16 ఏళ్ల గరిష్ఠానికి ‘తయారీ’ కార్యకలాపాలు

ఈ ఏడాది మార్చిలో దేశీయ తయారీ రంగ వృద్ధి 16 ఏళ్ల గరిష్ఠమైన 59.1గా నమోదైంది. 2008 తర్వాత ఇదే అత్యధిక స్థాయి.

Published : 03 Apr 2024 01:49 IST

దిల్లీ: ఈ ఏడాది మార్చిలో దేశీయ తయారీ రంగ వృద్ధి 16 ఏళ్ల గరిష్ఠమైన 59.1గా నమోదైంది. 2008 తర్వాత ఇదే అత్యధిక స్థాయి. గిరాకీకి సానుకూల పరిస్థితులు ఉండొచ్చన్న అంచనాలతో కొత్త ఆర్డర్ల రాక గణనీయంగా పెరగడం, అందుకనుగుణంగా ఉత్పత్తి చేసుకోవడం ఇందుకు కారణమని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తయారీ రంగ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ (పీఎంఐ) తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇది 56.9 పాయింట్ల వద్ద ఉంది. సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే వృద్ధి ఉన్నట్లుగా భావిస్తారు. 50 పాయింట్ల దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. 33 నెలలుగా (2020 అక్టోబరు నుంచి) తయారీ రంగం వృద్ధి బాటలోనే సాగుతోంది. ‘కొత్త ఆర్డర్లను దృష్టిలో ఉంచుకుని, అధిక ఉత్పత్తి చేసేందుకు తయారీ కంపెనీలు నియామకాలను పెంచుకున్నాయి. అయితే ముడి సరకు వ్యయ ద్రవ్యోల్బణం మార్చిలో పెరిగింద’ని హెచ్‌ఎస్‌బీసీ ఆర్థికవేత్త ఇనెస్‌ లామ్‌ తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కొత్త ఆర్డర్ల రాక పెరిగిందని సర్వే తెలిపింది. 2022 మే తర్వాత కొత్త ఎగుమతి ఆర్డర్లలో అత్యంత వేగవంత వృద్ధి నమోదైందని వెల్లడించింది. అంతకుముందు 2 నెలల్లో నియామకాల జోలికి వెళ్లని కంపెనీలు, మార్చిలో అదనపు సిబ్బందిని తీసుకున్నాయని పేర్కొంది. ఉద్యోగాల సృష్టి ఓ మోస్తరుగా ఉన్నా.. 2023 సెప్టెంబరు నుంచి చూస్తే గత నెలలోనే అధికమని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని