విద్యుత్‌ వాహనాలకు రాయితీ ఇలా

దేశంలో విద్యుత్‌ వాహనాల (ఈవీ) వినియోగాన్ని పెంచేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలలకు ప్రకటించిన ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రమోషన్‌ స్కీం (ఈఎంపీఎస్‌ 2024) అమలు ప్రారంభమైంది.

Published : 03 Apr 2024 02:03 IST

4 నెలలకు రూ.500 కోట్లు కేటాయింపు
అమల్లోకి ఈఎంపీఎస్‌ 2024

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో విద్యుత్‌ వాహనాల (ఈవీ) వినియోగాన్ని పెంచేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలలకు ప్రకటించిన ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రమోషన్‌ స్కీం (ఈఎంపీఎస్‌ 2024) అమలు ప్రారంభమైంది. ఈ నెల 1 నుంచి జులై 31 వరకు ఈ కొత్త పథకం అమల్లో ఉంటుంది. రాయితీల కోసం రూ.500 కోట్లు కేటాయించారు. ఈ నిధులు కేటాయిస్తూ, దాదాపు 3.72 లక్షల ఈవీల కొనుగోలును ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని పెంచేందుకు తీసుకొచ్చిన ఫేమ్‌ రెండో దశ పథకం గడువు మార్చి 31తో ముగిసినందున, దీనికి కొనసాగింపుగా ఈ కొత్త పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఈ వాహనాలన్నింటికీ: విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇ-రిక్షాలు, ఇ-కార్ట్‌లకు ఈ పథకం వర్తిస్తుందని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పర్యావరణ అనుకూల వాహనాలను ప్రజలకు సరసమైన ధరలకు అందించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించినట్లు పేర్కొంది. ప్రధానంగా వాణిజ్య ప్రయోజనాల కోసం నమోదు చేసుకున్న విద్యుత్‌ ద్విచక్ర వాహనాలు, విద్యుత్‌ త్రిచక్ర వాహనాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. దీనితోపాటు, ప్రైవేట్‌ లేదా కార్పొరేట్‌ యాజమాన్యంలో నమోదైన ఇ-ద్విచక్ర వాహనాలకూ రాయితీ లభిస్తుందని పేర్కొంది.

రూ.10-50 వేల వరకు: విద్యుత్‌ ద్విచక్ర వాహనాల కొనుగోలు కోసం రూ.10,000 వరకు ప్రోత్సాహకం లభించనుంది. ఇ-రిక్షాలు, ఇ-కార్ట్‌ల వంటి వాటికి రూ.25,000 వరకు అందుతుంది. ఎల్‌5 విభాగం కిందకు వచ్చే పెద్ద 3 చక్రాల ఈవీలను కొనుగోలు చేసేందుకు రూ.50,000 వరకు రాయితీ లభిస్తుంది.

ఈ పథకం కింద మొత్తం 3,72,215 విద్యుత్‌ వాహనాలకు ప్రయోజనం లభించనుంది. ఇందులో ద్విచక్ర వాహనాలు 3.33 లక్షలు, ఇ-త్రీవీలర్స్‌ 38,828, ఇ-రిక్షాలు 13,590, ఎల్‌5 వాహనాలు 25,238 ఉండనున్నాయి. అధునాతన బ్యాటరీలు అమర్చిన వాహనాలకు మాత్రమే ప్రోత్సాహకాల ప్రయోజనాలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని