మూడో ఆర్థిక వ్యవస్థగా మారినా పేదరికం పోదు

ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నట్లు మన దేశం 2029 నాటికి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ, పేద దేశంగానే ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు.

Published : 16 Apr 2024 03:58 IST

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు

హైదరాబాద్‌/ దిల్లీ: ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నట్లు మన దేశం 2029 నాటికి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ, పేద దేశంగానే ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ..ధనిక దేశంగా మారడం అంటే, అభివృద్ధి చెందిన దేశంగా మారాల్సిన అవసరం లేదని.. సౌదీ అరేబియాను ఉటంకించారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే 2029 నాటికి భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ అంశంపై సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘చాలామంది ఆర్థికవేత్తలు కూడా అమెరికా, చైనా తర్వాత భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చాలా తొందరగానే మారుతుందని అంచనా వేశారు. నా దృష్టిలోనూ ఇది కష్టం కాదు. ఎందుకంటే ప్రజలు ఉత్పత్తిని పెంచుతారు. మనది 140 కోట్ల జనాభా ఉన్న దేశం కనుక, ఉత్పాదకత-వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థ స్థాయి అంతకంతకూ విస్తరిస్తుంది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినా, పేదరికమూ కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల అది సంబర పడాల్సిన విషయమేమీ కాదు’ అని సుబ్బారావు స్పష్టం చేశారు. ప్రస్తుతం 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు  రూ.332 లక్షల కోట్ల)తో భారత్‌ అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని తెలిపారు.

తలసరి ఆదాయం తక్కువే: మన తలసరి ఆదాయం 2,600 డాలర్లు (సుమారు రూ.2.16 లక్షలు)గా ఉంది. ఇది ప్రపంచంలో 139వ స్థానం. బ్రిక్స్‌, జీ-20 దేశాలతో పోల్చి చూసినా ఇది చాలా తక్కువని దువ్వూరి పేర్కొన్నారు. వృద్ధి రేటును మరింత వేగవంతం చేసి, ఆ ప్రయోజనాలను ప్రజలందరికీ అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే: 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రధాని ఆకాంక్షిస్తున్నారని ఈ సందర్భంగా సుబ్బారావు గుర్తు చేశారు. ఇలా మారాలంటే.. చట్టపరమైన పాలన, బలమైన రాష్ట్రాలు, జవాబుదారీతనం, స్వతంత్రత కలిగిన వ్యవస్థలు అవసరం అని పేర్కొన్నారు.


వడ్డీ రేట్ల తగ్గింపునకు అప్పట్లో ఒత్తిడి ఉండేది

‘ఆర్‌బీఐ గవర్నరుగా నేనున్నప్పుడు.. ప్రణబ్‌ ముఖర్జీ, పి.చిదంబరం ఆర్థిక మంత్రులుగా వ్యవహరించారు. వడ్డీరేట్ల తగ్గింపు కోసం, వృద్ధిరేటు అంచనాలను పెంచడం కోసం.. ఆర్థిక మంత్రిత్వ శాఖ తరచూ ఆర్‌బీఐపై ఒత్తిడి తెచ్చేది. సెంటిమెంటును మెరుగు పరచేందుకు ఇలా చేయాలని కోరేవార’ని తన పుస్తకంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పూర్వ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తికి ఉన్న ప్రాధాన్యతను ప్రభుత్వం కొంత మేరే అర్థం చేసుకుందని ‘జస్ట్‌ ఏ మెర్సినరీ?: నోట్స్‌ ఫ్రం మై లైఫ్‌ అండ్‌ కెరియర్‌’ పుస్తకంలో సుబ్బారావు గుర్తు చేసుకున్నారు. 2008 సెప్టెంబరు 16న అమెరికా ఆర్థిక సేవల సంస్థ లేమాన్‌ బ్రదర్స్‌ దివాలా ప్రభావంతో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. దీనికి కొద్ది రోజుల ముందు అంటే 2008 సెప్టెంబరు 5న ఆర్‌బీఐ గవర్నర్‌గా తాను బాధ్యతలు స్వీకరించానని, ప్రారంభంలో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నట్లు సుబ్బారావు వివరించారు.

ప్రభుత్వానికి చీర్‌లీడర్‌గా ఆర్‌బీఐ?: వడ్డీ రేట్ల తగ్గింపుతో పాటు ఇంకా పలు అంశాల్లోనూ ప్రభుత్వం ఆర్‌బీఐపై ఒత్తిడి తెచ్చిందని ‘రిజర్వ్‌ బ్యాంక్‌ యాజ్‌ ద గవర్న్‌మెంట్స్‌ చీర్‌లీడర్‌?’ అనే అధ్యాయంలో దువ్వూరి వివరించారు. ‘ఓ సందర్భం నాకు గుర్తుంది. అప్పుడు ప్రణబ్‌ ఆర్థిక మంత్రిగా, అరవింద్‌ మాయారామ్‌ ఆర్థిక కార్యదర్శిగా, కౌశిక్‌ బసు ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. తమ అంచనాలకు అనుగుణంగా ఆర్‌బీఐ అంచనాలను మార్చుకోమని వారు సూచించారు. అధిక వృద్ధి అంచనాలను, తక్కువ ద్రవ్యోల్బణ రేటును ఆర్‌బీఐ కచ్చితంగా ప్రకటించాలనేంత వరకూ వారి సలహాలు వెళ్లాయి. తద్వారా మార్కెట్‌ సెంటిమెంటును పెంచి, ప్రభుత్వంతో తమ బాధ్యతను పంచుకోవాలని సూచించడం నన్ను వ్యాకులతకు గురి చేసింది. ఒక సమావేశంలో మాయారామ్‌ అయితే ప్రపంచంలో అంతటా.. ప్రభుత్వాలకు కేంద్ర బ్యాంకులు సహకరిస్తుంటాయని, మన ఆర్‌బీఐ మాత్రం తిరుగుబాటు ధోరణిలో ఉంటుంద’ని వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వానికి ఆర్‌బీఐ ఒక చీర్‌లీడర్‌లా వ్యవహరించాలనడం నన్ను అశాంతికి గురి చేసింది. అయినా కూడా ఆర్‌బీఐ తన అత్యుత్తమ విధానాలకు దూరంగా వెళ్లలేద’ని సుబ్బారావు విశదీకరించారు.

చిదంబరం మాటను తిరస్కరించా: ‘2012లో చిదంబరం హోం శాఖ నుంచి ఆర్థిక శాఖకు తిరిగి వచ్చినపుడు.. పరపతి విధానాన్ని సరళతరం చేయాలని సూచించారు. ఆయన వాదనను నేను అంగీకరించలేద’ని దువ్వూరి తెలిపారు. ‘ఆయన ఆ సమయంలో ఆర్‌బీఐ ధోరణిపై బలంగా తన వాణిని వినిపించారు. వృద్ధి విషయంలో ప్రభుత్వం ఒంటరిగా నడవాలని మీరు అనుకుంటే అలానే చేస్తామ’ని అన్నారని గుర్తు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని