విమానాల రద్దుపై రోజువారీ నివేదిక ఇవ్వండి

విమాన సర్వీసుల రద్దు, జాప్యాలపై రోజువారీ నివేదిక సమర్పించాల్సిందిగా విస్తారాను విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆదేశించింది.

Updated : 03 Apr 2024 02:08 IST

విస్తారాకు డీజీసీఏ ఆదేశం

దిల్లీ: విమాన సర్వీసుల రద్దు, జాప్యాలపై రోజువారీ నివేదిక సమర్పించాల్సిందిగా విస్తారాను విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆదేశించింది. పైలెట్లు, ఫస్ట్‌ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో విమాన కార్యకలాపాలను కంపెనీ తాత్కాలికంగా తగ్గించుకుంటున్న నేపథ్యంలో, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం విస్తారా 50కి పైగా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం. వేతన సవరణకు వ్యతిరేకంగా కొత్త కాంట్రాక్టులపై సంతకాలు చేయకుండా కొంత మంది కమాండర్లు, ఫస్ట్‌ ఆఫీసర్లతో పాటు సిబ్బంది అనారోగ్య సెలవు పెట్టినందునే, విమానాల రద్దు, ఆలస్యం చోటుచేసుకుంటోందని తెలుస్తోంది. విమానాల రద్దు, ఆలస్యమైన పక్షంలో ప్రయాణికులకు అందిస్తున్న సమాచారం, సదుపాయాలను డీజీసీఏ పర్యవేక్షిస్తోంది. విమాన ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యమని తెలిపింది. తమ విమానం రద్దయిందని, సర్వీసు ఆలస్యం అవుతోందంటూ పలువురు ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రస్తుతం ఎయిరిండియాలో విస్తారా విలీన ప్రక్రియ నడస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిరిండియా, విస్తారా పైలెట్ల మధ్య సమానత్వం తీసుకువచ్చే విధంగా కొత్త కాంట్రాక్టులు తీసుకొచ్చామని కంపెనీ చెబుతోంది.

వైదొలిగిన 15 మంది పైలెట్లు: వేతన సవరణకు వ్యతిరేకంగా ఇటీవల కంపెనీకి 15 మంది సీనియర్‌ ఫస్ట్‌ ఆఫీసర్లు (పైలెట్లు) రాజీనామా చేశారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రోజుకు కంపెనీ 300కు పైగా విమాన సర్వీసులు నిర్వహిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని