ఐఫోన్ల పైనా స్పైవేర్‌ దాడులు!

రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, విలేకరులు వినియోగిస్తున్న ఐఫోన్లపై పెగాసస్‌ తరహా అత్యాధునిక స్పైవేర్‌ దాడులు జరిగే అవకాశం ఉందని ఐఫోన్‌ తయారీ కంపెనీ యాపిల్‌ హెచ్చరిస్తోంది.

Published : 12 Apr 2024 03:43 IST

హెచ్చరించిన యాపిల్‌
రాజకీయ నాయకులు, అధికారులు, విలేకరులే లక్ష్యం

దిల్లీ: రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, విలేకరులు వినియోగిస్తున్న ఐఫోన్లపై పెగాసస్‌ తరహా అత్యాధునిక స్పైవేర్‌ దాడులు జరిగే అవకాశం ఉందని ఐఫోన్‌ తయారీ కంపెనీ యాపిల్‌ హెచ్చరిస్తోంది. చాలా తక్కువ మంది వ్యక్తులపైనే ఈ దాడులు జరిగినా.. నష్టం తీవ్రంగా ఉండే అవకాశం  ఉందని తాజాగా హెచ్చరించింది.

ఎన్నికల సమయంలో..: భారత్‌ సహా 60 దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న తరుణంలో యాపిల్‌ హెచ్చరికలు వెలువడటం గమనార్హం. ‘మెర్సినరీ స్పైవేర్‌ దాడులు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. సాధారణ సైబర్‌ క్రిమినల్‌ కార్యకలాపాలు, కన్జూమర్‌ మాల్‌వేర్‌ కంటే ఈ దాడులు చాలా ప్రత్యేకమైనవి, క్లిష్టమైనవి. అసాధారణ వనరులను ఉపయోగించి తమ లక్ష్యమైన వ్యక్తులు, వారి పరికరాల (మొబైళ్లు తదితరాల)పై దాడులు చేస్తార’ని యాపిల్‌ హెచ్చరించింది.  ఈ దాడుల వల్ల మిలియన్ల కొద్దీ డాలర్ల నష్టం వాటిల్లవచ్చని.. చాలా తక్కువ సమయంలోనే ఈ సైబర్‌ దాడులకు పాల్పడడం వల్ల దాడిచేసినవారిని గుర్తించడం చాలా కష్టతరమవుతుందని తెలిపింది.

వాట్సప్‌లో మిస్డ్‌కాల్‌తోనూ: పెగాసస్‌ వంటి ప్రైవేటు కంపెనీలు మెర్సినరీ స్పైవేర్‌ను తయారు చేస్తుంటాయి. వాట్సప్‌లో ఒక మిస్డ్‌ కాల్‌తోనే మొబైల్‌ ఫోన్లను తమ నియంత్రణలోకి తెచ్చుకుంటుందని పేర్కొంది.

ఏం చేయాలి?: ఐఫోన్‌ వినియోగదార్లు తమ ఫోన్లలో లాక్‌డౌన్‌ మోడ్‌ను ఎనేబుల్‌ చేయడం ద్వారా తమను తాము రక్షించుకోవచ్చని యాపిల్‌ సూచించింది. ‘మెర్సినరీ స్పైవేర్‌ దాడుల పద్ధతులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. యాపిల్‌ ఇంటర్నెట్‌ థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ ఇన్ఫర్మేషన్‌, ఇన్వెస్టిగేషన్‌ ద్వారా అటువంటి దాడులను గుర్తించగలుగుతుంది. ఈ అత్యాధునిక దాడులపై జాగ్రత్తగా ఉండాల’ని సూచించింది.

మన దేశంలో 5 లక్షల ఉద్యోగాలకు అవకాశం!: చైనాలో కార్యకలాపాలు గణనీయంగా తగ్గించుకోవాలని భావిస్తున్న యాపిల్‌, అందుకు ప్రత్యామ్నాయంగా మనదేశంలో విడిభాగాల సమీకరణను పెంచుకోవాలని భావిస్తోంది. ఫలితంగా యాపిల్‌ విడిభాగాల తయారీ సంస్థలు, సరఫరాదార్ల వద్దా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇందువల్ల వచ్చే మూడేళ్లలో యాపిల్‌ వ్యవస్థ ద్వారా మన దేశంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ తెలిపింది. 2023 డిసెంబరు ఆఖరుకు అంతర్జాతీయంగా విక్రయిస్తున్న ఐఫోన్లలో 7% మనదేశం నుంచి సరఫరా అవ్వగా, 2030కి ఈ మొత్తం 25 శాతానికి చేరుతుందనే అంచనాలున్నాయి. దేశీయంగా ఐఫోన్‌కు జతచేరుతున్న విలువ ప్రస్తుతం 11-12% కాగా, ఇది 15-18 శాతానికి చేరే వీలుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని