అందుబాటు ధర ఇళ్ల వాటా తగ్గుతోంది

దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అమ్ముడవుతున్న నివాసాల్లో, రూ.45 లక్షల వరకు పలికే అందుబాటు ధర ఇళ్ల వాటా తగ్గుతోంది. ఈ ఏడాది జనవరి-మార్చి అమ్మకాల్లో ఈ విభాగ వాటా 22 శాతమేనని హౌసింగ్‌ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌ టైగర్‌ తాజా నివేదిక వెల్లడించింది.

Published : 15 Apr 2024 03:40 IST

మొత్తం అమ్మకాల్లో ఇవి 22 శాతమే
రూ.కోటి పైన ఇళ్లకు గిరాకీ
2024 జనవరి-మార్చిపై ప్రాప్‌ టైగర్‌ నివేదిక

దిల్లీ: దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అమ్ముడవుతున్న నివాసాల్లో, రూ.45 లక్షల వరకు పలికే అందుబాటు ధర ఇళ్ల వాటా తగ్గుతోంది. ఈ ఏడాది జనవరి-మార్చి అమ్మకాల్లో ఈ విభాగ వాటా 22 శాతమేనని హౌసింగ్‌ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌ టైగర్‌ తాజా నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో విలాస ఫ్లాట్లకు గిరాకీ పెరుగుతోందని తెలిపింది. 2023 జనవరి-మార్చిలో, మొత్తం నివాస విక్రయాల్లో అందుబాటు ధర ఇళ్ల వాటా 48% కాగా, ఈసారి సగానికి తగ్గి 22 శాతానికి పరిమితమైంది. ఈ 8 నగరాల్లో మొత్తం ఇళ్లు/ఫ్లాట్లు 85,840 మేర 2023 జనవరి-మార్చిలో విక్రయం కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో 41% అధింగా 1,20,640 అమ్ముడయ్యాయి.

  • మొత్తం ఇళ్ల విక్రయాల్లో రూ.25 లక్షల కంటే తక్కువ ధర కలిగిన విభాగ వాటా 5 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇది 15 శాతంగా ఉంది.
  •  రూ.25-45 లక్షల మధ్య ఇళ్ల వాటా 23% నుంచి 17 శాతానికి తగ్గింది.
  • కొవిడ్‌ పరిణామాల తర్వాత నిర్మాణ వ్యయం పెరిగినా, పెద్ద ఇళ్ల కొనుగోలుకే వినియోగదార్లు మొగ్గుచూపుతున్నారని ‘రియల్‌ ఇన్‌సైట్‌ రెసిడెన్షియల్‌ జనవరి-మార్చి 2024’ త్రైమాసిక నివేదికలో ప్రాప్‌ టైగర్‌ వెల్లడించింది.
  • మొత్తం అమ్మకాల్లో రూ.1 కోటి అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్లు/ఫ్లాట్ల వాటా గత ఏడాది జనవరి-మార్చిలో 24% కాగా, ఈ ఏడాది 37 శాతానికి చేరింది.
  • రూ.45-75 లక్షల విలువైన ఇళ్ల వాటా మార్పు లేకుండా 26 శాతంగా ఉంది. రూ.75 లక్షలు-రూ.1 కోటి ఇళ్ల వాటా 12% నుంచి 15 శాతానికి పెరిగింది.
  • హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ-ఎన్‌సీఆర్‌,  కోల్‌కతా, ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), పుణెల్లో ఇళ్ల విక్రయాల ఆధారంగా ఈ నివేదికను ప్రాప్‌ టైగర్‌ రూపొందించింది. దిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌, గ్రేటర్‌ నోయిడా, గురుగ్రామ్‌ కలిసి ఉంటాయి. ఎంఎంఆర్‌లో ముంబయి, థానే, నవీ ముంబయి కలిసి ఉంటాయి.
  • విలువ పరంగా ఇళ్ల విక్రయాల విలువ 2023 జనవరి-మార్చిలో రూ.66,155 కోట్లు కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.1,10,880 కోట్లకు చేరింది. చదరపు అడుగుల ప్రకారం, గృహ విక్రయాలు 99 మిలియన్‌ చదరపు అడుగుల నుంచి 63% పెరిగి 162 మి.చ.అ.కు చేరాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని