ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే 10 విమానాశ్రయాల్లో దిల్లీ

ప్రపంచంలో రద్దీ అత్యంత అధికంగా ఉండే విమానాశ్రయాల (బిజియెస్ట్‌ ఎయిర్‌పోర్ట్స్‌ 2023) జాబితాలో దిల్లీ విమానాశ్రయం (ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) పదో స్థానంలో నిలిచింది.

Published : 16 Apr 2024 03:52 IST

దిల్లీ: ప్రపంచంలో రద్దీ అత్యంత అధికంగా ఉండే విమానాశ్రయాల (బిజియెస్ట్‌ ఎయిర్‌పోర్ట్స్‌ 2023) జాబితాలో దిల్లీ విమానాశ్రయం (ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) పదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికాలోని హార్ట్స్‌ఫీల్డ్‌ జాక్సన్‌ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం అగ్ర స్థానం దక్కించుకుంది. దుబాయ్‌, డాలస్‌ విమానాశ్రయాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయని ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) వరల్డ్‌ తెలిపింది. 10 అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో 5 అమెరికాలోనే ఉన్నాయి. అంతర్జాతీయంగా మొత్తం ప్రయాణికుల సంఖ్య 2023లో సుమారు 850 కోట్లుగా ఉందని ఏసీఐ పేర్కొంది. కొవిడ్‌ పరిణామాల తర్వాత, ప్రయాణికుల సంఖ్యలో  93.8% రికవరీ లభించిందని, 2022తో పోలిస్తే 27.2% వృద్ధి నమోదైందని వెల్లడించింది.

  • దిల్లీ విమానాశ్రయం నుంచి 2023లో 7.22 కోట్ల మందికి పైగా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరారు. 2022లో రద్దీ పరంగా ఈ విమానాశ్రయం అంతర్జాతీయంగా 9వ స్థానంలో ఉంది.
  • హార్ట్స్‌ఫీల్డ్‌-జాక్సన్‌ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం గత ఏడాది 10.46 కోట్ల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చింది. దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 8.69 కోట్లు, డాలస్‌ ఫోర్త్‌ వర్త్‌ అంతర్జాతీయ విమాన్రాశయం నుంచి 8.17 కోట్ల మంది 2023లో ప్రయాణించారు.
  • ఈ జాబితాలో లండన్‌ హీత్రో విమానాశ్రయం (4వ స్థానం), టోక్యో హానెడా (5వ స్థానం), డెన్వర్‌ విమానాశ్రయం (6వ స్థానం), ఇస్తాంబుల్‌ విమానాశ్రయం (7వ స్థానం), లాస్‌ ఏంజెలిస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (8వ స్థానం), షికాగో ఓహేర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (9వ స్థానం) ఉన్నాయి.
  • రద్దీ పరంగా అగ్రగామి -10 విమానాశ్రయాలు, మొత్తం అంతర్జాతీయ ప్రయాణికుల్లో 10% మంది (80.6 కోట్లు)ని గమ్యస్థానాలకు చేర్చాయి. 2022తో పోలిస్తే ఈ సంఖ్య 19.8% అధికం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని