ఫండ్లలోకి 35% పెరిగిన పెట్టుబడులు

ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా రాణించడానికి తోడు చిన్న మదుపరుల భాగస్వామ్యం అధికంగా ఉండడంతో.. మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ గత ఆర్థిక సంవత్సరం రూ.14 లక్షల కోట్లు పెరిగి (35% వృద్ధి) రూ.53.40 లక్షల కోట్లకు చేరింది.

Published : 17 Apr 2024 01:43 IST

రూ.53.40 లక్షల కోట్లకు ఏయూఎం
2023-24 గణాంకాలు విడుదల చేసిన యాంఫీ

ఈనాడు, హైదరాబాద్‌: ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా రాణించడానికి తోడు చిన్న మదుపరుల భాగస్వామ్యం అధికంగా ఉండడంతో.. మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ గత ఆర్థిక సంవత్సరం రూ.14 లక్షల కోట్లు పెరిగి (35% వృద్ధి) రూ.53.40 లక్షల కోట్లకు చేరింది. 2023 మార్చి చివరకు ఎయూఎం రూ.39.42 లక్షల కోట్లుగా ఉంది. 2020-21లో లభించిన 41% వృద్ధి తర్వాత ఇదే అధికమని మంగళవారం విడుదలైన భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (యాంఫీ) వార్షిక నివేదిక తెలిపింది.

  • గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 4.46 కోట్ల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. దీంతో పోర్ట్‌ఫోలియోల సంఖ్య 17.78 కోట్లకు చేరుకుంది. పెట్టుబడిదారుల్లో 23% మహిళలే.
  • క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల నికర పెట్టుబడులు మ్యూచువల్‌ ఫండ్లలోకి వచ్చాయి.  
  • ప్రధానంగా ఈక్విటీ, హైబ్రిడ్‌, సొల్యూషన్‌ ఓరియెంటెడ్‌ స్కీముల్లో పెట్టుబడులు వృద్ధి చెందాయి. దీనికి ప్రధాన కారణం వ్యక్తిగత పెట్టుబడిదారులు ముఖ్య పాత్ర పోషించారు. మార్చి నాటికి పరిశ్రమ ఆస్తుల్లో దాదాపు 58%, ఫోలియోల సంఖ్యలో 80% వాటా వీటిల్లోనే ఉంది.
  •  ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలో 55% పెరిగాయి. బలమైన ఇన్‌ఫ్లోలు, మార్కెట్‌ లాభాల కారణంగా ఈ ఆస్తుల విలువ రూ.23.50 లక్షల కోట్లకు చేరింది.
  • డెట్‌ ఫండ్లు గత ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధిని సాధించాయి. వీటి ఆస్తుల విలువ రూ.12.62 లక్షల కోట్లకు పెరిగింది.
  • ఈక్విటీ విభాగంలో ఫ్లెక్సీ క్యాప్‌ అతిపెద్ద విభాగంగా అవతరించింది. తర్వాత స్థానంలో లార్జ్‌ క్యాప్‌ ఫండ్లు ఉన్నాయి. మల్టీ క్యాప్‌ ఫండ్లు 85% వృద్ధి రేటును నమోదు చేశాయి.
  • నీ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లలోకి (ఈటీఎఫ్‌) సంస్థాగత పెట్టుబడులు అధికంగా వచ్చాయి. మార్చి నాటికి ఈ ఫండ్ల ఏయూఎం విలువ రూ.6.64 లక్షల కోట్లకు చేరుకుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని