వైద్య ఉపకరణాల టెస్టింగ్‌కు ప్రైవేటు ల్యాబ్‌లు

దేశీయంగా ఉత్పత్తి అవుతున్న వైద్య ఉపకరణాలను ప్రైవేటు ల్యాబ్స్‌లో పరీక్షించే సదుపాయాలు(టెస్టింగ్‌ యూనిట్లు) విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.

Published : 14 Apr 2024 03:39 IST

గుర్తించే ప్రక్రియ చేపట్టిన సీడీఎస్‌సీఓ
తెలుగు రాష్ట్రాల్లో ఉపకరణాల తయారీ పరిశ్రమకు మేలు

ఈనాడు, హైదరాబాద్‌: దేశీయంగా ఉత్పత్తి అవుతున్న వైద్య ఉపకరణాలను ప్రైవేటు ల్యాబ్స్‌లో పరీక్షించే సదుపాయాలు(టెస్టింగ్‌ యూనిట్లు) విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ) చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం మరిన్ని ప్రైవేటు ల్యాబ్స్‌కు గుర్తింపు ఇచ్చే ప్రక్రియను విస్తరిస్తోంది.

పరీక్షించాకే విక్రయాలకు అనుమతి

దేశీయంగా వైద్య ఉపకరణాలను ఉత్పత్తి చేశాక, వాటిని గుర్తింపు ఉన్న ల్యాబ్‌లో పరీక్షించాలి. ఆయా ఉపకరణాలు నిర్దేశిత ప్రమాణాలు, నిబంధనల ప్రకారం ఉన్నాయని నిర్ధారణ అయితేనే, వాటిని మార్కెట్లో ప్రవేశపెట్టటానికి సీడీఎస్‌సీఓలోని మెడికల్‌ డివైజెస్‌ విభాగం అనుమతి ఇస్తుంది. వీటిని పరీక్షించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లు ఉన్నాయి. ఈ ల్యాబ్‌లకు కూడా సీడీఎస్‌సీఓ గుర్తింపు అవసరం. ప్రస్తుత అవసరాలకు తగినంత సంఖ్యలో ల్యాబ్స్‌ లేకపోవడం వల్ల, వైద్య ఉపకరణాల పరిశ్రమకు సమస్యగా మారింది. దీన్ని పరిగణనలోకి తీసుకుని మరిన్ని ప్రైవేటు ల్యాబ్స్‌ను ఎంపిక చేసి గుర్తింపు ఇవ్వాలని తాజాగా సీడీఎస్‌సీఓ నిర్ణయించింది. దీనివల్ల దేశీయ వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమకు మేలు జరుగుతుందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. వైద్య ఉపకరణాల పరీక్షలు నిర్వహించేందుకు ఔత్సాహికులు ప్రైవేటు ల్యాబ్స్‌ ఏర్పాటు చేసే ఆలోచనతో ముందుకు వస్తారని అంచనా వేస్తున్నారు.

ఇప్పటివరకు ప్రోత్సాహం లేకనే

ఎండీఆర్‌(మెడికల్‌ డివైజెస్‌ రూల్స్‌), 2017 ప్రకారం వైద్య ఉపకరణాల పరిశ్రమ, ప్రభుత్వ నియంత్రణ కిందకు వచ్చింది. వైద్య ఉపకరణాలను తప్పనిసరిగా పరీక్షించాకే, వాటిని విక్రయించడానికి అనుమతి లభిస్తుంది. ప్రభుత్వ ల్యాబ్‌లతో పాటు గుర్తింపున్న ప్రైవేటు ల్యాబ్‌లలో ఈ తనిఖీలు నిర్వహించేందుకు ఎండీఆర్‌ 2017 నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి. కానీ పెద్దగా ప్రైవేటు ల్యాబ్‌లకు ప్రోత్సాహం లభించలేదు. అందువల్ల తనిఖీ సదుపాయాలు ప్రైవేటు రంగంలో విస్తరించలేదు. ప్రస్తుతం వైద్య ఉపకరణాల తయారీ భారీగా పెరుగుతున్నందున, ప్రైవేటు ల్యాబ్స్‌ ఏర్పాటును ప్రోత్సహించేందుకు తాజాగా సీడీఎస్‌సీఓ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే తగిన సదుపాయాలతో ఏర్పాటైన ప్రైవేటు ల్యాబ్స్‌ను గుర్తించే పనిలో నిమగ్నమైంది. తమ ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయా ల్యాబ్‌లకు సూచిస్తోంది. డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాజీవ్‌ సింగ్‌ రఘువంశీ, ఇటీవల వైద్య ఉపకరణాల కంపెనీలను ఉద్దేశించి ఈ మేరకు లేఖ రాశారు. వైద్య ఉపకరణాల పరీక్షల్లో ప్రైవేటు ల్యాబ్‌ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనేది తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

ఇన్ని రకాలుగా పరీక్షించాకే

వైద్య ఉపకరణాల నాణ్యతా పరీక్షలు కొంత సంక్లిష్టంగానే ఉంటాయి. వీటిపై భౌతిక, రసాయన పరీక్షలతో పాటు మైక్రోబయాలజీ, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ పరీక్షలు నిర్వహించాలి. ప్రస్తుతం హైదరాబాద్‌, బెంగళూరు, ఘజియాబాద్‌, జయపుర.. తదితర నగరాల్లో సీడీఎస్‌సీఓ గుర్తింపు గల ల్యాబ్స్‌ 24 ఉన్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగితేనే వైద్య ఉపకరణాల పరిశ్రమ వేగంగా విస్తరించే అవకాశం ఏర్పడుతుందని ఔషధ నియంత్రణ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే వైద్య ఉపకరణాల పరిశ్రమ విశాఖపట్నం, హైదరాబాద్‌లలో విస్తరిస్తోంది. విశాఖపట్నం వద్ద మెడికల్‌ డివైజెస్‌ పార్కును 2018లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పార్కులో ఏర్పాటైన కొన్ని యూనిట్లు ఇప్పటికే పలు రకాల వైద్య ఉపకరణాలను దేశీయ మార్కెట్‌కు అందిస్తున్నాయి. హైదరాబాద్‌ సమీపంలోని సుల్తాన్‌పూర్‌లో వైద్య ఉపకరణాల పార్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కొత్త యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. వీటి సామర్థ్యాన్ని నిర్థారించే ల్యాబ్స్‌ కూడా మరిన్ని ఏర్పాటైతే, వైద్య ఉపకరణాలు త్వరగా అందుబాటులోకి వస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని