అంతర్జాతీయ సంకేతాలే కీలకం

అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లు కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. దేశీయంగా చూస్తే.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన సమీక్ష (ఏప్రిల్‌ 3-5) నిర్ణయాలపైనా మదుపర్లు దృష్టి సారించొచ్చు.

Published : 01 Apr 2024 02:06 IST

ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు కూడా
వాహన, ఔషధ షేర్లకు సానుకూలతలు
విశ్లేషకుల అంచనాలు

స్టాక్‌ మార్కెట్‌
ఈ వారం

అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లు కదలాడొచ్చని విశ్లేషకులు అంటున్నారు. దేశీయంగా చూస్తే.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన సమీక్ష (ఏప్రిల్‌ 3-5) నిర్ణయాలపైనా మదుపర్లు దృష్టి సారించొచ్చు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ ప్రసంగ (ఏప్రిల్‌ 3) అంశాలూ గమనించాలి. నిఫ్టీ-50 తన జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన 22,526.60ను పరీక్షించొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. కార్పొరేట్‌ సంస్థల ఫలితాల సీజను ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉండొచ్చని భావిస్తున్నారు.  వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

  • చమురు కంపెనీల షేర్లు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని సానుకూలంగా మొదలుపెట్టొచ్చు. అయితే పరిమిత లాభాలకే అవకాశం ఉంది. సెప్టెంబరు కల్లా ముడిచమురు బ్యారెల్‌ ధర 100 డాలర్లకు చేరొచ్చని జేపీ మోర్గాన్‌ పేర్కొన్న నేపథ్యంలో, మదుపర్లు పెట్రో ధరలను గమనించాలి.
  • మార్చినెల విక్రయ గణాంకాలు బాగుంటాయన్న అంచనాల మధ్య వాహన కంపెనీల షేర్లు సానుకూల ధోరణితో ట్రేడ్‌ కావొచ్చు. వాహన సూచీకి 21,000 వద్ద మద్దతు; 22,000 వద్ద నిరోధం ఏర్పడొచ్చు.
  • నిఫ్టీ బ్యాంక్‌ ఈ వారమూ రాణించొచ్చు. 45,500 వద్ద మద్దతు, 48,500 వద్ద నిరోధం అంచనా వేస్తున్నారు. ఒక వేళ 48,500 స్థాయిని అధిగమిస్తే 49,500-50,000కు చేరొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐలను పరిశీలించొచ్చు.
  • ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల షేర్లు మార్కెట్‌తో పాటే చలించొచ్చు. ముడిపదార్థాల ధరలు తగ్గుతుండడం కలిసిరావొచ్చు. అయితే బలహీన గ్రామీణ గిరాకీ వెనక్కి లాగొచ్చు. రాడికో ఖైతాన్‌, కోల్గేట్‌, గోద్రేజ్‌ కన్జూమర్‌   8-10% వరకు లాభాలందిచొచ్చని ఓ బ్రోకరేజీ అంచనా.
  • సిమెంటు షేర్లు ఒక శ్రేణికి లోబడి ట్రేడవవచ్చు. ఎన్నికల కోడ్‌ కారణంగా గిరాకీ కాస్త నెమ్మదించడం ఇందుకు కారణం. ధరలూ స్తబ్దుగానే ఉన్నాయి. సాగర్‌ సిమెంట్స్‌ రేటింగ్‌ ను ఓ బ్రోకరేజీ సంస్థ  ‘కొనుగోలు’కు సవరించింది.
  • యంత్ర పరికరాల కంపెనీల షేర్లు ఇప్పటికే అధిక ధరల వద్ద ఉండడంతో విక్రయాల ఒత్తిడికి గురికావొచ్చు. ఏప్రిల్‌-జూన్‌లో ప్రభుత్వ ఆర్డర్లు సైతం తగ్గొచ్చు. అయితే మధ్యకాలానికి ఈ రంగంపై విశ్లేషకులు ‘బులిష్‌’గా ఉన్నారు. ఏబీబీ ఇండియా లక్ష్యం ధరను రూ.7,550కు యూబీఎస్‌ పెంచింది.
  • అమెరికా మార్కెట్లో బలమైన విక్రయాల మధ్య ఔషధ కంపెనీల షేర్లు లాభాలను పెంచుకోవచ్చు. దేశీయ మార్కెట్‌పై ఆధారపడ్డ షేర్లు నెమ్మదిగా పెరిగినా.. బలమైన రికవరీని చూడగలవని అంచనా.
  • ఐటీ కంపెనీల షేర్లు ఒత్తిడిలోనే కొనసాగొచ్చు. గిరాకీ స్తబ్దత, బలహీన స్థూల ఆర్థిక వాతావరణం వల్ల స్వల్పకాలంలో మదుపర్లు ఈ షేర్ల కొనుగోలు విషయంలో దూకుడుగా వ్యవహరించకపోవచ్చు. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ బలంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • లోహ కంపెనీల షేర్లకు అంతర్జాతీయ సంకేతాలు కలసిరావొచ్చు. ‘పడ్డపుడల్లా కొనుగోలు’ చేసే వ్యూహాన్ని మదుపర్లు అనుసరించడం మేలు. హిందాల్కో, సెయిల్‌ షేర్లను పరిశీలించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని