మోదీతో గేమ్‌ ఆడిన పాయల్‌ ఎవరు?

ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌తో పాపులారిటీ సంపాదించిన కొంతమంది గేమర్లతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ముచ్చటించగా.. వారిలో ఓ అమ్మాయి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

Published : 14 Apr 2024 02:51 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌తో పాపులారిటీ సంపాదించిన కొంతమంది గేమర్లతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ముచ్చటించగా.. వారిలో ఓ అమ్మాయి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆ సొట్ట బుగ్గల సుందరి ఎవరా అని వెతకడం ప్రారంభించారు. ఆమే పాయల్‌ ధరె. ఆమెది మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడాకు చెందిన ఉమ్రానాలా గ్రామం. ‘పాయల్‌ గేమింగ్‌’తో పాపులర్‌ అయ్యారు. దేశంలోని మహిళా గేమ్‌ క్రియేటర్లలో ఆమె ఒకరు. ఈ ఏడాది మార్చిలో ఆమె ‘గేమింగ్‌ క్రియేటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నారు. గత ఏడాది ‘డైనమిక్‌ గేమింగ్‌ క్రియేటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం వరించింది. అంతేగాకుండా ‘ఫిమేల్‌ స్ట్రీమర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ టైటిల్‌ను దక్కించుకున్నారు. మోదీతో దిగిన చిత్రాన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఆమె ‘ప్రధానితో కలిసి గేమింగ్‌ ఇండస్ట్రీ ప్యూచర్‌ గురించి చర్చించడం గర్వంగా అనిపించింది. దేశం కోసం ఏదైనా చేయాలనే ఆయన సంకల్పం ఎంతో గొప్పది’ అని కొనియాడారు.

ప్రతిపక్షాలపై మోదీ ‘గేమింగ్‌’ సెటైర్లు: ఆన్‌లైన్‌ గేమ్‌ పరిభాషలోని ‘నూబ్‌’తో విపక్షాలను పోలుస్తూ ప్రధాని సెటైర్లు వేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన గేమర్లతో కలిసి మోదీ తన నివాసంలో కొంతసేపు ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడారు. ఆ సమయంలో ‘నూబ్‌’ అని వినిపించగానే ప్రధాని నవ్వుతూ.. ‘ఈ పదాన్ని నేను ఎన్నికల్లో ఉపయోగిస్తే ఎవర్ని అంటున్నానా? అని ప్రజలు ఆశ్చర్యపోతారు. ఒకవేళ ఆ పదం నేను చెబితే మీరు వెంటనే ఓ వ్యక్తిని ఊహించుకుంటారు’ అంటూ పరోక్ష విమర్శలు చేశారు. ఆన్‌లైన్‌ గేమర్ల భాషలో ‘నూబ్‌’ అంటే ఆటకు కొత్తగా వచ్చిన లేదా ఆ రంగంలో నైపుణ్యం లేని వ్యక్తి అని అర్థం. దీనిపై కాంగ్రెస్‌ నేతలు స్పందించగా.. ప్రధాని ఎవరి పేరునూ ప్రస్తావించనపుడు ఎందుకు స్పందిస్తున్నారని భాజపా నేతలు ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని