విపణిలోకి హెచ్‌పీ ఏఐ ల్యాప్‌టాప్‌లు

హెచ్‌పీ కంపెనీ గేమర్లు, కంటెంట్‌ సృష్టికర్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ ఎన్‌హాన్స్‌డ్‌ ల్యాప్‌టాప్‌లను శనివారం విపణిలోకి ప్రవేశపెట్టింది.

Published : 14 Apr 2024 03:40 IST

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: హెచ్‌పీ కంపెనీ గేమర్లు, కంటెంట్‌ సృష్టికర్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ ఎన్‌హాన్స్‌డ్‌ ల్యాప్‌టాప్‌లను శనివారం విపణిలోకి ప్రవేశపెట్టింది. ఒమెన్‌ ట్రాన్సెండ్‌ 14, హెచ్‌పీ ఎన్వీ ఎక్స్‌ 360 14 పేరిట తయారుచేసిన ఈ రెండు ల్యాప్‌టాప్‌లను హెచ్‌పీ ఇండియా కన్జూమర్‌ అండ్‌ గేమింగ్‌ పీసీ హెడ్‌ టి.గణేష్‌ ఆవిష్కరించారు. గచ్చిబౌలిలోని లీ మెరీడియన్‌ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గణేష్‌ మాట్లాడుతూ.. పర్సనల్‌ కంప్యూటర్స్‌ రంగంలో కృత్రిమ మేధ(ఏఐ) కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అత్యాధునిక ఏఐ పరిజ్ఞానంతో తయారు చేసిన ల్యాప్‌టాప్‌లు అద్భుతంగా పనిచేస్తూ మెరుగైన సేవలు అందిస్తాయని తెలిపారు. గేమర్లు, కంటెంట్‌ సృష్టికర్తల అవసరాలను దృష్టిలో ఉంచుకొని హెచ్‌పీ ఈ రెండు సరికొత్త ఏఐ ల్యాప్‌టాప్‌లను రూపొందించిందని వివరించారు. ఒమెన్‌ట్రాన్సెండ్‌ 14 ల్యాప్‌టాప్‌ గేమర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో ఆర్‌టీఎక్స్‌ 4060 గ్రాఫిక్‌ కార్డు ఉంటుందన్నారు. ఇది వేగవంతమైన గేమ్‌ప్లే అనుభవం, మెరుగైన గ్రాఫిక్స్‌ కోసం ఏఐ ఫీచర్స్‌కు శక్తినిస్తుందని తెలిపారు. ఇంటెల్‌ కోర్‌ ఆల్ట్రా ప్రాసెసర్లు కంప్యూట్‌ ఇంటెన్సివ్‌ టాస్క్‌లను నిర్వహించడానికి సహాయపడతాయని వివరించారు. సన్నటి, తేలికపాటి డిజైన్‌ గల ఈ ల్యాప్‌టాప్‌ 11.5 గంటల బ్యాటరీ లైఫ్‌తో 1.637 కిలో గ్రాముల బరువు కలిగి ఉందన్నారు. దీని ప్రారంభ ధర రూ.174,999గా నిర్ణయించినట్లు తెలిపారు. ఇది రెండు రంగులలో లభిస్తుందని చెప్పారు.

కంటెంట్‌ సృష్టికర్తల కోసం హెచ్‌పీ ఎన్వీఎక్స్‌ 360 14 ల్యాప్‌టాప్‌ ఉపయోగపడుతుందని తెలిపారు. న్యూరల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కలిగి ఉండటంతోపాటు పరిశోధన, కంటెంట్‌ ఉత్పత్తి కోసం ఏఐ ఫీచర్‌లను పొందేందుకు వీలుగా కీబోర్డుపై మైక్రోసాఫ్ట్‌ కో-పైలట్‌ బటన్‌ కలిగి ఉందని వివరించారు. ఏఐతో మెరుగైన ఆడియో, వీడియో ఫీచర్స్‌ పొందవచ్చని, దీని ప్రారంభ ధర రూ.99,999గా ఉందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని