ఆఫర్‌ లెటర్లున్న అందరికీ ఉద్యోగాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 2023-24 తరహాలోనే 40,000 మంది తాజా ఉత్తీర్ణులను (ఫ్రెషర్లు) నియమించుకుంటామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీఈఓ, ఎండీ కృతివాసన్‌ స్పష్టంచేశారు.

Updated : 16 Apr 2024 14:40 IST

2024-25లో 40,000 తాజా నియామకాలు
టీసీఎస్‌ సీఈఓ, ఎండీ కృతివాసన్‌

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 2023-24 తరహాలోనే 40,000 మంది తాజా ఉత్తీర్ణులను (ఫ్రెషర్లు) నియమించుకుంటామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సీఈఓ, ఎండీ కృతివాసన్‌ స్పష్టంచేశారు. ఇప్పటికే కళాశాల ప్రాంగణాల్లో తాము ఎంపిక చేసి, ఆఫర్‌ లెటర్లు ఇచ్చిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్లను నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్‌ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. ఆర్డర్లు, స్థిరమైన ఆదాయ వృద్ధి ఉన్నా.. ఉద్యోగుల సంఖ్య ఎందుకు తగ్గిందనేదానిపై ఆయన మాట్లాడుతూ ‘కళాశాలల్లో ఎంపిక చేసుకున్న ట్రైనీలు, మా అంతర్గత శిక్షణ అనంతరం 6-8 నెలలకు గానీ ఉత్పాదకతలోకి రారు. కాబట్టి నియామకాలు చేపట్టిన సమయానికి, వాళ్లు ప్రాజెక్టుల్లో చేరే సమయానికి మధ్య అంతరం ఉంటుంది. అందువల్ల సిబ్బంది సంఖ్య తగ్గడాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేద’ని ఆయన వివరించారు. 

త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను మించి రాణించడంతో, టీసీఎస్‌ షేరు ప్రారంభ ట్రేడింగ్‌లో 1.56% పెరిగి రూ.4.063 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. లాభాల స్వీకరణతో చివరకు 1.47% తగ్గి రూ.3,941.30 వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని