యుద్ధ మేఘాల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి

పశ్చిమాసియాలో ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో, అంతర్జాతీయ మార్కెట్లతో పాటు సోమవారం దేశీయ సూచీలూ బెంబేలెత్తాయి. మదుపర్లు స్థిరంగా అమ్మకాలకు దిగడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టాల్లో ముగిశాయి.

Published : 16 Apr 2024 03:54 IST

ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలతో మార్కెట్లు కుదేల్‌
సమీక్ష

పశ్చిమాసియాలో ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో, అంతర్జాతీయ మార్కెట్లతో పాటు సోమవారం దేశీయ సూచీలూ బెంబేలెత్తాయి. మదుపర్లు స్థిరంగా అమ్మకాలకు దిగడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టాల్లో ముగిశాయి. భారత్‌-మారిషస్‌ పన్ను ఒప్పందంలో మార్పులను ప్రతిపాదించడం, అమెరికాలో మార్చి ద్రవ్యోల్బణం అధికంగా నమోదు కావడమూ ప్రతికూల ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 83.44 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 1.04% నష్టంతో 89.51 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

  • మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.5.18 లక్షల కోట్లు ఆవిరై రూ.394.48 లక్షల కోట్లకు పరిమితమైంది.
  • సెన్సెక్స్‌ ఉదయం 73,315.16 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. అనంతరం కోలుకుని 73,905.80 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదుచేసింది. మధ్యాహ్నం తర్వాత మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో 845.12 పాయింట్లు నష్టపోయి 73,399.78 వద్ద ముగిసింది. నిఫ్టీ 246.90 పాయింట్లు కోల్పోయి 22,272.50 దగ్గర స్థిరపడింది.
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 నష్టాలు నమోదుచేశాయి. విప్రో 2.47%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.40%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.30%, ఎల్‌ అండ్‌ టీ 2.10%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.09%, టాటా మోటార్స్‌  1.93%, టెక్‌ మహీంద్రా 1.86%, హెచ్‌యూఎల్‌ 1.72%, టాటా స్టీల్‌ 1.59%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.58% నష్టపోయాయి. మారుతీ, నెస్లే, సన్‌ఫార్మా స్వల్పంగా లాభపడ్డాయి.  
  • ఒక్కో షేరుకు రూ.118 చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌ 23లోగా వాటాదార్లకు కంపెనీ డివిడెండ్‌ చెల్లించనుంది. జీసీసీ వ్యాపార విక్రయం ద్వారా వచ్చిన నిధులతో ఈ డివిడెండ్‌ను కంపెనీ చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్టర్‌ డీఎం షేరు ఇంట్రాడేలో రూ.558.30 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకి, చివరకు 7.13% లాభంతో రూ.522.75 వద్ద ముగిసింది.
  • 2018-19లో రిలయన్స్‌ క్యాపిటల్‌ ఆర్థిక గణాంకాల్లో ఆడిటింగ్‌ లోపాలపై ఒక ఆడిట్‌ సంస్థ, ఇద్దరు ఆడిటర్లపై రూ.4.5 కోట్ల జరిమానాను నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అధారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) విధించింది.
  • రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఎన్‌సీఎల్‌టీ నుంచి ఉపశమనం లభించింది. ముంబయి మెట్రో వన్‌పై స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్‌ దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ కొట్టివేసింది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, ముంబయి మెట్రోపాలిటన్‌ రీజనల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సంయుక్తంగా ముంబయి మెట్రోవన్‌ను ఏర్పాటు చేశాయి.
  • దేశంలో ఎలక్ట్రానిక్‌ చిప్‌ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులకు నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు రూ.241 కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఉచితంగా అందించనున్నట్లు అమెరికాకు చెందిన సెమీకండక్టర్‌ ఎక్విప్‌మెంట్‌ సంస్థ లామ్‌ రీసెర్చ్‌ కార్ప్‌ ప్రకటించింది. ఇందుకోసం ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లతో కంపెనీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
  • కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సర్వర్లు సోమవారం 11 గంటల పాటు మొరాయించడంతో, యూపీఐ చెల్లింపులు, నగదు ఉపసంహరణ, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు నిలిచి ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. అన్నీ పునరుద్ధరించినట్లు బ్యాంక్‌ ప్రతినిధి రాత్రి 10 గంటలకు తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని