు.


రంగాల్లో ఇవి..

  • రంగాల వారీ సూచీలను గమనిస్తే.. 2023-24లో నిఫ్టీ స్థిరాస్తి సూచీ 131% ప్రతిఫలాన్ని పంచింది. ఆ తర్వాత స్థానాల్లో నిఫ్టీ డిఫెన్స్‌ (115.96%), నిఫ్టీ పీఎస్‌ఈ (101.07%), నిఫ్టీ సీపీఎస్‌ఈ (94.45%), నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు (83.75%) సూచీలు నిలిచాయి.
  • నిఫ్టీ సర్వీసెస్‌ (19.71%), నిఫ్టీ ఎఫ్‌ఎమ్‌సీజీ (16.6%), నిఫ్టీ బ్యాంక్‌ (15.14%), నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ (13.85%), నిఫ్టీ మీడియా రంగాలు ఓ మోస్తరుగా లాభాలను పంచాయి.
  • 2024-25లో అధిక ప్రతిఫలాన్ని పంచే రంగాల సూచీల్లో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ముందు వరుసలో ఉండొచ్చన్నది జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంచనా. సానుకూలతల ప్రభావం ఇప్పటికే షేర్లపై కనిపించినందున, స్థిరాస్తి రంగ షేర్లు కొంత నెమ్మదించే అవకాశం ఉంది.

ఏం చేయాలి..

సార్వత్రిక ఎన్నికలు, కీలక వడ్డీ రేట్ల నిర్ణయాలపై అనిశ్చితుల కారణంగా 2024లో స్టాక్‌ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. అందువల్ల మదుపర్లు తమ పోర్ట్‌ఫోలియోలో దిగ్గజ కంపెనీల షేర్లు (లార్జ్‌ క్యాప్‌), మధ్య తరహా కంపెనీల (మిడ్‌ క్యాప్‌) షేర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఆర్థిక మూలాలు బాగున్న చిన్న కంపెనీలనూ పరిశీలించొచ్చని చెబుతున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌అండ్‌టీ, దిగ్గజ బ్యాంకుల షేర్లు మున్ముందు మెరుగైన పనితీరును కనబర్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని