మన నగరాల్లో టెస్లా షోరూంలు!

అమెరికా విద్యుత్‌ కార్ల తయారీ దిగ్గజ సంస్థ టెస్లా, మన దేశంలో షోరూమ్‌లు (విక్రయ కేంద్రాలు) ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

Published : 16 Apr 2024 03:57 IST

3,000-5,000 చదరపు  అడుగుల స్థలాల అన్వేషణ
భారత్‌ కోసం కుడిచేతి వైపు స్టీరింగ్‌ ఉన్న కార్ల తయారీ ప్రారంభం

దిల్లీ: అమెరికా విద్యుత్‌ కార్ల తయారీ దిగ్గజ సంస్థ టెస్లా, మన దేశంలో షోరూమ్‌లు (విక్రయ కేంద్రాలు) ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ముఖ్య నగరాల్లో 3,000-5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో షోరూమ్‌తో పాటు సర్వీస్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు స్థలాన్వేషణలో కంపెనీ ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలోనే మన దేశంలో విక్రయాలు ప్రారంభించాలని టెస్లా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దిల్లీ, ముంబయిలలో విక్రయ కేంద్రాల ఏర్పాటు కోసం ఇప్పటికే స్థలాలను పరిశీలించినట్లు సమాచారం. పాశ్చాత్య దేశాల్లో కారు స్టీరింగ్‌ ఎడమచేతి వైపు ఉంటుంది. జర్మనీలోని ప్లాంట్‌లో, భారతీయులకు తగ్గట్లుగా కుడి చేతి వైపు స్టీరింగ్‌ ఉండే కార్లను టెస్లా ఉత్పత్తి చేస్తోంది. దేశంలో ప్లాంటు ఏర్పాటుకూ సుముఖత చూపుతున్న టెస్లా, అది సిద్ధమయ్యేలోగా జర్మనీ నుంచి కార్లను దిగుమతి చేసుకుని విక్రయించాలనుకుంటోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత నాలుగేళ్లలో తొలిసారిగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో టెస్లా అంతర్జాతీయ వాహన డెలివరీలు తగ్గాయి. ఈ నేపథ్యంలో మనదేశం సహా కొత్త విపణులకు విస్తరించేందుకు టెస్లా వేగంగా సన్నాహాలు చేసుకుంటోందని సమాచారం.

మనదేశం ఇస్తున్న రాయితీ ఇదీ

విద్యుత్‌ వాహనాల తయారీ ప్లాంటును కనీసం 500 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4,150 కోట్లు)  పెట్టుబడితో పెట్టేవారికి, కొంతకాలం పాటు వాహనాలను 15% సుంకంపైనే  దిగుమతి చేసుకునే అవకాశాన్ని మన ప్రభుత్వం కల్పించింది. గత జూన్‌లో న్యూయార్క్‌లో సంప్రదింపులు జరిపిన ప్రధాని మోదీ-టెస్లా అధిపతి మస్క్‌,త్వరలోనే దిల్లీలో మరోసారి సమావేశం కానున్నారు. వచ్చే ఆదివారం నుంచి 2 రోజుల పాటు మస్క్‌ మనదేశంలో పర్యటించనున్నారు.

టాటా ఎలక్ట్రానిక్స్‌తో ఒప్పందం!

తన అంతర్జాతీయ కార్యకలాపాల కోసం సెమీ కండక్టర్‌ చిప్‌లను కొనుగోలు చేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్‌తో టెస్లా వ్యూహాత్మక ఒప్పందం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఒప్పంద విలువ, షరతుల వంటివి మస్క్‌ భారత్‌ పర్యటన సందర్భంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.  మస్క్‌ భారత్‌ పర్యటనలో శాట్‌కామ్‌ సేవలకు సంబంధించి స్టార్‌ లింక్‌ ప్రణాళికలనూ వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

14,000 మందికి ఉద్వాసన?

టెస్లా అంతర్జాతీయంగా 10% మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. గత డిసెంబరు నాటికి టెస్లాలో 1.40 లక్షల మంది పని చేస్తున్నారు. 10 శాతం సిబ్బంది తొలగింపు నిర్ణయంతో సుమారు 14,000 మందిపై ప్రభావం పడనుంది. ఈ మేరకు ఉద్యోగులకు ఎలాన్‌ మస్క్‌ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఏయే విభాగాల వారిని తొలగిస్తున్నదీ ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే కొందరు తొలగింపునకు గురయ్యారని, వారికి కంపెనీ సిస్టమ్‌ యాక్సెస్‌ నిలిపివేసినట్లు సమాచారం. కొన్ని విభాగాల్లో ఒకేరకమైన బాధ్యతలు చూసే వారు అధికంగా ఉన్నందునే, తొలగింపులు చేయనున్నట్లు మస్క్‌ పేర్కొన్నారు. ఇంతకాలం కంపెనీకి సేవలందించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతూ, తొలగింపునకు గురైన వారు కొత్త అవకాశాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఉద్యోగంలో కొనసాగుతున్నవారు సవాళ్లకు సిద్ధమవ్వాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని