రూ.349కే విమాన ప్రయాణం

రూ.349 ఛార్జీతో విమానంలో ప్రయాణించొచ్చని మీకు తెలుసా.. అసోంలోని లిలాబరి నుంచి తేజ్‌పూర్‌ మధ్య 50 నిమిషాల విమాన ప్రయాణానికి ఈ మొత్తాన్ని తీసుకుంటున్నారు.

Updated : 16 Apr 2024 05:08 IST

దిల్లీ: రూ.349 ఛార్జీతో విమానంలో ప్రయాణించొచ్చని మీకు తెలుసా.. అసోంలోని లిలాబరి నుంచి తేజ్‌పూర్‌ మధ్య 50 నిమిషాల విమాన ప్రయాణానికి ఈ మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఇందులో రూ.150 బేస్‌ ఛార్జీ కాగా.. కన్వినీయెన్స్‌ ఛార్జీ కింద రూ.199 మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇందుకదనంగా ఎటువంటి భారాలు ఉండవు. అయితే ఇవేమీ రోజువారీ సర్వీసులు కావు. ఈ ఒక్క మార్గంలోనే కాదు.. రూ.1000 కంటే తక్కువ బేస్‌ టికెట్‌ ధరతో దేశంలో పలు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఈ విమానాలన్నీ ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం (ఉడాన్‌) కింద కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ పథకం కింద విమానయాన సంస్థలకు పలు ప్రోత్సాహకాలు లభిస్తుండటమే ఈ చౌక ధరలకు కారణమని ట్రావెల్‌ పోర్టల్‌ ఐక్సిగో తెలిపింది. ఒక వ్యక్తికి రూ.1000 కంటే తక్కువ బేస్‌ ఛార్జీతో దేశంలో 22 విమాన మార్గాలు ఉన్నాయని, లిలాబరి- తేజ్‌పూర్‌ మధ్య అత్యల్పంగా రూ.150 బేస్‌ ఛార్జీతో అలయన్స్‌ ఎయిర్‌ విమానాలు నడుపుతోందని ఇక్సిగో వెల్లడించింది. టికెట్‌ బుకింగ్‌ సమయంలో బేస్‌ ఛార్జీకి అదనంగా కన్వీనియెన్స్‌ ఛార్జీ వసూలు చేస్తారు. ప్రాంతీయ అనుసంధానత పథకంలో నడిచే విమానాల సమయం దాదాపు 50 నిమిషాలు ఉంటుంది. రూ.150- 199 బేస్‌ ఛార్జీ మార్గాలు ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి. దక్షిణాదిలో ఈ శ్రేణిలో ధరలు బెంగళూరు-సేలం (రూ.525), కొచ్చి-సేలం మార్గాల్లో ఉన్నాయి. గువాహటి- షిల్లాంగ్‌ మధ్య బేస్‌ టికెట్‌ ధర రూ.400గా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని